Share News

ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:20 AM

ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పెందుర్తి మండలం పినగాడి సమీపంలోని కోట్నివానిపాలెంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.

ప్రాణం తీసిన ఈత సరదా

చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

పినగాడి విస్టం కళాశాలలో పాలిటెక్నిక్‌ చదువుతున్న విద్యార్థులు

మృతులు అనకాపల్లి జిల్లా వాసులు

పెందుర్తి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పెందుర్తి మండలం పినగాడి సమీపంలోని కోట్నివానిపాలెంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సీఐ కేవీ సతీశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం పోతలూరు గ్రామానికి చెందిన పోతల సతీశ్‌ (17), ఎస్‌.రాయవరం మండలానికి చెందిన ఐజాక్‌ (17), రావికమతం మండలం తోటకూరపాలేనికి చెందిన మేరపురెడ్డి అయ్యప్ప, పోతలూరుకు చెందిన కచ్చాల పవన్‌కుమార్‌ పెందుర్తి సమీపంలోని పినగాడిలో ఉన్న విస్టం కళాశాలలో పాలిటెక్నిక్‌ ఈఎంఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కోట్నివానిపాలెంలో ఒక గదిని అద్దెకు తీసుకుని, ఇదే కళాశాలలో చదువుతున్న మరో ఇద్దరితో కలిసి ఉంటున్నారు. గురువారం కళాశాలలో సెమిస్టర్‌ పరీక్ష రాసిన అనంతరం నలుగురు రూమ్‌కి వచ్చారు. భోజనం ముగించుకుని కొంతసేపు సేద తీరి, సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు సతీశ్‌, ఐజాక్‌, పవన్‌కుమార్‌, అయ్యప్ప కోట్నివానిపాలెంలోని చెరువు వద్దకు వెళ్లారు. నలుగురు స్నేహితులు చెరువులో ఈత కొడుతూ ఉత్సాహంగా గడిపారు. ఇదిలా ఉండగా ఈత సరదాలో లోతును అంచనా వేయలేక సతీశ్‌, ఐజాక్‌ ముందుకు వెళ్లిపోయారు. వారికి అంతగా ఈత నైపుణ్యం లేకపోవడంతో, నీటిలోపలికి వెళ్లిపోయారు. ఊపిరి ఆడక కేకలు వేయడంతో ఒడ్డున ఈత కొడుతున్న అయ్యప్ప, పవన్‌ ఆందోళన చెంది కర్ర సాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే చెరువులో మరిం త ముందుకు వెళ్తే తాము మునిగిపోతామనే భయంతో వెనక్కితగ్గడంతో వారి కళ్లముందే సతీశ్‌, ఐజాక్‌లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత ఈతగాళ్లను రప్పించి, చెరువును జల్లెడ పట్టడంతో సుమారు రెండు గంటల తరువాత విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

కల్లలైన కలలు

పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి, మంచి కొలువు సాధించి తమ కలలు సాకారం చేస్తారని భావించామని, ఇలా అర్ధంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని అనుకోలేదని వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతుల్లో సతీశ్‌ తండ్రి రాజబాబు, తల్లి లక్ష్మి వ్యవసాయ కూలీలు. ఐజాక్‌ తండ్రి ప్రసాద్‌ ఆటోలో కొబ్బరికాయలను దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. తల్లి దివ్య గృహిణి.

మృతుల బంధువుల ఆందోళన

విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా బంధువులు, స్థానికులు అడ్డుకున్నారు. విద్యార్థులు మృతికి చెరువులో మట్టి అక్రమంగా తరలించుకుపోవడంతో ఏర్పడిన గోతులే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల యజమాన్యం స్పందించాలని, అప్పటివరకు మృతదేహాలను తరలించేందుకు అంగీకరించమన్నారు. రాత్రి పది గంటల వరకు ఆందోళన కొనసాగుతుండడంతో వారికి నచ్చజెపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Nov 13 , 2026 | 01:20 AM