‘కూలి’న ప్రాణం
ABN , Publish Date - May 04 , 2026 | 01:02 AM
రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీ ఎత్తు పెరగడంతో తన షాపులోకి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో దానిని ఎత్తు పెంచేందుకు యజమాని చేసిన ప్రయత్నం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
శ్లాబు ఎత్తు పెంచేందుకు యజమాని యత్నం
జాకీలతో పనులు చేపట్టిన ఆరుగురు కూలీలు
ఒక్కసారిగా కుప్పకూలిన శ్లాబు
శిథిలాల్లో చిక్కుకుని ఒకరి దుర్మరణం
మరో ముగ్గురికి గాయాలు
వికాస్‌నగర్‌లో సంఘటన
పెదగంట్యాడ మే 3 (ఆంధ్రజ్యోతి):
రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీ ఎత్తు పెరగడంతో తన షాపులోకి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో దానిని ఎత్తు పెంచేందుకు యజమాని చేసిన ప్రయత్నం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. శ్లాబ్‌ను ఎత్తు చేసేందుకు కూలీలు జాకీలతో పనులు ప్రారంభించగా ఒక్కసారిగా కుప్పకూలి ఓ కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందాడు. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది.
పెదగంట్యాడ మండలం వికాస్‌నగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌కు మెయిన్ రోడ్డు పక్కన ఓ షాపు ఉంది. ఇటీవల జీవీఎంసీ మెయిన్ రోడ్డు ఆధునికీకరణ పనులను చేపట్టింది. ఇందులో భాగంగా షాపు ముందు డ్రైనేజీ ఎత్తు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో షాపులో నిర్వహిస్తున్న ఫొటో స్టూడియోను మరో ప్రాంతానికి మార్చారు. శ్లాబ్ ఎత్తు పెంచి, దానికి అనుగుణంగా గోడలు పెంచాలన్న ఉద్దేశంతో షాపు యజమాని గాజువాక మార్కెట్‌కు చెందిన ఆరుగురు కూలీలను నియమించుకున్నారు. వీరంతా ఆదివారం పనులకు వచ్చి 13 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పుకలిగిన శ్లాబును 12 జాకీలతో పైకి ఎత్తే ప్రయత్నంచేశారు. కాగా షాపు అప్పటికే శిఽథిలావస్థలో ఉండడంతో విరిగిపోయి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కార్మికుడు తిమ్మల నాగేశ్వరరావు (38) శిథిలాల కింద నలిగి మృతి చెందాడు. ప్రసాదరావు, గొర్ల నారాయణరావు, సత్యనారాయణ స్వల్పగాయాలతో బయటపడ్డారు. శ్లాబునకు బయట నుంచి జాకీలు వేస్తున్న రాజు, నారాయణరావు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సమాచారం మేరకు న్యూపోర్టు సీఐ టి.కామేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు.పెదగంట్యాడ అగ్నిమాపక విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది కూడా చేరుకుని, నాగేశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జాకీలను ఉపయోగించి శిథిలాలను ఎత్తేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో గంగవరం పోర్టు నుంచి భారీ క్రేన్‌ను రప్పించి, రాత్రి 8.30 సమయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. షాపు యజమాని నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.