Share News

చిరకాల స్వప్నం సాకారం..

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:52 AM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎట్టకేలకు పద్దెనిమిది ఏళ్ల తరువాత సొంత గూడు ఒనగూరుతోంది.

చిరకాల స్వప్నం సాకారం..

మాడుగుల డిగ్రీ కళాశాలకు ఎట్టకేలకు సొంతగూడు

18 ఏళ్ల నుంచి పరాయి పంచన తరగతులు

విద్యార్థులతోపాటు అధ్యాపకుల ఇబ్బందులు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం దృష్టికి సమస్య

ఎమ్మెల్యే బండారు కృషితో నిధులు కేటాయించిన ఎంపీ, కలెక్టర్‌

శరవేగంగా భవనాల నిర్మాణం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి సొంత భవనాల్లో తరగతులు

మాడుగుల రూరల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎట్టకేలకు పద్దెనిమిది ఏళ్ల తరువాత సొంత గూడు ఒనగూరుతోంది. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో కోటి రూపాయల పైచిలుకు వ్యయంతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నాటికి పనులన్నీ పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి సొంత భవనాల్లో డిగ్రీ తరగతులు నిర్వహించేలా అధికారులు కృషి చేస్తున్నారు.

మాడుగులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2008లో మంజూరైంది. అప్పట్లో స్థలాన్ని ఎంపిక చేయకపోవడం, నిధులు విడుదల కాకపోవడతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా తరగతులను ప్రారంభించారు. సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులు వుండేవి. వసతి చాలకపోవడంతో ఉదయం ఉదయం 7.30 నుంచి 12.30 గంటల వరకు జూనియర్‌ కళాశాల, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు డిగ్రీ కళాశాల తరగతులను నిర్వహించడం మొదలుపెట్టారు. దీంతో తరగతుల వేళలు తగ్గడం, సైన్స్‌ ల్యాబ్‌, గ్రంథాలయం వంటివి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైన్స్‌ ల్యాబ్‌ ప్రాక్టికల్స్‌ కోసం చోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లి రావాల్సి వచ్చేంది. దీంతో పలువురు విద్యార్థులు ఇక్కడ చేరకుండగా, చోడవరం కళాశాలలో చేరడం మొదలుపెట్టారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య ఊహించినంతగా పెరగలేదు. సొంత భవనాల నిర్మాణంతోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు, అధ్యాపకులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే సరైన స్థలం లభించకపోవడంతో సొంతూ గూడు ఒనగూరలేదు. ఇదే సమయంలో జూనియర్‌ కళాశాల యాజమాన్యం నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ఇంటర్‌ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించడానికి డిగ్రీ కళాశాలను వేరేచోటుకు తరలించాలని స్పష్టం చేశారు. దీంతో 2023 జూన్‌ నెలలో స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణానికి ఆనుకొని ఖాళీగా వున్న బాలికల వసతిగృహం భవనంలోకి డిగ్రీ కళాశాలను తరలించారు. ఇక్కడ మొత్తం 12 గదులు వుండడంతో పూర్తిస్థాయిలో తరగతుల నిర్వహణకు వీలుకలిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఎస్సీ మ్యాఽఽథ్స్‌, కంప్యూటర్స్‌, బోటనీ, జువాలజీ, బీఏ హిస్టరీ, పాలిటిక్స్‌, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ గ్రూపులు ఉన్నాయి. సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రిన్సిపాల్‌తో కలిపి 12 మంది అధ్యాపకులు ఉన్నారు. రెండుపూటలా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పటికైనా బాలికల వసతిగృహ భవనాన్ని ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కళాశాలకు సొంత భవనాల కోసం స్థలం, నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సర్వే నంబరు 261లో 3.46 ఎకరాలు, సర్వే నంబరు 262లో ఒక ఎకరాల 54 సెంట్లు.. మొత్తం ఐదు ఎకరాలను కేటాయించేలా కృషి చేశారు. భవనాలకు నిధుల కోసం కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో మాట్లాడారు. గత ఏడాది ఆగస్టులో జిల్లా అఽభివృద్ధి నిధుల్లో నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఆయన ఎంపీ నిధులు కోటి రూపాయిలు మంజూరు చేశారు. మొత్తం కోటి పది లక్షల రూపాయలతో సమగ్ర శిక్ష అధికారులు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్‌తో భవన నిర్మాణ పనులు ప్రారంభింపజేశారు. , సర్వే నంబరు 262లోని స్థలంలో రెండు అంతస్థులతో భవనం నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం ఎనిమిది గదులు వుంటాయి. రెండో అంతస్థు శ్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ భవనం పక్కనే ప్రిన్సిపాల్‌కు, ఆఫీసు కోసం చిన్నపాటి భవనం నిర్మిస్తున్నారు. ప్రహరీ గోడ, మరుగుదొడ్లు నిర్మిస్తారు. ఈ పనులన్నీ జూన్‌ చివరినాటికి పూర్తవుతాయని, జూలై ఒకటో తేదీ నుంచి కొత్త భవనంలో డిగ్రీ తరగతులు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్‌ శాస్ర్తి తెలిపారు. ఇంకా ల్యాబ్‌లు, గ్రంథాలయం, విద్యార్థులకు డైనింగ్‌ హాలు, అధ్యాపకులకు స్టాఫ్‌ రూమ్‌ వంటివి నిర్మించాల్సి వుందని, వీటిని నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Feb 24 , 2026 | 01:52 AM