ఆర్‌అండ్‌బీ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:20 AM
జిల్లాలో 38 రహదారుల అభివృద్ధికి రూ.113 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆయన శుక్రవారం జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
38 రహదారుల అభివృద్ధికి రూ.113 కోట్లు మంజూరు
ఈ ఏడాది జూన్‌నాటికి పనులు పూర్తి
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడి
అనకాపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 38 రహదారుల అభివృద్ధికి రూ.113 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆయన శుక్రవారం జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఆయా రహదారుల పనులకు టెండర్ల ప్రక్రియ ముగిసిందని, వీటిల్లో 22 రహదారుల పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు. మొత్తం 38 రహదారుల అభివృద్ధి పనులను ఈ ఏడాది జూన్ చివరినాటికి పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. అడ్డరోడు-నర్సీపట్నం, భీమిలి-నర్సీపట్నం రోడ్డు (చోడవరం నియోజకవర్గం పరిఽధి), వడ్డాది-పాడేరు రోడ్డు (మాడుగుల మండల పరిధి) పనులు జరుగుతున్నాయని, కాంట్రాక్టర్లకు ఇంతవరకు రూ.60 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.70 కోట్లు కూడా నిర్ణీత గడువులో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.మీడిమా సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కేజే ప్రభాకర్, ఈఈ ఎన్.సాంబశివరావు ఉన్నారు.
అభివృద్ధి చెందనున్న రహదారుల్లో కొన్ని..
కోటవురట్ల సమీపంలోని లింగాపురం జంక్షన్ నుంచి నర్సీపట్నం- తుని రోడ్డును కలిపి రహదారిలో తిమ్మాపురం వరకు కోటి రూపాయలతో చేపట్టిన నాలుగు కిలోమీటర్ల పనులు జోరుగా సాగుతున్నాయి.
సబ్బవరం నుంచి గొటివాడ, అంతకాపల్లి మీదుగా నల్లరేగుపాలెం వరకు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి అధ్వానంగా వుంది. దీనిని రూ.3 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇటీవల పనులు మొదలయ్యాయి.
దేవరాపల్లి మండలం వేచలం నుంచి కె.కోటపాడు మండలం వారాడ రోడ్డులో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు.
పరవాడ మండలం లంకెలపాలెం నుంచి సబ్బవరం మండలం అసకపల్లి వరకు రూ.2.5 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు.
నర్సీపట్నం-తాళ్లపాలెం మధ్య రహదారి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. నర్సీపట్నం-తుని వెళ్లే రోడ్డులో నాతవరం మండల పరిధిలో రూ.7.2 కోట్లతో చేపట్టనున్న పనులకు టెండర్లు పూర్తయ్యాయి.