నాణ్యతా లోపానికి నిలువెత్తు నిదర్శనం
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:51 AM
మండలంలోని కుజబంగి- రూఢకోట ప్రధాన రహదారి నాణ్యతా లోపానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది. అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఈ రహదారి ప్రారంభించిన కొద్ది నెలలకే గోతులమయంగా తయారవ్వడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కుజబంగి- రూఢకోట రోడ్డు నిర్మాణం
- ప్రారంభించిన కొద్ది నెలల్లోనే గోతులమయం
- వర్షాలొస్తే మట్టి రోడ్డును తలపించేలా బురదమయం
- వాహనచోదకులకు తప్పని కష్టాలు
పెదబయలు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుజబంగి- రూఢకోట ప్రధాన రహదారి నాణ్యతా లోపానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది. అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఈ రహదారి ప్రారంభించిన కొద్ది నెలలకే గోతులమయంగా తయారవ్వడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని కుజబంగి- రూఢకోట ప్రధాన రహదారి గుండా ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలకు చెందిన సుమారు పది పంచాయతీల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన తారాబు జలపాతం, ధారకొండ, సీలేరు, ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతాలకు ఇటుగానే వెళుతుంటారు. అంతటి ప్రాధాన్యం గల ఈ రహదారిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 చివర్లో రూ.5 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ రహదారిని నిర్మించడంతో కొద్ది నెలలకే ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. వర్షం కురిస్తే ఆ గోతుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాగా వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డును చూస్తే బీటీ రోడ్డా?, లేక మట్టి రోడ్డా? అనే అనుమానం కలగకమానదు. ఈ రహదారి దుస్థితిపై గతంలో అనేక సార్లు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. దీనిపై ఆర్ అండ్ బీ అధికారుల వివరణ కోరగా, ఈ రహదారితో పాటు దెబ్బతిన్న పలు రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని తెలిపారు.