Share News

ఫలించిన పోరాటం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:14 PM

గడిచిన నాలుగు రోజులుగా గింజర్తి విద్యార్థులు, తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం ఫలించింది. గింజర్తి మండల ప్రాథమిక పాఠశాలను ఫౌండేషన్‌ స్థాయి నుంచి బేసిక్‌ ప్రైమరీ పాఠశాలగా కొనసాగింపునకు గురువారం రాత్రి విద్యా శాఖ కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు స్పష్టమైన హామీ రావడంతో సమస్య పరిష్కారమైంది.

ఫలించిన పోరాటం
డీఈవో హామీతో విద్యార్థులు, తల్లిదండ్రులతో నిరసన దీక్షను విరమింపజేస్తున్న ఎంఈవో సింహాచలం

బేసిక్‌ ప్రైమరీగా గింజర్తి పాఠశాల కొనసాగింపునకు కమిషనర్‌ హామీ

కలెక్టర్‌ నిషాంతి చొరవతో సమస్య పరిష్కారం

ఉన్నతాధికారుల హామీ మేరకు దీక్షను విరమింపజేసిన ఎంఈవో

కొయ్యూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంజర్తి మండల ప్రాథమిక పాఠశాల బేసిక్‌ ప్రైమరీ పాఠశాలగా ఉండేది. గత ఏడాది ఈ పాఠశాలను ఫౌండేషన్‌ స్థాయికి తగ్గించారు. ఇక్కడ ఉన్న 80 విద్యార్థులను లొద్దిపాకలు, చింతలపూడి పాఠశాలలో మ్యాపింగ్‌ చేశారు. అలాగే ఒక ఉపాధ్యాయుడిని తగ్గించారు. దీనిని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. పిల్లలను మాత్రం గింజర్తి పాఠశాలకే పంపించేవారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తల్లిదండ్రులు ఈ సమస్యపై ఎంఈవోతో చర్చించారు. తాను కమిషనర్‌కి నివేదిక పంపించానని, అక్కడి నుంచి వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ సమావేశమై పోలీసుల అనుమతితో ఎంఈవో కార్యాలయం ఎదుట నాలుగు రోజుల క్రితం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీరి ఆందోళన విషయం జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో ఆమె విద్యా శాఖ కమిషనర్‌తో మాట్లాడారు. గురువారం రాత్రి కమిషనర్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఎంఈవో సింహాచలానికి డీఈవో ఎన్‌.భానుమూర్తి రాజు ఫోన్‌ చేసి గింజర్తి పాఠశాలను ప్రైమరీ స్కూల్‌గా కొనసాగించేందుకు కమిషనర్‌ అంగీకరించారని పేర్కొన్నారు. దీంతో ఎంఈవో సింహాచలం దీక్షలు చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ గింజర్తి పాఠశాల నుంచి వేరు చేసి లొద్దిపాకలు, చింతలపూడి పాఠశాలల్లో చేసిన విద్యార్థుల మ్యాపింగ్‌ రద్దుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారన్నారు. వారిని తిరిగి గింజర్తి పాఠశాలలో మ్యాపింగ్‌ చేస్తున్నారని, సోమవారం నుంచి ఒకటి నుంచి ఐదు తరగతుల నిర్వహణకు అదనంగా మరో ఉపాధ్యాయుడిని కేటాయించనున్నట్టు చెప్పారు. సమస్యపై సత్వరం స్పందించి కొలిక్కి తెచ్చేందుకు కృషి చేసిన కలెక్టరు, డీఈవో, ఎంఈవోలకు విద్యాకమిటీ చైర్మన్‌ అప్పారావు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 07 , 2026 | 11:14 PM