Share News

15 శాతం వృద్ధి రేటు లక్ష్యం

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:43 AM

అభివృద్ధి అజెండాతో స్వర్ణ ఆంధ్ర-2047 లక్ష్యంగా జిల్లాలో 15 శాతం వృద్ధి రేటును సాధించడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు.

15 శాతం వృద్ధి రేటు లక్ష్యం

  • విజన్‌-2047 అమలు దిశగా అడుగులు

  • అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం

  • రూ.2.89 లక్షల కోట్ల పెట్టుబడులతో 1.56 లక్షల మందికి ఉపాధి కల్పనకు ప్రణాళిక

  • అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో రూ.4.09 కోట్లతో అధునాతన ఆపరేషన్‌ థియేటర్లు

  • కలెక్టర్‌ విజయకృష్ణన్‌

  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

  • 596 మంది ‘ఉత్తమ’ ఉద్యోగులకు పురస్కారాలు

  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అనకాపల్లి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):

అభివృద్ధి అజెండాతో స్వర్ణ ఆంధ్ర-2047 లక్ష్యంగా జిల్లాలో 15 శాతం వృద్ధి రేటును సాధించడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలతోపాటు ఇతర సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దిన వేడుకల్లో ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి ఆమె జాతీయపతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, తల్లికి వందనం పథకంలో కింద జిల్లాలో 1,80,648 మంది విద్యార్థులకు రూ.232.7 కోట్లు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. దీపం పథకం-2 కింద 3,69,851 మంది లబ్ధిదారులకు ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నామని, ఇందుకు సంబంధించి రూ.71.5 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ప్రతి నెలా 2,55,680 మందికి రూ.108.65 కోట్లను సచివాలయాల సిబ్బంది, పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారని తెలిపారు.

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,41,539 రైతులకు రూ.317.82 కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు. 22,727 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను రూ.3.03 కోట్ల రాయితీతో 51,343 మంది రైతులకు అందజేసినట్టు కలెక్టర్‌ చెప్పారు. ఉద్యాన శాఖ ద్వారా రూ.13 కోట్లతో పండ్లు, కూరగాయల సాగు, ఆయిల్‌ పామ్‌, కొబ్బరి సాగు, వృద్ధ తోటల పునరుద్ధరణ, సమగ్ర సస్యరక్షణ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

డీఆర్‌డీఏ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, వివిధ బ్యాంకుల నుంచి 1,21,116 మంది డ్వాక్రా సభ్యులకు రూ.1,174.2 కోట్లు, స్త్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా 37,093 మంది సభ్యులకు రూ.206.77 కోట్ల రుణాలు అందించామని కలెక్టర్‌ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 2.76 లక్షల జాబ్‌కార్డుదారులకు 91.05 లక్షల పనిదినాలు కల్పించి రూ.258.86 కోట్లను వేతనాలుగా అందజేశామన్నారు. 1,396 ప్రభుత్వ పాఠశాలల, జూనియర్‌ కళాశాలల్లో 1.25 లక్షల మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖకుచెందిన 30 వసతిగృహాల్లో 3,574 మంది విద్యార్థులకు, 48 బీసీ హాస్టల్స్‌లో 5,303 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నామన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ.4.09 కోట్లతో ఆరు అధునాతన ఆపరేషన్‌ థియేటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వివరించారు. నర్సీపట్నం ఎన్టీఆర్‌ ప్రాంతీయ ఆస్పత్రికి రూ.35 లక్షలతో అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌ను సమకూర్చామని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి సుమారు 43 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు అన్న క్యాంటీన్‌లు వున్నాయని, త్వరలో పాయకరావుపేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు.

పారిశ్రామిక ప్రగతి

జిల్లాలో రూ.2.89 లక్షల కోట్ల పెట్టుబడులతో 1.56 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు 46 భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. విశాఖలో గత ఏడాది జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో జిల్లాకు సంబంధించి 11 ఎంఓయూలు జరిగాయని, వీటికి సంబంధించి రూ.13,865 కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రారంభంకాగా, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వీటిని ఏర్పాటుచేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి పోలీసు పరేడ్‌ను పరిశీలించారు. రిజర్వు దళాల ఇన్‌స్పెక్టర్‌ బి.రామకృష్ణారావు సారఽథ్యంలో పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన

జిల్లాలో ప్రగతిని చాటేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై 17 ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ శకటానికి ప్రథమ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖకు ద్వితీయ, వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక శాఖల శకటానికి మూడో బహుమతి లభించాయి.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. నర్సీపట్నం విద్యార్థులు ప్రదర్శించిన ‘వందేమాతరం’ నృత్యం, పరవాడ మండలం తానాం ఎంజేఏపీబీసీడబ్ల్యూఆర్‌ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సంప్రదాయం నృత్యం, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ విద్యార్థులు ప్రదర్శించిన జిమ్నాస్టిక్స్‌, కొక్కిరాపల్లి గురుకుల విద్యార్థినులు ప్రదర్శించిన ‘మా తెలుగుతల్లికి..‘ నృత్యం, నక్కపల్లి జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, ఇంకా పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిలో 596 మందిని సత్కరించి ప్రశంసా పత్రాలు అందించారు. గణతంత్ర దిన వేడుకల్లో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్‌కుమార్‌, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ, డీఆర్‌ఓ సత్యనారాయణరావు, ఆర్డీఓలు షేక్‌ ఆయీషా, వీవీ రమణ, ఏఎస్పీ దేవప్రసాద్‌, తదితరులు పాల్లొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:43 AM