Share News

ఘాట్‌ రోడ్డుకు మహర్దశ!

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:23 PM

పాడేరు ఘాట్‌ మార్గానికి మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం రోడ్ల, భవనాల శాఖకు చెందిన ఈ మార్గం జాతీయ రహదారిగా అభివృద్ధి చెందనుంది. దీంతో ఘాట్‌ మార్గంలో రాకపోకలతో ఇన్నాళ్లుగా పడుతున్న అవస్థలకు భవిష్యత్తులో చెక్‌ పడనుంది.

ఘాట్‌ రోడ్డుకు మహర్దశ!
ప్రస్తుతం ఘాట్‌ మార్గం స్థితిగతులపై సర్వే చేస్తున్న సిబ్బంది

పాడేరు నుంచి పినగాడి జంక్షన్‌ వరకు హైవే

జిల్లా కేంద్రాలకు హైవేల అనుసంధానానికి చర్యలు

ఘాట్‌ రోడ్డు స్థితిగతులపై ముమ్మరంగా సర్వే

భవిష్యత్తులో మన్యం టూ మైదానం రాకపోకలకు మరింత అనువుగా మారనున్న రోడ్డు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం ఉన్న పాడేరు ఘాట్‌ రోడ్డు చాలా ఏళ్లు క్రితం నిర్మించింది. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుండడంతో ఘాట్‌ మార్గం అభివృద్ధి చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఘాట్‌ మార్గంలో ఇరుకైన మలుపులు, శిథిలమైన రక్షణ గోడలు, దానికి తోడు భారీ వాహనాలు రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి ఘటనలతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడం తరచూ జరుగుతున్నాయి. ఇక వర్షాకాలంలో చెట్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలతో ఘాట్‌ ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. భారీ వర్షాలు కురిస్తే రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు నిషేధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇరుకు మార్గం కావడం, వాహనాల రద్దీ నేపథ్యంలో టూరిజం సీజన్‌లో ప్రమాదాలు సైతం అధికంగానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఘాట్‌ రోడ్డు ఎప్పుడు అభివృద్ధి చెందుతుందాని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఘాట్‌ మార్గం సైతం జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు జరుగుతుండడంతో స్థానికులు, ప్రయాణికులు, పర్యాటకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

జిల్లా కేంద్రాలకు హైవేల అనుసంధానం

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేయాలనే లక్ష్యంతోనే పాడేరు నుంచి అనకాపల్లి జిల్లా పినగాడి జంక్షన్‌ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి పోలవరం జిల్లా రంపచోడవరం మీదుగా జిల్లాలోని కొయ్యూరు, చింతపల్లి. జి.మాడుగుల, పాడేరు, అరకులోయ, అనంతగిరి మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి 516ఈ నిర్మాణం జరుగుతున్నది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి చింతపల్లి వరకు, పాడేరు నుంచి అరకులోయ వరకు పనులు పూర్తికాగా, చింతపల్లి నుంచి పాడేరు వరకు, అరకులోయ నుంచి బొడ్డవర వరకు పనులు పూర్తికావాల్సి ఉంది. జాతీయ రహదారి నిర్మాణంతో అటు కొయ్యూరు మండలం పరిధిలోని చింతాలమ్మఘాట్‌, చింతపల్లి, జీకేవీధి పరిధిలోని రంపుల ఘాట్‌, అనంతగిరి ఘాట్‌ సైతం జాతీయ రహదారిగా మారుతున్నాయి. కాని ఒక్క పాడేరు ఘాట్‌ మార్గం మాత్రమే ఎప్పటిలాగానే అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోయింది. ఈక్రమంలో పాడేరు నుంచి పినగాడి జంక్షన్‌ వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును సైతం జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాలో అన్ని మార్గాలు హైవేలుగా రూపాంతరం చెంది రోడ్డు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.

టూరిజం, ఏవోబీ రవాణాకు ఘాట్‌ రోడ్డు కీలకం

పాడేరు ఘాట్‌ రోడ్డు కేవలం మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి మాత్రమే రాకపోకలు సాగించేందుకే కాకుండా సరిహద్దున ఉన్న ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన రవాణాకు కీలకమే. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రం జైపూర్‌, కొరాపుట్‌ ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు పాడేరు ఘాట్‌ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో స్థానిక ఘాట్‌ మార్గం అభివృద్ధితో ఒడిశా రాష్ట్రానికి చాలా వరకు మేలు జరుగుతుంది. ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకులు పెరగడంతో ఘాట్‌లో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ తరుణంలో ఘాట్‌ రోడ్డు జాతీయ రహదారిగా అభివృద్ధి చెందితే ఈ మార్గం స్వరూపం మారుతుంది. ఫలితంగా వివిధ ప్రాంతాల నుంచి మన్యానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

Updated Date - Jun 20 , 2026 | 11:24 PM