అలలపై కలల విహారం..
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:22 AM
అలల ఊపులో, మైమరిపించే కలల నౌకలో హాయిగా విహరిస్తూ...నడిరేయి తారాచంద్రుల విలాసాలను పరికిస్తున్నపుడు..మది పులకించకుండా ఎలా ఉంటుంది?...ఇది ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కార్డిలియో క్రూయిజ్‌లో ప్రయాణిస్తే లభిస్తుంది. దానిలో విహరిస్తున్న పర్యాటకులు అదే అనుభూతి వ్యక్తం చేస్తున్నారు.
విశాఖకు మళ్లీ కార్డిలియో క్రూయిజ్
చెన్నై నుంచి వచ్చిన నౌక
1,750 మందితో తిరుగు ప్రయాణం
కొత్త అనుభూతి అంటున్న పర్యాటకులు
విశాఖపట్నం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):
అలల ఊపులో, మైమరిపించే కలల నౌకలో హాయిగా విహరిస్తూ...నడిరేయి తారాచంద్రుల విలాసాలను పరికిస్తున్నపుడు..మది పులకించకుండా ఎలా ఉంటుంది?...ఇది ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కార్డిలియో క్రూయిజ్‌లో ప్రయాణిస్తే లభిస్తుంది. దానిలో విహరిస్తున్న పర్యాటకులు అదే అనుభూతి వ్యక్తం చేస్తున్నారు.
క్రూయిజ్ హబ్‌గా మారుతున్న విశాఖకు కార్డిలియో క్రూయిజ్ మళ్లీ వచ్చింది. చెన్నైలో సోమవారం సాయంత్రం బయలుదేరిన ఈ నౌక రెండు రాత్రులు బంగాళాఖాతంలో ప్రయాణించి 1,750 మంది పర్యాటకులను విశాఖపట్నం తీసుకువచ్చింది. ఇక్కడి నుంచి బుధవారం సాయంత్రం తిరిగి బయలుదేరిన ఈ క్రూయిజ్‌లో మరో 1,750 మంది చెన్నై వెళ్లారు. ఈ పర్యటన ఎంతో ఆనందాన్ని, కొత్త అనుభూతిని ఇచ్చిందని పర్యాటకులు వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్‌గా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోర్టులో సుమారు రూ.100 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మించింది. పెద్ద సంఖ్యలో క్రూయిజ్‌లను రప్పించడానికి ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. గతంలో ఏడాదికి మూడుసార్లు విశాఖ వచ్చిన కార్డిలియో క్రూయిజ్‌ను ఇరవైసార్లు నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో క్రూయిజ్ నౌక నిర్వాహకులతో ప్రత్యేకంగా 25 నిమిషాలు మాట్లాడారు. దశల వారీగా వాయేజ్‌లు(ట్రిప్పులు) పెంచుతామని, ఈసారి ఐదుసార్లు నడుపుతామని హామీ ఇచ్చారు. ఆ మేరకు తొలి వాయేజ్‌ను సోమవారం ప్రారంభించి బుధవారం విశాఖపట్నం తీసుకువచ్చారు.
క్రూయిజ్ కనీస టికెట్ ధర రూ.22 వేలు
క్రూయిజ్‌లో ఎన్ని రాత్రులు ప్రయాణం చేస్తారనే దానిపై టికెట్ ధర ఆధారపడి ఉంటుంది. ఇందులో క్యాబిన్ రూమ్, స్ట్రెయిటన్ (లగ్జరీ) రూమ్ ఉంటాయి. క్యాబిన్ రూమ్‌లో విమానంలో విండోలా అద్దం మాత్రమే ఉంటుంది. అందులో నుంచే సముద్రాన్ని చూడాలి. అదే స్ట్రెయిటన్ రూమ్‌లైతే విశాలంగా ఉండడంతో పాటు బాల్కనీ కూడా వస్తుంది. అక్కడ రెండు కుర్చీలు, టీ పాయ్ ఉంటాయి. ఈ రూమ్ ధర అధికం. వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునే ధరలకు, ట్రావెల్ ఏజెంట్ల ధరకు తేడాలు ఉంటాయి. విమానం టికెట్లలాగే వీటికి కూడా ప్రయాణం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ డైనమిక్ ప్రైసింగ్ విధానంలో రేటు పెరుగుతుంది. ప్రస్తుతం క్యాబిన్ రూమ్‌కు రోజుకు రూ.11 వేలు చొప్పున విశాఖ నుంచి చెన్నై పోర్టుకు చేరడానికి రెండు రాత్రుల ప్రయాణానికి రూ.22 వేలు వసూలు చేస్తున్నారు. పన్నులు అన్నీ కలుపుకొని ఈ ధర. అదే లగ్జరీ రూమ్ అయితే అత్యధికంగా రూ.76 వేలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు అందరికీ ఒకే రకమైన ఆహారం, డ్రింకులు, వినోదం అందిస్తారు. ఇతర సౌకర్యాలు అంతా సమానంగా ఉపయోగించుకోవచ్చు.
ఇవీ ప్రత్యేకతలు
భారత సముద్ర జలాల్లో తిరిగే ఏకైక క్రూయిజ్ ఎంవీ ఎంప్రెస్ కార్డిలియో. ఇది చెన్నై-విశాఖపట్నం-పారాదీప్, కోల్‌కతా పోర్టులతో పాటు సింగపూర్, మలేషియాలకు పర్యాటకులను తీసుకువెళుతుంది. ఈ నౌక ఖరీదు సుమారు రూ.450 కోట్లు. దీనిని 1990లో నిర్మించారు. నౌక బరువు 48,563 టన్నులు. నౌకలో మొత్తం 11 అంతస్తులు ఉంటాయి. ఇందులో పర్యాటకుల కోసం 796 క్యాబిన్లు ఉన్నాయి. 1,800 నుంచి 2 వేల మంది వరకు ప్రయాణం చేయొచ్చు. దీని వేగం గంటకు 19.5 నాటికల్ మైళ్లు. ఈ క్రూయిజ్‌లో సిబ్బంది సుమారు 750 మంది వరకు ఉంటారు. ఇందులో డైనింగ్ కోసం రెండు అంతస్తులు కేటాయించారు. డెక్‌లో ఒకేసారి 921 మంది భోజనాలు చేయొచ్చు. ఇవికాకుండా 6 రెస్టారెంట్లు, 2 బార్లు, ఒక క్యాసినో, రెండు అంతస్తుల ఆడిటోరియం ఉన్నాయి.
- రోజుకు ఐదుసార్లు భోజనం ఉంటుంది. శాకాహారం, మాంసాహారం వేర్వేరుగా ఉంటాయి. ఎంతైనా తినవచ్చు. ఉదయం ఏడు నుంచి తెల్లవారుజామున 1.30 గంటల వరకు ఈ రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి.
- పర్యాటకులకు ఆనందం పంచడానికి రెండు లైవ్ షోలు నిర్వహిస్తారు. ఒకటి డ్యాన్సులు, స్కిట్‌లతో అలరిస్తే మరొకటి లైవ్ మ్యూజిక్ షో ఉంటుంది. ట్రిప్‌లో మ్యాజిక్ షో కూడా ఉంటుంది.
- స్విమ్మింగ్‌పూల్, జిమ్ కూడా షిప్‌లో ఉన్నాయి. వీటిని టైమింగ్స్ ప్రకారం అనుమతిస్తారు.
- కేసినో రాత్రి ఏడు గంటలకు మొదలై తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లల్ని కూడా అనుమతిస్తారు.
- క్రూయిజ్‌లో ఏది కొనుక్కోవాలన్నా డాలర్లలో చెల్లింపులు చేయాలి.