Share News

విశాఖకు మహర్దశ

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:50 AM

మరో రెండేళ్లలో విశాఖ నగరం రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ అన్నారు.

విశాఖకు మహర్దశ

రెండేళ్లలో మారనున్న నగరం రూపురేఖలు

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ

రూ.3,892 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం

అపార్టుమెంట్లకు నేరుగా నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక: ఎంపీ ఎం.శ్రీభరత్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

మరో రెండేళ్లలో విశాఖ నగరం రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ అన్నారు. స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ప్రజలకు మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటివన్నీ స్మార్ట్‌గానే అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జీవీఎంసీతోపాటు వీఎంఆర్‌డీఏ పరిధిలోని నాలుగు మునిసిపాలిటీల పరిధిలో రూ.3,892 కోట్లతో చేపట్టనున్న 16 ప్రాజెక్టులకు సీఎం నారా చంద్రబాబునాయుడు కుప్పం నుంచి మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పీఎం పాలెంలోని ‘వి’ కన్వెన్షన్‌ నుంచి మంత్రి పి.నారాయణ, ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో రూ.3,531.47 కోట్లతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేయడం, నార్త్‌వెస్ట్‌ సెక్టార్‌లో రూ.446 కోట్లతో చేపట్టిన నిరంతర నీటిసరఫరా ప్రాజెక్టును ప్రారంభించడం నగర అభివృద్ధిలో కీలకమలుపుగా మారబోతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటీల్లో రూ.11,360 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగితే అందులో 35 శాతం నిధులు కేవలం జీవీఎంసీ పరిధిలోనే ఖర్చు చేస్తుండడం విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం తెలియజేస్తున్నదన్నారు. పట్టణాల్లో నివసించేవారికి ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పుడు శంకుస్థాపన జరిగిన పనులను ఏడాదిన్నరలోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ను ఆదేశించారు. రెండేళ్లలో పనులన్నీ పూర్తయితే జీవీఎంసీ స్వరూపమే మారిపోతుందనడంలో సందేహం లేదన్నారు. టిడ్కో ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి లబ్ధిదారులకు అందజేసేలా పనులు పూర్తిచేస్తామన్నారు. టిడ్కో సముదాయాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటివి ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విశాఖలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాష్ట్రస్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే రోడ్లపై దుకాణాలను ఏర్పాటుచేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నందున, సమస్య పరిష్కారానికి స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎంపీ ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ తాగునీటిప్రాజెక్టులు పెద్దసంఖ్యలో వస్తున్నందున పైప్‌లైన్‌ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వృథాను తగ్గించాలన్నారు. అపార్టుమెంట్‌లకు నేరుగా నీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. కొత్తగా అమలవుతున్న ప్రాజెక్టుల వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిదీపాలు, ట్రాఫిక్‌ నిర్వహణ వంటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వీఈఆర్‌లో అనేక ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ద్వారా ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు చేపడుతున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు 50 శాతం గ్రీన్‌కవర్‌ సాధించేందుకు వీలుగా 113 పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పి.గణబాబు, కార్పొరేషన్‌ చైర్మన్లు గండి బాబ్జీ, మళ్ల సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు...

- మధురవాడ, ఈస్ట్‌ జోన్‌ పరిధిలో రూ.725.18 కోట్లతో నీటి సరఫరా ప్రాజెక్టు

- రూ.117.24 కోట్లతో నగర పరిధిలోని బల్క్‌, సెమీ బల్క్‌ నీటి సరఫరా మెరుగుదల, స్కాడా ఏర్పాటు

- రూ.150 కోట్లతో నరవ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నుంచి హెచ్‌పీసీఎల్‌, ఇతర పరిశ్రమలకు నీటి సరఫరాకు ప్రత్యేక పైప్‌లైన్‌ నిర్మాణం

- అమృత్‌ 2.0లో భాగంగా రూ.400 కోట్లతో మురుగునీటి పారుదలకు సంబంధించి రెండు, నీటి సరఫరాకు సంబంధించి ఐదు ప్రాజెక్టులు

- మధురవాడ, ఈస్ట్‌ జోన్‌ పరిధిలో రూ.658.61 కోట్లతో సమగ్ర మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రాజెక్టు

- గాజువాక, పెందుర్తి, అగనంపూడి జోన్‌ల పరిధిలో స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ నుంచి రూ.150 కోట్ల నిధులతో సీవరేజ్‌ ప్యాకేజీ-2 బ్యాలెన్స్‌ వర్క్‌లు, మురుగునీటి సేకరణ, రవాణా వ్యవస్థ రూపకల్పన, నిర్మాణం, కమిషనింగ్‌

- గాజువాక, పెందుర్తి, అగనంపూడి ప్రాంతాల్లో మురుగునీటి సేకరణ, రవాణా వ్యవస్థకు రూపకల్పన, వ్యర్థ జల శుద్ధి కోసం రూ.452.42 కోట్లతో 46 ఎంఎల్‌డీ సామర్థ్యం కోసం ప్లాంటు నిర్మాణం

- రూ99.19 కోట్లతో నగరంలో 101 కూడళ్ల వద్ద ఏఐ ఆధారిత ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఏర్పాటుకు ‘ప్రాజెక్ట్‌ సారధి’ అమలు

- నగరవ్యాప్తంగా ఏర్పాటుచేసే ఏఐ ట్రాఫిక్‌ వ్యవస్థ పర్యవేక్షణకు రూ.64.8 కోట్ల వ్యయంతో ఏఐ మరియు ఆటోమేషన్‌ సిటీ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు

- వీధివ్యాపారుల సంక్షేమం, జీవనోపాధికోసం గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో రూ.పది కోట్లతో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌లు ఏర్పాటు

- జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్తంగా రూ.400 కోట్లతో నగర పరిధిలోని మట్టిరోడ్లు, సీసీ రోడ్లు తారురోడ్లుగా అభివృద్ధి

- రూ.92.54 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని 123 పార్కులు, వీఎంఆర్‌డీఏ పరిధిలోని 42 పార్కుల అభివృద్ధి

- రూ.9.09 కోట్లతో పెదగంట్యాడలోని క్రీడా సదుపాయాల కల్పన

- రూ.113 కోట్లతో వీఎంఆర్‌డీఏ పరిధిలోని విజయనగరం, నెల్లిమర్ల, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన

- రూ.3.4 కోట్లతో కైలాసరిగిపై హెయిర్‌పిన్‌ బెండ్‌ నుంచి కొండమీద ఉన్న తెలుగు మ్యూజియం వరకు ప్రత్యామ్నాయ తారురోడ్డు నిర్మాణం.

- నార్త్‌-వెస్ట్‌ సెక్టార్‌లో నిరంతర నీటి సరఫరాకు రూ.446 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ప్రారంభించారు.

Updated Date - Sep 23 , 2026 | 12:50 AM