పశు పోషణకు పెద్దపీట
ABN , Publish Date - May 15 , 2026 | 12:56 AM
పశు పోషణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. పాడి రైతులకు ఆర్థిక భరోసా ఇస్తోంది. పాడి రైతులకు 20 శాతం హైప్రొటీన్, ఇతర పోషక విలువలతో కూడిన దాణాను రాయితీపై అందజేస్తోంది.
పాడి రైతులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ
పాల ఉత్పత్తి పెంచాలని లక్ష్యం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
పశు పోషణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. పాడి రైతులకు ఆర్థిక భరోసా ఇస్తోంది. పాడి రైతులకు 20 శాతం హైప్రొటీన్, ఇతర పోషక విలువలతో కూడిన దాణాను రాయితీపై అందజేస్తోంది. దీని వినియోగం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1.85 లక్షల ఆవులు, 2.5 లక్షల గేదెలు ఉన్నాయి. వేసవిలో పచ్చిమేత అందుబాటులో లేక ఎక్కువ శాతం రైతులు ఎండు గడ్డిపై ఆధారపడుతున్నారు. ఈ కారణంగా పాల దిగుబడి తగ్గుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు దాణా పంపిణీ చేస్తోంది. 50 కిలోల బస్తా ధర రూ.1,110 ఉండగా 50 శాతం సబ్సిడీపై రూ.555కు రైతులకు అందజేస్తున్నది. రెండు పశువులు, ఒక దూడకు 50 కిలోల చొప్పున మూడు నెలలకు 3 బస్తాలు పంపిణీ చేస్తున్నారు.
సబ్సిడీపై దాణా కావాలంటే...
ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందాలనుకొనే చిన్న, సన్నకారు పాడి రైతులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దాణా కావాల్సిన రైతులు ముందుగా సమీపంలోని పశువైద్యశాల లేదా రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా జిల్లాకు మొత్తం 966.2 టన్నుల హైప్రొటీన్ దాణా నిల్వలు కేటాయించారు. 19,324 మంది రైతులకు వీటిని ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. రెండో విడత మరో 534 టన్నులు జూన్ నెలాఖరులోగా పంపిణీ చేయనున్నారు.
పాల దిగుబడి పెంచడమే లక్ష్యం
పాల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం దాణాపై 50 శాతం సబ్సిడీ ఇస్తోందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్ రామ్మోహన్‌రావు సూచించారు. పాలల్లో వెన్న శాతం, నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. మంచి దాణా అందించడం వల్ల పశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. గర్భధారణలో ఉన్న పశువులకు పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సంతానోత్పత్తి సాధ్యమని పాడి రైతులు గుర్తించాలని ఆయన సూచించారు.