ఏపీటీడీసీకి ఝలక్
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:39 AM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.
తొట్లకొండ వద్ద గల శాంక్టమ్ రిసార్ట్ కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు
చాలాకాలం కిందట లీజుకు ఇచ్చిన పర్యాకాభివృద్ధి సంస్థ
వారి నుంచి సబ్ లీజుకు తీసుకున్న వైసీపీ నాయకులు
ఇష్టారాజ్యంగా మార్పులు
నిబంధనలు ఉల్లంఘించడంతో న్యాయస్థానం జోక్యం
విశాఖపట్నం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. తొట్లకొండలో కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలని జీవీఎంసీని ఆదేశిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది.
కాపులుప్పాడ సర్వే నంబరు 314లోని 2.4 ఎకరాల విస్తీర్ణంలో ఏపీటీడీసీ చాలాకాలం క్రితం తొట్లకొండకు వచ్చే పర్యాటకుల కోసం చిన్న రెస్టారెంట్ ఏర్పాటుచేసింది. ఆ ప్రాంతం సీఆర్‌జెడ్‌లో ఉండడంతో పక్కా నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. దానిని ఏపీటీడీసీ లీజుకు ఇచ్చింది. లీజుదారుడి నుంచి వైసీపీ నాయకులు ముగ్గురు సబ్ లీజుకు తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ విషయం తెలిసినా ఏపీటీడీసీ అధికారులు లీజు రద్దు చేయలేదు. ఆ చిన్న రెస్టారెంట్‌ను సబ్ లీజుదారులు తమ ఇష్టారాజ్యంగా మార్చేశారు. స్విమ్మింగ్ పూల్, ఏసీ గదులు, రెస్టారెంట్ వంటివి నిర్మించారు. సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించారు. అక్కడ మద్యం విక్రయించడానికి ఏపీటీడీసీ రాయితీ ధర (పర్యాటకుల కోసమని)పై లైసెన్స్ తీసుకుంటే... దానిని కూడా వారు చేతిలో పెట్టుకొని ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయించారు. ఈ నిబంధనల ఉల్లంఘనలను విశాఖపట్నం ఫిషర్ విమెన్ డ్రై ఫిష్ కో-ఆపరేటివ్ సొసైటీ 2018లోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. వారు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో కేసు వేసింది. ఆ తరువాత దీంతో పాటు మరికొన్ని బీచ్ రెస్టారెంట్ల నిబంధనల ఉల్లంఘనలపై జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్ కేసులు వేశారు. తప్పులు సరిచేసుకోవాలని జీవీఎంసీ అధికారులు అనేక అవకాశాలు ఇచ్చారు. కానీ ఏపీటీడీసీ అధికారులు పట్టించుకోలేదు. నిర్మాణాలకు ఎవరి నుంచి అనుమతులు తీసుకున్నారో చూపించాలని కోరినా ఎటువంటి పత్రాలు సమర్పించలేదు. పైగా తమది ప్రభుత్వ కార్పొరేషన్ అని, నిబంధనలు తమకు వర్తించవని వాదించారు. ఇవన్నీ పరిశీలించిన హైకోర్టు చట్టం ముందు అంతా సమానమేనని, దానికి ఎవరూ అతీతులు కారని ప్రత్యేకంగా పేర్కొంటూ శాంక్టమ్ పేరు కలిగిన ఈ రెస్టారెంట్‌లో అక్రమ నిర్మాణాలన్నీ తొలగించాలని గురువారం తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అందిన మూడు వారాల్లో తొలగింపు పూర్తికావాలని జీవీఎంసీని ఆదేశించింది. ఏపీటీడీసీ ఇకపైనైనా ఇలాంటి రుబాబు పనులు చేయకుండా, బీచ్ మార్గంలో నిబంధనలు అనుగుణంగా వ్యవహరించాలి.