నీరుగారిన లక్ష్యం!
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:34 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాడు-నేడు పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) ప్లాంట్లు మూలకు చేరాయి. వీటిని ఏర్పాటు చేసిన తరువాత కనీసం రెండేళ్లు కూడా పని చేయలేదు. ఇవి నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
- మూలకు చేరిన పాఠశాలల్లోని ఆర్వో ప్లాంట్లు
- గత వైసీపీ ప్రభుత్వంలో నాడు- నేడు పథకం కింద ఏర్పాటు
- కనీసం రెండేళ్లు కూడా పని చేయని వైనం
- విద్యార్థులకు తప్పని తాగునీటి కష్టాలు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాడు-నేడు పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్వో (రివర్స్ ఆస్మోసిస్) ప్లాంట్లు మూలకు చేరాయి. వీటిని ఏర్పాటు చేసిన తరువాత కనీసం రెండేళ్లు కూడా పని చేయలేదు. ఇవి నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఎంపీ, జడ్పీ స్కూళ్లు 1,344 వరకు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.90 వేల నుంచి రూ.3.5 లక్షల అంచనా వ్యయంతో 2023లో 140కి పైగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యాపార సంస్థలు, పరిశ్రమల తరఫున పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, అనకాపల్లి, మునగపాక, ఎలమంచిలి మండలాల్లో మరో 60 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం వీటిలో సగానికి పైగా ప్లాంట్లు పూర్తిగా పనిచేయకుండా మూలకు చేరాయి. కొన్నింటిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొందరు దాతల సహకారంతో మరమ్మతులు చేయించారు. అవి కూడా చాలా వరకు సామర్థ్యానికి తగ్గట్టుగా నీరు అందించడం లేదు. పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు రెండేళ్లు గడవకముందే మరమ్మతులకు గురికావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులకు తప్పని కష్టాలు
కొన్ని పాఠశాలల్లో మోటార్లు, ఫిల్టర్లు దెబ్బతినగా, మరికొన్ని చోట్ల విద్యుత్ సమస్యలు, నిర్వహణ లోపంతో పాంట్లు పనిచేయడం మానేశాయి. ఫలితంగా విద్యార్థులు మళ్లీ సాధారణ మంచినీటి ట్యాంకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు ఇంటి నుంచే సీసాల్లో నీరు తెచ్చుకొని మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో సాధారణ నీటినే విద్యార్థులు తాగాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఐదేళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. మరమ్మతులకు గురైన ప్లాంట్లను బాగు చేయించాల్సి ఉంది. అయితే 2024 తరువాత పలు మండలాల్లో నిర్వహణ సంస్థలు పాఠశాలల వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలల నుంచి పలుమార్లు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వేసవి, వర్షాకాలాల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అవసరం. కానీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పని చేయకపోవడంతో విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సమగ్ర శిక్ష జిల్లా ఇంజనీరింగ్ విభాగం ఈఈ నర్సింగరావును వివరణ కోరగా, మరమ్మతులు చేపట్టాల్సిన ఆర్వో ప్లాంట్ల వివరాలు, అంచనా వ్యయంపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపామన్నారు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని తెలిపారు.