మన్యానికి పచ్చలహారం
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:38 AM
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పచ్చదనం అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ ద్వారా విత్తన బంతులు(సీడ్ బాల్స్)ను వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వం
జిల్లాలో 12.5 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లేందుకు ప్రణాళిక
ఇప్పటికి 80 శాతం పూర్తి
మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం
చింతపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పచ్చదనం అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ ద్వారా విత్తన బంతులు(సీడ్ బాల్స్)ను వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 12.5 లక్షల సీడ్ బాల్స్‌ను అటవీశాఖ అధికారులు గిరిజనులు, విద్యార్థులతో కలిసి వెదజల్లుతున్నారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని 80శాతం పూర్తి చేసినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
వాయుకాలుష్యం పెరిగిపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల రోజు రోజుకి వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వేసవిలో వర్షాలు, వర్షాకాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయం, మానవుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఎల్-నినో ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలో వర్షాకాలం వచ్చినా వానలు పడకపోవడం వల్ల వరి నాట్లు పూర్తి కావడం లేదు. వ్యవసాయ భూములు బీడు భూములుగా దర్శనమిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మానవుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందని భావించిన కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది. అడవులను సంరక్షించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం పచ్చదనం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనలతో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ సీడ్ బాల్స్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీడ్‌బాల్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యతలను అటవీశాఖకు అప్పగించి ప్రత్యేక నిధులు కేటాయించారు.
ప్రజల భాగస్వామ్యంతో సీడ్ బాల్స్
అటవీశాఖ అధికారులు ప్రజల భాగస్వామ్యంతో సీడ్ బాల్స్‌ను సిద్ధం చేశారు. ప్రధానంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గిరిజనులు, విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్‌ను తయారు చేశారు. మర్రి, రావి, నేరేడు, చింత, జాఫ్రా, గుమ్మడి, వెదురు, టేకు, మద్ది, వేగిసతో పాటు 12 రకాల విత్తనాలతో 70 శాతం మట్టి, 30 శాతం ఆవుపేడ కలిపి వివిధ పరిమాణాల్లో సీడ్ బాల్స్‌ను తయారు చేశారు.
జిల్లాలో 12.5 లక్షల సీడ్ బాల్స్
జిల్లాలో చింతపల్లి, పాడేరు అటవీశాఖ డివిజన్లు ఉన్నాయి. చింతపల్లి డివిజన్ పరిధిలో 1,97,214.01 హెక్టార్లు, పాడేరు డివిజన్ పరిధిలో 1,04,811.91 హెక్టార్ల అడవులు ఉన్నాయి. జిల్లాకు అటవీశాఖ 12.5 లక్షల సీడ్ బాల్స్‌ను కేటాయించింది. ఈ సీడ్ బాల్స్‌ను వెదజల్లేందుకు పచ్చదనం తక్కువగా ఉన్న చింతపల్లి డివిజన్ పరిధిలో 655 హెక్టార్లు, పాడేరు డివిజన్‌లో 1,500 హెక్టార్ల భూములను ఎంపిక చేశారు. అటవీశాఖ రేంజ్, సెక్షన్లు, బీట్లు వారీగా అటవీశాఖ అధికారులకు సీడ్ బాల్స్ వెదజల్లేందుకు లక్ష్యాలను నిర్దేశించారు. అటవీశాఖ ఉద్యోగులు గిరిజనులతో కలిసి రిజర్వుడ్ ఫారెస్టు భూముల్లో సీడ్ బాల్స్‌ను వెదజల్లుతున్నారు.
డ్రోన్ల సహాయంతో..
మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్లు సహాయంతో సీడ్ బాల్స్‌ను వెదజల్లుతున్నారు. పాడేరు, చింతపల్లి అటవీశాఖ పరిధిలో సీడ్ బాల్స్ వెదజల్లేందుకు ఎంపిక చేసిన భూముల్లో 50 శాతం మనుషులు వెళ్లలేని ప్రాంతాలు ఉన్నాయి. దీంతో తొలిసారిగా అటవీశాఖ డ్రోన్లు వినియోగిస్తూ సీడ్ బాల్స్‌ను వెదజల్లుతున్నారు. అటవీశాఖ ఉద్యోగులు డ్రోన్ సహాయంతో గంటకు పది వేల వరకు సీడ్ బాల్స్‌ను అడవుల్లో వెదజల్లుతున్నారు. సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రాంతాల్లో 90 శాతం మొలకలు వస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికి గిరిజన ప్రాంతంలో అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో అటవీశాఖ అధికారులు వెదజల్లిన సీడ్ బాల్స్ నుంచి మొలకలు వచ్చాయి.