Share News

మహా మాయాజాలం

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:33 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈ) వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది.

మహా మాయాజాలం

  • బినామీ పేర్లతో పనులు చేస్తున్న జీవీఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

  • తన పరిధిలో ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పనులకు ఎక్కువ లెస్‌కు బిడ్‌

  • దక్కించుకున్న తర్వాత ఇష్టారాజ్యంగా పనులు

  • టెండర్‌ ప్రొసీడింగ్స్‌లో అంకెలు మార్ఫింగ్‌

  • డీబీ, కంప్యూటర్‌ ఆపరేటర్ల సాయంతో తప్పుడుపత్రాలతో బిల్లుకు ఫైల్‌ తయారీ

  • భారీగా వెనకేసుకున్న అధికారి

  • కమిషనర్‌కు ఫిర్యాదు.. టెలీ కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం

  • విచారణకు ఆదేశించినట్టు ప్రచారం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈ) వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. తన పరిధిలో పిలిచే పనులకు బినామీపేర్లతో తానే టెండర్‌ వేసి, మొక్కుబడి పనులతో సరిపెట్టేస్తుండడంతోపాటు, బిల్లుకి ఫైల్‌పెట్టినపుడు ఈప్రొక్యూర్‌మెంట్‌లో బిడ్‌దాఖలు చేసిన లెస్‌లను తగ్గించి ప్రింట్‌లు తీసి, వాటి సాయంతో బిల్లు ఫైల్‌ పెట్టి భారీగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఒక కాంట్రాక్టర్‌ నేరుగా కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు ఫిర్యాదుచేయడంతో విచారణకు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.

జీవీఎంసీ పరిధిలో ఏటా సగటున రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. వీటిని సక్రమంగా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పూర్తిచేసేందుకు వీలుగా జీవీఎంసీ కమిషనర్‌ పర్యవేక్షణలో చీఫ్‌ ఇంజనీర్‌స్థాయి అధికారి ఆధ్వర్యంలో పలువురు సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తుంటారు. వీరిలో ఒక జోన్‌ పరిధిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అదనపు సంపాదనపై దృష్టిసారించారు. తనవద్ద పనులుచేసే కొందరు అస్మదీయులైన కాంట్రాక్టర్లను బినామీలుగా చేసుకుని వారిపేరుతో పనులు చేయడం మొదలుపెట్టారు. తన పరిధిలో పిలిచే పనులకు ఈప్రొక్యూర్‌మెంట్‌లో బినామీ పేర్లతో టెండరు వేసి, ఆ పనులు తనకే దక్కేలా అధిక లెస్‌లకు బిడ్‌లు వేస్తున్నారు. తన పరిధిలోని పనులే కావడంతో కుటుంబసభ్యుల పర్యవేక్షణలో పనులను తూతూమంత్రంగా జరిపించేస్తున్నారు. పూర్తయిన తర్వాత ఆపనులకు బిల్లు పెట్టేసమయంలో గతంలో బిడ్‌ వేసినపుడు పేర్కొన్న లెస్‌లను డ్రాయింగ్‌బ్రాంచ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సహకారంతో మార్చేసి ప్రింట్‌ తీస్తున్నారు. అంటే ఉదాహరణకు ఒక పనికి టెండర్‌ పిలిచినపుడు ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో బిడ్‌ వేసిన కాంట్రాక్టర్లలో ఒకరు అత్యధికంగా 29.5 శాతం లెస్‌కు వేసి, మిగిలినవారు అంతకంటే తక్కువ మొత్తానికి వేస్తే, 29.5 శాతం లెస్‌కు వేసిన కాంట్రాక్టర్‌కు వర్క్‌ దక్కుతుంది. పూర్తిచేసిన తర్వాత పని విలువతో లెస్‌గా వేసిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన మొత్తానికి మాత్రమే బిల్లు పెట్టాలి. కానీ ఇక్కడ బినామీపేర్లతో పనులుచేస్తున్న ఇంజనీరింగ్‌ అధికారి గతంలో 29.5శాతం లెస్‌కు వేసి పని దక్కించుకుని, బిల్లుపెట్టినపుడు లెస్‌గా వేసిన 29.5 శాతంలో మొదటి అంకె మినహాయించి 9.5శాతం లెస్‌కు వర్కుని దక్కించుకున్నట్టు మార్ఫింగ్‌చేసి ఆ డాక్యుమెంట్‌ను ప్రింట్‌తీసి బిల్లు ఫైల్‌లో పెడుతున్నారు. ఇలా గత ఏడాది కాలంలో సుమారు ఎనిమిది పనులకు బిల్లు పెట్టి డ్రా చేసుకున్నట్టు సమాచారం. మరో వర్కుకు సంబంధించిన బిల్లు కూడా అదేరీతిలో పెట్టేందుకు ప్రయత్నించగా, కాంట్రాక్టర్‌తో తలెత్తిన విభేదాలతో విషయం బయటపడినట్టు ప్రచారం జరుగుతోంది.

కమిషనర్‌ ఆగ్రహం

డీఈ హోదాలో పనిచేస్తున్న అధికారి బినామీపేర్లతో టెండర్‌లో పాల్గొని పనులు దక్కించుకోవడమేకాకుండా లెస్‌లను మాడిఫై చేసి భారీగా దోచుకుంటున్నట్టు ఒక కాంట్రాక్టర్‌ నేరుగా కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై కమిషనర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు ఇంజనీరింగ్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సదరు అధికారిని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు సమాచారం. సదరు అధికారి అక్రమాలు, మాయాజాలం పై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సంబంధిత జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సూపరింటెండింగ్‌ అధికారిని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Oct 09 , 2026 | 12:33 AM