Share News

అరకొర చమురు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:06 PM

పశ్చిమాసియా దేశాల యుద్ధం ప్రభావం జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో బంకుల్లో ఎప్పుడు చమురు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అరకొర  చమురు
పాడేరులో నో స్టాక్‌ బోర్డు పెట్టిన ఐవోసీ బంకు

తీవ్రమవుతున్న పెట్రోల్‌, డీజిల్‌ కొరత

వాహన చోదకులకు తప్పని అవస్థలు

పాడేరులో రెండు బంకుల్లోనే నిల్వలు, ఐదు బంకుల్లో అంతంతమాత్రమే..

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పశ్చిమాసియా దేశాల యుద్ధం ప్రభావం జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో బంకుల్లో ఎప్పుడు చమురు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రం పాడేరులో ఏడు బంకులుండగా, రెండు బంకుల్లో మాత్రమే డీజిల్‌, పెట్రోల్‌ నిల్వలున్నాయి. మిగిలిన బంకుల్లో ఎప్పుడు ఏం ఉంటుందో తెలియని దుస్థితి కొనసాగుతున్నది. పాడేరులో గురువారం పాత బంకులో పెట్రోల్‌, డీజిల్‌ లేకపోగా తలారిసింగిలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బంకులోనూ అదే పరిస్థిఽతి నెలకొంది. అలాగే చింతలవీధిలో ఐటీడీఏ నిర్వహణలో ఉన్న హెచ్‌పీ బంకులో పెట్రోల్‌ లేదు. జి.మాడుగుల మార్గంలో ఉన్న భారత్‌ పెట్రోలియం బంకులో డీజిల్‌ లేదు. ఇక విశాఖపట్నం వెళ్లే మెయిన్‌ రోడ్డులో ఉన్న టి.చిట్టినాయుడు, బొర్రా విజయరాణి ఫిల్లింగ్‌ స్టేషన్లలో మాత్రమే డీజిల్‌, పెట్రోల్‌ ఉంది. అయితే విశాఖపట్నంలోని ఆయా ఆయిల్‌ కంపెనీలకు వచ్చే నిల్వల ఆధారంగా మాత్రమే తమకు సరఫరా జరుగుతున్నదని, ఈ క్రమంలో డీజిల్‌, పెట్రోల్‌ అందుబాటులో ఉంటాయన్నారు. విదేశాల నుంచి వచ్చే నిల్వల ఆధారంగా మాత్రమే పరిస్థితులు ఆధారపడ్డాయని, ఈ నేపథ్యంలో బంకుల్లో చమురు నిల్వలపై కచ్చితంగా ఏమీ చెప్పలేమని యజమానులు అంటున్నారు. అయితే తాజా పరిణామాలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

జీకేవీధిలో పెట్రోల్‌ బంకు మూసివేత

మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ నిర్వహణలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ బంకు మూతపడింది. ఇంధన నిల్వలు లేక రెండు రోజులుగా దీనిని సిబ్బంది మూసివేశారు. 15 పంచాయతీల ప్రజలకు ఈ బంకే ఆధారం. గతంలో జీసీసీ అధికారులు క్రెడిట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ తీసుకొచ్చి విక్రయాలు జరిపేవారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌కి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. దీంతో హెచ్‌పీ అధికారులు ముందుగా నగదు చెల్లిస్తేనే తప్ప పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకులు పంపించడం లేదు. జీసీసీ అధికారులు పెట్రోల్‌, డీజిల్‌కి నగదు చెల్లించకపోవడం వల్ల హెచ్‌పీ బంకు అధికారులు సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం జీకేవీధి మండలంలో ప్రైవేటు వ్యాపారులు చింతపల్లి నుంచి డీజిల్‌, పెట్రోల్‌ తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా జీసీసీ అధికారులు పెట్రోల్‌ బంకు సేవలను పునరుద్ధరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:06 PM