Share News

పన్ను బకాయిదారులకు మహా షాక్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:35 AM

ఆస్తి పన్ను బకాయిల వసూలు దిశగా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు దూకుడుపెంచారు.

పన్ను బకాయిదారులకు మహా షాక్‌

జప్తు నోటీసులు జారీ

స్పందించకపోతే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

ఆ తరువాత ఆస్తుల జప్తు

రూ.11.43 లక్షలు బకాయి ఉన్న వాల్‌మార్ట్‌ను సీజ్‌ చేసిన అధికారులు

(విశాఖపట్నం-ఆంఽదజ్యోతి)

ఆస్తి పన్ను బకాయిల వసూలు దిశగా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు దూకుడుపెంచారు. మొండి బకాయిలను రాబట్టేందుకు కఠిన చర్యలకు దిగుతున్నారు. ముందుగా బకాయిదారులకు నోటీసులు జారీచేస్తున్నారు. వారి నుంచి స్పందన రాకపోతే పన్ను బకాయి ఉన్న ఆస్తులు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేస్తున్నారు. అప్పటికీ పన్ను బకాయిలు చెల్లించకపోతే సీజ్‌ చేస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో 6,02,937 ఆస్తి పన్ను అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.566.41 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.360 కోట్లు వసూలైంది. మిగిలిన మొత్తంలో చాలావరకూ మొండి బకాయిదారులే ఉండడంతో వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. దీంతో రెవెన్యూ విభాగం డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బకాయిదారులకు నోటీసులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ పరిధిలో సుమారు 1,36,149 మంది బకాయిదారులు ఉన్నట్టు గుర్తించడంతో వారందరికీ జప్తు నోటీసులు జారీచేయాలని అన్ని జోన్‌ల కమిషనర్లను ఆదేశించారు. ఇప్పటివరకూ 1,10,136 మందికి నోటీసులను అందజేశారు. అయినప్పటికీ వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో వారి ఆస్తుల వద్ద అందరికీ కనిపించేలా వారి పన్ను బకాయి వివరాలను తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేస్తున్నారు. అప్పటికీ బకాయిలు చెల్లించడానికి ముందుకురాకపోతే వారి ఆస్తులను సీజ్‌ చేస్తున్నారు. మధురవాడ జోన్‌ ఐదో వార్డు పరిధిలో యునైటెడ్‌ టెలికామ్స్‌ లిమిటెడ్‌ సంస్థ గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి పన్ను చెల్లించకపోవడంతో రూ.87,74,916 బకాయి ఉండిపోయింది. వారికి జప్తు నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. అలాగే గాజువాక జోన్‌ 57వ వార్డు పరిధిలో ఆకాశం అమ్ములు అనే అమ్మన్న అనే సంస్థ గత ఐదు సంవత్సరాల నుంచి పన్ను చెల్లించకపోవడంతో రూ.63,28,485 బకాయి పడింది. దీంతో ఆ సంస్థ ముందు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. నార్త్‌ జోన్‌ పరిధి 49వ వార్డులో ఐ.భాస్కరరావు అనే వ్యక్తి గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల నుంచి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో రూ.1,51,166 బకాయి ఉంది. అక్కడ కూడా హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. జప్తు నోటీసులకు స్పందించని వారి ఆస్తుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసే ప్రక్రియ కొనసాగుతోంది. హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసిన తర్వాత కూడా పన్ను చెల్లించని వారి ఆస్తులను సీజ్‌ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ పన్ను వసూళ్ల పట్ల సీరియస్‌గా వ్యవహరిస్తుండడంతో బకాయిదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.

-------------------------------

అరియర్‌ అసెస్‌మెంట్‌లు 1,36,149

బకాయిలు రూ.85 కోట్లు

జారీచేసిన జప్తు నోటీసులు 1,10,136

అరియర్‌ కొళాయి చార్జీలు అసెస్‌మెంట్‌లు 76,980

రావాల్సిన కొళాయి చార్జీలు బకాయిలు రూ.52 కోట్లు

-------------------------------

Updated Date - Feb 10 , 2026 | 01:35 AM