Share News

మరణంలోనూ వీడని స్నేహబంధం

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:56 AM

వారు ముగ్గురూ స్నేహితులు. వేర్వేరు గ్రామాలు అయినప్పటికీ పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒకరి గ్రామంలో జరిగిన అమ్మవారి జాతరకు మిగిలిన ఇద్దరూ హాజరయ్యారు. ఉత్సాహంగా గడిపిన తరువాత ఒకరిని అతని ఊరులో దిగబెట్టడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.

మరణంలోనూ వీడని స్నేహబంధం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మణం

వేర్వేరు గ్రామాలు అయినప్పటికీ వృత్తిరీత్యా మిత్రులు

పురుషోత్తపురంలో గ్రామదేవత పండుగకు హాజరు

మిత్రుడిని సొంతూరులో దింపడానికి బైక్‌పై వెళుతుండగా ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

ఎలమంచిలి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): వారు ముగ్గురూ స్నేహితులు. వేర్వేరు గ్రామాలు అయినప్పటికీ పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒకరి గ్రామంలో జరిగిన అమ్మవారి జాతరకు మిగిలిన ఇద్దరూ హాజరయ్యారు. ఉత్సాహంగా గడిపిన తరువాత ఒకరిని అతని ఊరులో దిగబెట్టడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. జాతీయ రహదారిపై యూ టర్న్‌ తీసుకుంటుండగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్నది. దీంతో తీవ్రంగా గాయపడిన ముగ్గురూ ఆస్పత్రికి తరలిస్తుండగా నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరణంలోనూ స్నేహ బంధాన్ని వీడలేదు. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం హైవే జంక్షన్‌ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నానీ (24), ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎలపా గోవింద్‌ (25), పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారు దుర్గా ప్రసాద్‌ (16) స్నేహితులు. చుట్టుపక్కల గ్రామాల్లో పెయింటింగ్‌ పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం పురుషోత్తపురంలో గ్రామ దేవత గొల్లమ్మ తల్లి జాతర జరిగింది.ఎలపా గోవింద్‌ అత్తవారిది ఇదే ఊరుకావడంతో అతను ఇక్కడికి వచ్చాడు. బంగారు నాని ఆహ్వానం మేరకు దుర్గాప్రసాద్‌ కూడా పురుషోత్తపురం వచ్చాడు. ముగ్గురూ కలిసి జాతరలో ఉత్సాహంగా గడిపారు. అర్ధరాత్రి 11.40 గంటల సమయంలో దుర్గా ప్రసాద్‌ను అతని ఇంటి వద్ద దించేందుకు ముగ్గురూ కలిసి పల్సర్‌ బైక్‌పై పోతిరెడ్డిపాలెం బయలుదేరారు. తుని వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న వీరు సుమారు ఐదు నిమిషాల తరువాత పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అనకాపల్లి వైపు నుంచి తుని వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొన్నది. దీంతో బైక్‌పై వున్న ముగ్గురూ ఎగిరి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి, తీవ్రంగా గాయపడ్డారు. ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర, సిబ్బంది వచ్చి పరిశీలించారు. బంగారు నానీని 108 అంబులెన్స్‌లో, మిగిలిన ఇద్దరిని హైవే పెట్రోలింగ్‌ అంబులెన్స్‌లో ఎక్కించి అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లేసరికి నానీ మృతిచెందడంతో అంబులెన్స్‌ను ఎలమంచిలి సీహెచ్‌సీకీ మళ్లించి, మృతదేహాన్ని మార్చులో పెట్టారు. అనకాపల్లి తరలిస్తున్న మిగిలిన ఇద్దరిలో ఎలపా గోవింద్‌ దారిలోనే ప్రాణాలు వదిలాడు. దుర్గాప్రసాద్‌ అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎలమంచిలి, అనకాపల్లి మార్చురీల వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకున్నామని రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.

వివాహమై నాలుగు నెలలే...

కాగా ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎలపా గోవింద్‌కు సుమారు నాలుగు నెలల క్రితం పురుషోత్తపురం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. గ్రామ దేవత పండుగ సందర్భంగా గురువారం అత్తవారింటికి వచ్చి, రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నానీకి భార్య, ఇద్దరు పిల్లలతోపాటు తల్లిదండ్రులు వున్నారు. కుటుంబ మొత్తం ఇతనిపైనా ఆధార పడిందని గ్రామస్థులు తెలిపారు. పోతిరెడ్డిపాలేనికి దుర్గాప్రసాద్‌కు తల్లిదండ్రులు వున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:56 AM