Share News

నర్సీపట్నానికి మహర్దశ

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:32 AM

మునిసిపాలిటీ అభివృద్ధికి విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) రూ.8 కోట్లు మంజూరు చేసిందని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

నర్సీపట్నానికి మహర్దశ

వీఎంఆర్‌డీఏ నుంచి రూ.8 కోట్లు మంజూరు

కూటమి హయాంలో ఇప్పటికే రూ.24 కోట్లతో అభివృద్ధి పనులు

మునిసిపాలిటీకి 21 నెలల్లో రూ.32 కోట్లు

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

మునిసిపాలిటీ అభివృద్ధికి విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) రూ.8 కోట్లు మంజూరు చేసిందని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ నిధులలో వివిధ వార్డుల్లో 81 అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పించామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ ప్రభుత్వ శాఖలతోపాటు వీఎంఆర్‌డీఏ నుంచి రూ.24 కోట్లు మంజూరు కాగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు వంటి 341 అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ తాజాగా మంజూరు చేసిన రూ.8 కోట్లు కలుపుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సీపట్నం పురపాలక సంఘం అభివృద్ధికి మొత్తం రూ32 కోట్లు మంజూరు చేయించినట్టు ఆయన తెలిపారు. గ్రేడ్‌-3 మునిసిపాలిటీకి 21 నెలల్లో రూ.32 కోట్లు మంజూరు కావడం సాధారణ విషయం కాదని అన్నారు. ఆయా పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొడ్దని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. స్థానిక నాయకులు, ప్రజలు సైతం తమ వార్డుల్లో జరుగుతున్న పనుల్లో నాణ్యతపై దృష్టి సారించాలని ఆయన కోరారు.


నూకాంబికను దర్శించుకున్నహోం మంత్రి

పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేసిన అనిత

అనకాపల్లి టౌన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కొత్త అమావాస్య జాతరలో భాగంగా స్థానిక నూకాంబిక అమ్మవారిని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం మండపంలో అర్చకులు ఆశీర్వాదించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, దేవదాయ శాఖ డీసీ ఎన్‌.సుజాత సత్కరించి అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి అనితకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఆలయ ఈవో శ్రీధర్‌, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

కాగా కొత్త అమావాస్య జాతర ప్రారంభమైన తరువాత తొలి ఆదివారం కావడంతో నూకాంబిక అమ్మవారి దర్శనానికి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చే అన్ని రహదారులు భక్తులు, వాహనాలతో రద్దీగా మారాయి.

Updated Date - Mar 23 , 2026 | 01:32 AM