Share News

నామినేషన్ల వెల్లువ

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:30 AM

జిల్లాలో తొలిదశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో రెండో రోజైన సోమవారం నామినేషన్ల దాఖలు ఊపందుకుంది.

నామినేషన్ల వెల్లువ

పంచాయతీల సర్పంచ్‌, వార్డు పదవులకు రెండో రోజు పెదఎత్తున దాఖలు

ఎనిమిది మండలాల్లో సర్పంచ్‌ పదవులకు 695, వార్డులకు 2,968 నామినేషన్లు

------------------------------------------

రెండు రోజుల్లో దాఖలైన నామినేషన్లు

సర్పంచ్‌ వార్డులు

మొదటి రోజు 183 527

రెండో రోజు 695 2,968

మొత్తం 878 3,495

--------------------------------------------------------------

అనకాపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌):

జిల్లాలో తొలిదశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో రెండో రోజైన సోమవారం నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. సర్పంచ్‌, వార్డు పదవులకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. మొత్తం ఎనిమిది మండలాల్లో 217 సర్పంచ్‌ పదవులకు, 2,156 వార్డు పదవులకు ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం సర్పంచ్‌ పదవులకు 695 నామినేషన్లు, వార్డు పదవులకు 2,968 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో రెండు రోజుల్లో సర్పంచ్‌ పదవులకు 878, వార్డు పదవులకు 3,495 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు మంగళవారంతో గడువు ముగియనున్న నేపథ్యం భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏ మండలంలో ఎన్ని నామినేషన్లు...

అనకాపల్లి మండలంలో సర్పంచ్‌ పదవులకు సోమవారం 120 నామినేషన్లు, వార్డు మెంబర్ల పదవులకు 390 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం దాఖలైన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 138, వార్డు పదవులకు మ్తొతం 453 నామినేషన్లు పడ్డాయి. మండలంలోని బవులవాడ పంచాయతీ సర్పంచ్‌ పదవికి కూటమి బలపరిచిన కోట్ని బుజ్జి నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ, తదితరులు హాజరయ్యారు.

కశింకోట మండలంలో సర్పంచ్‌ పదవులకు సోమవారం 84, వార్డు పదవులకు 406 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం దాఖలైన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 108, వార్డు పదవులకు మ్తొతం 512 నామినేషన్లు పడ్డాయి. కశింకోట మేజరు పంచాయతీ సర్పంచ్‌ పదవికి కూటమి బలపరిచిన నడిపల్లి గంగాభవాని నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పరవాడ మండలంలో సోమవారం సర్పంచ్‌ పదవులకు 48 మంది, వార్డు పదవులకు 296 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం దాఖలైన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 67, వార్డు పదవులకు మ్తొతం 358 నామినేషన్లు దాఖలయ్యాయి. మేజరు పంచాయతీ పరవాడ సర్పంచ్‌ పదవికకి కూటమి బలపరిచిన పైలా పావని, వైసీపీ మద్దతుతో చుక్క లక్ష్మి నామినేషన్లు వేశారు.

సబ్బవరం మండలంలో సోమవారం సర్పంచ్‌ పదవులకు 96 మంది, వార్డు పదవులకు 356 మంది నామినేషన్లు వేశారు. ఆదివారం దాఖలైన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 126, వార్డు పదవులకు మ్తొతం 414 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకాపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకటరావు భార్య చొక్కాకుల లక్ష్మి కూటమి మద్దతుతో నామినేషన్‌ వేశారు.

బుచ్చెయ్యపేట మండలంలో సోమవారం సర్పంచ్‌ పదవులకు 115, వార్డు మెంబర్‌ పదవులకు 431 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఆదివారం దాఖలైన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 151, వార్డు పదవులకు మ్తొతం 525 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా మేజర్‌ పంచాయతీ వడ్డాదితోపాటు రాజాం, పొట్టిదొరపాలెం పంచాయతీలకు నామినేషన్లు వేయడానికి ఎక్కువ మంది అభ్యర్థులు రావడంతో రాత్రి 7.30 వరకు నామినేషన్‌లు స్వీరించాల్సి వచ్చింది.

చోడవరం మండలంలో సోమవారం సర్పంచ్‌ పదవులకు 117, వార్డు మెంబర్‌ పదవులకు 323 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం వేసిన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 140, వార్డు పదవులకు మ్తొతం 391నామినేషన్లు దాఖలయ్యాయి.

రావికమతం మండలంలో సోమవరం సర్పంచ్‌ పదవులకు 55, వార్డు సభ్యుల పదవులకు 284 మంది నామినేషన్లును దాఖలు చేశారు. ఆదివారం వేసిన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 78, వార్డు పదవులకు మ్తొతం 342 నామినేషన్లు దాఖలయ్యాయి.

రోలుగుంట మండలంలో సోమవారం సర్పంచ్‌ పదవులకు 83, వార్డు పదవులకు 373 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు వేసిన నామినేషన్లను కూడా కలుపుకుంటే సర్పంచ్‌ పదవులకు మొత్తం 96, వార్డు పదవులకు మ్తొతం 401 నామినేషన్లు దాఖలయ్యాయి.

Updated Date - Nov 17 , 2026 | 01:30 AM