Share News

సంద్రంలో జల విహారం!

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:46 AM

విశాఖపట్నం పోర్టు రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్‌ టెర్మినల్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు.

సంద్రంలో  జల విహారం!

భీమిలికి మినీ క్రూయిజ్‌లు

పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు

70 నుంచి 80 మంది పట్టేలా చిన్నవి నడపాలని యోచన

పోర్టు అనుమతిస్తే పర్యాటకులకు పండగే

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం పోర్టు రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్‌ టెర్మినల్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. టెర్మినల్‌ ప్రారంభించి రెండేళ్లు పూర్తవుతున్నా పర్యాటకులకు అందుబాటులో లేదు. ఏడాదికి ఒకసారి చెన్నై నుంచి విశాఖపట్నం మీదుగా పాండిచ్చేరికి కార్డిలియోస్‌ క్రూయిజ్‌ తిరిగి ఆ తరువాత మాయమైపోతోంది. ఇది సీజన్‌లో మాత్రమే వారానికి రెండు రోజుల చొప్పున ఐదు నుంచి ఆరు ట్రిప్పులు తిరుగుతోంది. ఇంతకుమించి ఆ టెర్మినల్‌కు ఏ క్రూయిజ్‌లు రావడం లేదు. పోర్టు అధికారులు, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రతినిధులు కలిసి ఈ అంశంపై పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. క్రూయిజ్‌లను విశాఖ రప్పించడానికి యత్నిస్తామన్నారు. కానీ సాధ్యం కాలేదు. అయితే పెద్ద క్రూయిజ్‌ల కంటే ముందు లోకల్‌ క్రూయిజ్‌లతో విశాఖ వచ్చే పర్యాటకులకు సముద్ర విహారం అందుబాటులోకి తేవాలని జిల్లా పర్యాటకశాఖ యత్నిస్తోంది. ఇందుకోసం మినీ క్రూయిజ్‌లను నడుపుతామని ఏపీటీడీసీ ద్వారా విశాఖపట్నం పోర్టుకు ప్రతిపాదనలు సమర్పించింది. క్రూయిజ్‌ టెర్మినల్‌ను పర్యాటకులు ఎక్కి, దిగేందుకు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరింది.

ఏమి చేస్తారంటే...?

సుమారు 70 నుంచి 80 మంది పట్టేలా చిన్న క్రూయిజ్‌ను విశాఖపట్నం నుంచి భీమిలి వరకు నడుపుతారు. అందులో స్నాక్స్‌ వంటివి ఇస్తారు. సముద్ర విహారం పూర్తయిన తరువాత తిరిగి విశాఖపట్నం క్రూయిజ్‌ టెర్మినల్‌ వద్దనే దించుతారు. ఇంకా ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే విజయనగరం జిల్లాలోని చింతపల్లి, శ్రీకాకుళం జిల్లా బారువ వరకు తీసుకువెళతారు. అయితే ఈ క్రూయిజ్‌ల నుంచి మధ్యలో ఎక్కడా దిగడానికి అవకాశం లేదు. ఉత్తరాంధ్రాలో ఎక్కడా జెట్టీలు లేకపోవడమే దీనికి కారణం. మూలపేటలో పోర్టు ప్రారంభమైన తరువాత అక్కడకు వెళ్లే అవకాశం ఉంది. ఇది కాకుండా రాత్రి పూట సముద్రంలో బస చేయాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ‘యాచ్‌’లను కూడా నడపడానికి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. వాటిలో 12 నుంచి 15 మంది ప్రయాణించవచ్చు. అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయి. రాత్రి నింద్రించేందుకు బెడ్‌రూమ్‌ వంటివి ఏర్పాటుచేస్తారు. చీకటిపడిన తరువాత సముద్రంలో లంగరు వేసి నిలిపివేస్తారు. మళ్లీ ఉదయం తీసుకువస్తారు.

అనుమతుల కోసం రాశాం

విశాఖలో క్రూయిజ్‌ టెర్మినల్‌ను ఉపయోగించుకునేలా మినీ క్రూయిజ్‌ల కోసం ప్రతిపాదనలు తయారుచేశాం. ఏపీటీడీసీ ద్వారా విశాఖపట్నం పోర్టుకు అనుమతుల కోసం పంపించాం. అనుమతులు వస్తే మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేసి పర్యాటకులకు మరో సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తాం.

- జగదీశ్‌, డీవీఎం, ఏపీటీడీసీ

Updated Date - Apr 06 , 2026 | 12:46 AM