Share News

నగరాన జడివాన

ABN , Publish Date - May 23 , 2026 | 12:38 AM

రెండు, మూడు రోజుల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది.

నగరాన జడివాన

పెందుర్తి సమీపాన గల కొత్తపాలెంలో 26.25 మి.మీ.

ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు

చల్లబడిన వాతావరణం

ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):

రెండు, మూడు రోజుల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది. వర్షం కంటే ముందు గాలులు వీచాయి. శుక్రవారం ఉదయం నుంచి మేఘాలు ఆవరించినా ఉక్కపోత కొనసాగింది. అయితే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో విజయనగరం వైపు నుంచి జిల్లాలోకి భారీ మేఘాలు విస్తరించాయి. వాతావరణ అనిశ్చితి ప్రభావంతో వ్యాపించిన మేఘాల ప్రభావంతో మొదట కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు వచ్చాయి. భారీగా పిడుగులు పడ్డాయి. గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఆ తరువాత వర్షం మొదలైంది. దాంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గాలుల తీవ్రతను గుర్తించిన ఈపీడీసీఎల్‌ ముందుజాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. వర్షం...పైగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పలువురు వాహన చోదకులు బస్టాప్‌ల వద్ద ఉండిపోయారు. పెందుర్తి సమీపాన కొత్తపాలెంలో 26.25, షీలానగర్‌లో 25.5, సింహాచలంలో 20, పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో 15.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వాతావరణ అనిశ్చితితో వర్షం కురిసిందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో తాత్కాలికంగా వాతావరణం చల్లబడిందన్నారు.

పెదగదిలి జంక్షన్‌లో కూలిన ఆర్చి

పెదగదిలిలో దుర్గ ఎర్నిమాంబ ఉత్సవం కోసం కర్రలతో ఏర్పాటుచేసిన ఆర్చి శుక్రవారం రాత్రి వీచిన భారీ గాలులకు పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. అమ్మవారి ఉత్సవం రెండేళ్లకు ఒకసారి చేస్తారు. ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఆర్చి కూలిపోయింది.


ఉదయం నుంచి ఉక్కపోత

విశాఖ రూరల్‌లో 42.1 డిగ్రీలు

వడదెబ్బ బాధితులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):

శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మధ్యలో మేఘాలు ఆవరించినా నగరం, పరిసర ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగింది. అయితే గురువారంతో పోల్చితే గాడ్పుల తీవ్రత స్వల్పంగా తగ్గింది. ఉక్కపోత మాత్రం పెరిగింది. పద్మనాభం, విశాఖ రూరల్‌, ములగాడ మండలాల్లో వడగాడ్పులు వీచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అత్యధికంగా విశాఖ రూరల్‌లో 42.1, ములగాడలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు, నాలుగు రోజుల వరకు వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

కేజీహెచ్‌ సహా ఐదు ఆస్పత్రుల్లో వార్డులు ఏర్పాటు

వడదెబ్బకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. కేజీహెచ్‌తోపాటు వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని నాలుగు ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా హీట్‌ స్ర్టోక్‌ వార్డులను ఏర్పాటుచేశారు. కేజీహెచ్‌లో 13 పడకలతో రెండుచోట్ల వార్డులను ఏర్పాటుచేశారు. అలాగే, అగనంపూడి ఏరియా ఆస్పత్రిలో నాలుగు, గోపాలపట్నం, భీమిలి, పెందుర్తి ఆస్పత్రుల్లో రెండేసి పడకలతో కూడిన ఏసీ వార్డులను సిద్ధం చేసినట్టు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ నరేంద్రసింగ్‌ తెలిపారు. వడదెబ్బ తగిలినట్టు లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు.

వడదెబ్బ లక్షణాలు

వడదెబ్బకు గురైన వారిలో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. తల తిరగడం, మైకం కమ్మినట్టు అనిపించడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, చర్మం ఎండిపోయినట్టు మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం, బలహీనత, అలసట, ఒక్కోసారి స్పృహ కోల్పోవడం, శ్వాసలో ఇబ్బంది వంటి ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. చల్లని నీళ్లు గానీ ఓఆర్‌ఎస్‌ గానీ ఇవ్వాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. గాలి తగిలే ప్రాంతంలో ఉంచాలి.

తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

డాక్టర్‌ రాధాకృష్ణ, కేజీహెచ్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి

ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేజీహెచ్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాధాకృష్ణ సూచించారు. వీలైనంత వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలని, ఎక్కువగా లిక్విడ్‌ ఆహారాన్ని తీసుకోవాలన్నారు. శరీరం వేడిగా మారినా, ఊపిరి సలపనట్టు అనిపించినా అప్రమత్తం కావాలని సూచించారు. వైద్యుల వద్దకు వెళ్లాలన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:38 AM