మది నిండా మధురానుభూతి
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:39 AM
పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్న అరకులోయలో గత నాలుగు రోజులు నిర్వహించిన ఉత్సవ్‌తో టూరిజం పరంగా మరింత జోష్ వచ్చింది.
ఉత్సాహం నింపిన అరకు ఉత్సవ్
అలరించిన నాలుగు రోజుల వినోద కార్యక్రమాలు
పర్యాటకులు, స్థానికుల్లో జోష్
భవిష్యత్తులో టూరిజం అభివృద్ధికి బాటలు
తాజాగా కేంద్ర బడ్జెట్‌లో అరకు ట్రెక్కింగ్ ట్రైల్స్ అభివృద్ధి అంశం
రానున్న రోజుల్లో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించనున్న అరకులోయ ప్రాంతం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్న అరకులోయలో గత నాలుగు రోజులు నిర్వహించిన ఉత్సవ్‌తో టూరిజం పరంగా మరింత జోష్ వచ్చింది. గత కొన్నాళ్లుగా మన్య ప్రాంతం పర్యాటకంగా వెనుకబాటుకు గురైంది. ఈ తరుణంలో మన్యాన్ని పర్యాటంగా మరింత ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తాజాగా విశాఖ, అనకాపల్లి ఉత్సవాలకు దీటుగా అరకులోయలోనే ‘అరకు ఫెస్ట్- 2026’ పేరిట నిర్వహించిన ఉత్సవాలు పర్యాటకులతో పాటు స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రధానంగా ఉత్సవాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనుల సంప్రదాయ నృత్యాల ప్రదర్శనలతో పాటు ఆధునిక ఫ్యాషన్ షో వంటివి ఏర్పాటు చేయడంతో పాటు పద్మాపురం గార్డెన్‌లో నిర్వహించిన ఫ్లవర్ షో అందన్నీ ఆకట్టుకున్నాయి. పర్యాటకంలో భాగంగా సాహస క్రీడలకు ప్రాధాన్యమిస్తూ సైక్లింగ్, ట్రెక్కింగ్, మారథాన్ వంటివి నిర్వహించారు. అలాగే హెలీరైడ్, హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించడం అందరికీ కొత్త అనుభూతిని ఇచ్చింది. ఉత్సవ్ ప్రధాన వేదిక ఆవరణలో గిరిజనుల చేతి ఉత్పత్తుల ప్రదర్శన, గిరిజన వంటకాలు, వివిధ రకాల వినోద కార్యక్రమాలు కుటుంబ సమేతంగా వచ్చిన వారికి ఊరటనిచ్చాయి. మూడో రోజున ప్రముఖ గాయని సునీత బృందం, నాలుగో రోజున ప్రత్యేక గాయకుడు రామ్ మిరియాల బృందం ఆలపించిన పాటలు ఉర్రూతలూగించాయి. కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఆయన సతీమణి, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, ఐటీడీఏ పీవో శ్రీపూజ డ్యాన్సులు వేసి అందర్నీ ఉత్సాహపరిచారు. గత రెండు వారాలుగా జిల్లా యంత్రాంగం ఎంతో శ్రమించిన ఫలితంగానే అరకు ఉత్సవ్ విజయవంతమైందని గుర్తించిన కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆఖరు రోజున అన్ని శాఖల అధికారులను అభినందించి, జ్ఞాపికలను అందజేశారు.
భవిష్యత్తులో టూరిజం అభివృద్ధికి బాటలు
జిల్లాలో అరకులోయ కేంద్రంగా పర్యాటకాభివృద్ధికి బాటలు పడుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేసి దేశ, విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించాలనే ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నాయి. గిరిజన సంప్రదాయాలతో పెనవేసుకునే అరకు ఆర్ట్ విలేజ్‌ను సుమారుగా 200 ఎకరాల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి అందాలను మరింత చేరువ చేస్తూ సాహస క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అరకు ట్రెక్కింగ్ ట్రైల్స్ అభివృద్ధికి చర్యలు చేపడతామని ఆదివారం జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖా మంత్రి నిర్మలాసీతారామన్ స్వయంగా ప్రకటించారు. అరకులోయ ప్రాంతంలో కొండలు, జలపాతాలున్న ప్రాంతాల్లో ట్రెక్కింగ్ అనుభూతిని పొందాలనుకునే దేశ, విదేశీ పర్యాటకులను ఇక్కడకు రప్పించాలనే ఆలోచనతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తున్నది. దీంతో భవిష్యత్తులో జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని స్థానికులు, పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు.