గాడి తప్పిన గురువు
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:34 AM
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు సభ్యత మరిచాడు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాలికల పట్ల అసభ్యకర ప్రవర్తన
సరిపల్లి ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం తీరుపై తల్లిదండ్రుల ఆందోళన
పోలీసులకు ఫిర్యాదు
ఆయన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండడంలేదని సమాచారం
పెందుర్తి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు సభ్యత మరిచాడు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలుర పట్ల పైశాచికంగా వ్యవహరించాడు. అతడి వైఖరితో విసిగిపోయిన బాలికలు పాఠశాలకు వెళ్లబోమని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు 37 మంది బాలబాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల బోధనకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గత ఏడాది జూన్‌లో జాగరపు చంద్రకోటి ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు. కొంతమంది బాలికలపై ఆయన ఎక్కడిపడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. రానురాను వికృత చేష్టలు పెరిగిపోవడంతో రెండు రోజుల క్రితం కొంతమంది బాలికలు బడికి వెళ్లబోమని తల్లిదండ్రులకు చెప్పారు. కారణమేమిటని ఆరా తీయగా ప్రధానోపాధ్యాయుడి గురించి చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ప్రధానోపాధ్యాయుడు ఆనారోగ్యంతో ఉన్నారని, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని సహచర ఉపాధ్యాయులు వారికి వివరించారు.
నిక్కర్‌తో ప్రధానోపాధ్యాయుడు
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నిక్కరు (షార్ట్)తో ఉన్నారు. హెచ్‌ఎంకు పక్షవాతం రావడంతో కాలు, చేయి సక్రమంగా పనిచేయడం లేదని, మూర్ఛ వ్యాధి కూడా ఉందని, దాంతో పాటు అతని మానసిక పరిస్థితి సక్రమంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు బదులుగా పాఠాలు బోధించేందుకు హెచ్‌ఎం వేరొకరిని నియమించుకున్నట్టు ఇతర ఉపాధ్యాయులు తెలిపారు. విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తూ బాలురును కొడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ కేవీ సతీశ్‌కుమార్ వివరణ ఇస్తూ హెచ్‌ఎం వ్యవహారం ఎంఈవో, డీఈవో దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రాథమిక విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.