నామినేషన్ల వెల్లువ
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:36 AM
జీవీఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఆదివారం ముగిసింది.
మేయర్ పదవికి 29
120 వార్డులకు 1,672
ముగిసిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం
అత్యధికంగా గాజువాక జోన్లోని 19 వార్డులకు 407 నామినేషన్లు
అత్యల్పంగా భీమిలి జోన్లోని ఐదు వార్డులకు 48 నామినేషన్లు
నేడు నామినేషన్ల పరిశీలన
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఆదివారం ముగిసింది. చివరి రోజు మేయర్ పదవికి 23, వార్డులకు 1,078 నామినేషన్లు వచ్చాయి. మొత్తం మూడు రోజుల్లో మేయర్ పదవికి 29 మంది, 120 వార్డులకు 1,672 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా ముక్కా శ్రావణి, వైసీపీ అభ్యర్థిగా వరుదు కళ్యాణితోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి జెర్రిపోతుల వెంకటలక్ష్మి, ఉమా ప్రవీణ, ప్రియాంక దండి, దేవర నాగసునందదేవి, షేక్ దౌల్తునిషా, బోర సంతోషి నామినేషన్లు దాఖలు చేశారు. వీరుకాకుండా బీఎస్పీ నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి ఆరుగురు, ఇండిపెంటెంట్లుగా 11 మంది, వైసీపీ నాయకురాలు పేడాడ రమణకుమారి, తిప్పల వెంకట విజయకుమారి, టీడీపీ నాయకురాలు శానాపతి వసంత కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక వార్డుల విషయానికి వస్తే 120 వార్డులకు 1,672 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బీఎస్పీ నుంచి 13, బీజేపీ నుంచి 94, సీపీఐ నుంచి పది, సీపీఎం నుంచి 20, కాంగ్రెస్ పార్టీ నుంచి 66, ఎన్సీపీ నుంచి ఒకటి, టీడీపీ నుంచి 504, వైసీపీ నుంచి 365, జనసేన నుంచి 278, ఇతర పార్టీల నుంచి 22 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గాజువాక జోన్ పరిధిలోని 19 వార్డులకు 407 నామినేషన్లు రాగా, అత్యల్పంగా భీమిలి జోన్ పరిఽదిలోని ఐదు వార్డులకు 48 నామినేషన్లు అందాయి. నామినేషన్లు సమర్పించేందుకు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే అవకాశం ఉండడంతో చాలామంది కాస్త ముందు నామినేషన్ దాఖలుచేసే కేంద్రాలకు వెళ్లడంతో వారికి అక్కడి సిబ్బంది టోకెన్లు జారీచేశారు. మూడు గంటల తర్వాత కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించలేదు. కేంద్రాల్లోకి వచ్చి టోకెన్లు తీసుకున్నవారి నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించేసరికి రాత్రి పది గంటలు దాటిపోయింది. సోమవారం నామినేషన్లను పరిశీలించనున్నారు.
కూటమిలో కొరవడిన సమన్వయం
అభ్యర్థుల్లో అయోమయం
‘వార్డుల’పై కుదరని ఇంకా ఏకాభిప్రాయం
సమయం మించిపోతుండడంతో ఎవరికివారే నామినేషన్ దాఖలు
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో పోటీపై కూటమి పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశావహులు అయోమయానికి గురయ్యారు. మేయర్ పదవిపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, కార్పొరేటర్ టికెట్ల పంపిణీ విషయంలో ఆదివారం మధ్యాహ్నం వరకూ ఒక కొలిక్కిరాలేకపోయారు. జనసేనకు 30, బీజేపీకి పది వార్డులు కేటాయించేలా మూడు పార్టీల నేతల మధ్య శనివారం అర్ధరాత్రి దాదాపు ఒప్పందం కుదిరింది. అయితే ఆయా వార్డులను ఎక్కడెక్కడ కేటాయించాలనే దానిపై పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలుకు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే సమయం ఉండడంతో మూడు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారంతా ఎవరికి వారు తమ పరిధిలోని జోనల్ కార్యాలయాలకు వెళ్లి నామినేషన్లు వేసేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉంది. ఆలోగా బి.ఫారాలు అందజేసేందుకు వీలుంది. అప్పటికి పార్టీల మధ్య స్పష్టత వస్తుంది కాబట్టి అంతా సర్దుకుంటుందని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.
టీడీపీ, జనసేన మధ్య తేలని సీట్ల పంచాయితీ
తొలుత 30 వార్డులకు ఓకే అన్న నేతలు
తాజాగా 36 వార్డులు అడుగుతుండడంతో ప్రతిష్టంభన
నేడు మరోమారు కూటమి నేతల భేటీ
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో వార్డుల కేటాయింపుపై తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పంపకాలు ఇంకా తేలలేదు. జనసేన నాయకులు తమకు 34 నుంచి 36 వార్డులు కావాలని, తూర్పు, దక్షిణ నియోజకవర్గాల పరిధిలో తాము కోరినవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో జనసేన అడుగుతున్న వార్డులు వదులుకునేందుకు టీడీపీ సుముఖంగా లేదని సమాచారం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో కూడా జనసేన అడిగిన వార్డులు ఇవ్వలేమని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు.
రాష్ట్రస్థాయిలో కుదిరిన ఒప్పందం ఫార్ములా మేరకు జీవీఎంసీలో జనసేనకు 24, బీజేపీకి ఆరు వార్డులు ఇవ్వాలి. కానీ జనసేనకు 30 వార్డులు, బీజేపీకి 10 వార్డులు ఇవ్వడానికి టీడీపీ నేతలు అంగీకరించారు. మిగిలిన 80 వార్డుల్లో పోటీకి నిర్ణయించారు. బీజేపీకి మరో వార్డు అదనంగా ఇచ్చారు. జనసేన నాయకులు కూడా తొలుత 30 వార్డులకు అంగీకరించారు. వారు అడిగిన వార్డుల విషయంలో శనివారం రాత్రి ప్రతిష్టంభన నెలకొంది. అయితే 30 వార్డులు కాకుండా 36 వార్డులు ఇవ్వాలని జనసేన నేతలు ఆదివారం సాయంత్రం టీడీపీ నేతల వద్ద ప్రతిపాదన చేయడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు ఇచ్చే వార్డుల సంఖ్య పెంచాలని పట్టుబడుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆదివారం రాత్రి సమావేశమై ప్రాథమికంగా చర్చించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లిన తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సోమవారం ఉదయం ఎంపీ శ్రీభరత్ ఇంట్లో కూటమి పార్టీల నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం 120 వార్డులకు అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
బీజేపీకి 11 కేటాయించిన వార్డులివే?
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):
కూటమి పార్టీల మధ్య పంపకాల్లో భాగంగా బీజేపీకి 11 వార్డులు కేటాయించారు. ఇందుకు సంబంఽదించి బీజేపీ రాష్ట్ర కమిటీ నుంచి అనుమతి లభించడంతో జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రాతినిధ్యం ఉండేలా చూడనున్నారు. కూటమి నేతల సమాచారం ప్రకారం బీజేపీకి ఇచ్చిన వార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. 12వ వార్డు (విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి), 53, 57, 58 (ఉత్తర), 54 (భీమిలి), 39 (దక్షిణ), 119 (పెందుర్తి), 87, 97 (గాజువాక), 111 (అనకాపల్లి), 81 (పశ్చిమ) వార్డులు బీజేపీకి ఇచ్చారు. దీనిపై అధికారికంగా ఆదివారం రాత్రి లేదా సోమవారం ప్రకటన చేయనున్నారు.