Share News

పెట్టుబడుల వెల్లువ

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:47 AM

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జిల్లాకు పెట్టుబడులు వెల్లువలా తరలివచ్చాయి.

పెట్టుబడుల వెల్లువ

డేటా సెంటర్ల హబ్‌గా విశాఖ

దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ల రాక

రైల్వే జోన్‌ కల సాకారం

స్టీల్‌ ప్లాంటుకు కేంద్రం నుంచి నిధులు

భోగాపురం విమానాశ్రయానికి రహదారులు

పంచ గ్రామాల భూసమస్యకు మాత్రం ఇంకా లభించని పరిష్కారం

పట్టాలెక్కని మెట్రో రైలు ప్రాజెక్టు

ఇదీ ‘కూటమి’ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జిల్లాలో పరిస్థితి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జిల్లాకు పెట్టుబడులు వెల్లువలా తరలివచ్చాయి. ఆసియాలో అతి పెద్ద డేటా సెంటర్‌ హబ్‌గా విశాఖపట్నం నిలిచేందుకు ఆడుగులు పడ్డాయి. ఒక్క గూగుల్‌ డేటా సెంటర్‌ ద్వారానే రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. అతి పెద్ద ఐటీ కంపెనీలు విశాఖపట్నంలో భూములు తీసుకున్నాయి. కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశాయి. దశాబ్దాల కల దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయం ప్రారంభమైంది. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందింది. అయితే సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మెట్రో రైలు ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు.

రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటుచేసి శుక్రవారం (జూన్‌ 12వ తేదీ) నాటికి సరిగ్గా రెండేళ్లు అవుతుంది. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారు. వాటిని సమీక్షించుకుంటే...చెప్పినట్టుగానే విశాఖను ఐటీ హబ్‌గా మార్చేందుకు భారీ పెట్టుబడులు తీసుకువచ్చారు. హైపర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌ ముందుకువచ్చింది. తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో 600 పైచిలుకు ఎకరాలు కేటాయించగా రూ.1.35 కోట్ల పెట్టుబడులు పెట్డడానికి సిద్ధమైంది. దీనికి ముందు సిఫీ సంస్థ కూడా రుషికొండ ఐటీ పార్కులో డేటా సెంటర్‌ పనులు ప్రారంభించింది. అదేవిధంగా ఐటీ రంగంలో జెయింట్‌ కంపెనీలుగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), కాగ్నిజెంట్‌ తదితర సంస్థలు భూములు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించాయి. ఈ రెండూ వివిధ ప్రాంతాల్లో ఉన్న సీనియర్‌ ఉద్యోగులను విశాఖపట్నం తీసుకువచ్చి ఆపరేషన్లు కూడా ప్రారంభించాయి. ఇవికాకుండా మరో పదికి పైగా ఐటీ కంపెనీలు భూములు తీసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఇవన్నీ రెండేళ్ల వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చాయి.

రైల్వే జోన్‌ కల సాకారం

కేంద్రం రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామంటే వైసీపీ ప్రభుత్వం భూములు అప్పగించకుండా తాత్సారం చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే ముడసర్లోవలో 52 ఎకరాల భూములు అప్పగించి, మ్యుటేషన్‌ కూడా చేసింది. అందులో శరవేగంతో రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం పనులు జరుగుతున్నాయి. జోన్‌ ఆపరేషన్‌ కూడా ఈ నెలలోనే సిరిపురం డెక్‌లో ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వ చొరవతో సాకారమైంది.

పులకరిస్తున్న పర్యాటక రంగం

పర్యాటక రంగం ఉరకలు వేయడానికి అవసరమైన నిర్ణయాలు, భూముల కేటాయింపులు జరిగాయి. అనేక సంస్థలు హోటళ్ల నిర్మాణానికి భూములు తీసుకున్నాయి. పర్యాటకులకు బీచ్‌ అందాలు చూపించడానికి హాప్‌ ఆన్‌-హాప్‌ ఆఫ్‌ బస్సులు వేశారు. వీఎంఆర్‌డీఏ పర్యాటకులను ఆకర్షించేలా కైలాసగిరిపై రూ.2.5 కోట్లతో ‘త్రిశూల్‌’ ఏర్పాటుచేసింది. యువత కోసం స్కై లైనర్‌, స్కై సైక్లింగ్‌ వంటివి నడుపుతోంది. రుషికొండ బీచ్‌లో స్పీడ్‌ బోట్లు అలరిస్తున్నాయి. పారా మోటారింగ్‌ కొత్త అనుభూతులు పంచుతోంది. గోవా తరహాలో బీచ్‌ షాక్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం విశాఖను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసింది.

పంచగ్రామాల భూ సమస్య ఎక్కడిదక్కడే

సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల భూసమస్య పరిష్కరిస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రెండేళ్లు పూర్తయినా ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఊరట లభించలేదు. దేవస్థానం చైర్మన్‌ భూములు ఇవ్వడానికి అంగీకరించినా, న్యాయస్థానంలో కేసు కారణంగా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజాప్రతినిదులు ఇబ్బంది పడుతున్నారు.

మెట్రో రైలు సర్వేలతో సరి

విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రతిపాదన చేసి పదేళ్లు దాటింది. రాష్ట్రం పంపిన డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలపడం లేదు. డబుల్‌ డెక్కర్‌ విధానంలో మెట్రో రైలు నడుపుతామని కూటమి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. మళ్లీ సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిధుల సమస్యతో మెట్రో రైలు మార్గాలు తగ్గిపోతున్నాయి. ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

ఫ్లైఓవర్ల నిర్మాణం విస్మరణపై విమర్శలు

సిటీలో లంకెలపాలెం నుంచి కొమ్మాది వరకు జాతీయ రహదారిపై 12 ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే మెట్రో రైలు ప్రాజెక్టు వస్తున్నందున, ముందుగా ఫ్లైఓవర్లు నిర్మిస్తే భూ సేకరణ సమస్య వస్తుందని, నిధులు వృథా అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి పరిష్కారంగా డబుల్‌ డెక్కర్‌ విధానంలో మెట్రో రైలు నిర్మాణం చేపడతామని అంటోంది. అయితే ఆ ప్రాజెక్టు వచ్చినా ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు అవసరమని, వాటిని నిర్మించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

కాలుష్యం అదుపులో విఫలం

నగరంలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఢిల్లీని మించి కాలుష్యం విశాఖలో నమోదవుతోంది. దీనిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందుతోంది. నిబంధనలు సడలించడం వల్ల కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

అన్నింటా అవినీతే

జిల్లాలో ఏ కార్యాలయానికి వెళ్లి ఏ పని చేయించుకోవాలన్నా ముడుపులు సమర్పించుకోవలసిందే. వైసీపీ ప్రభుత్వంలో ఎలా అవినీతి జరిగిందో...ఇప్పుడూ అలాగే ఉంది. డబ్బులు ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదు. రెవెన్యూ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలన్నీ అవినీతి కంపు కొడుతున్నాయి. జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే భారీగా లంచాలు పుచ్చుకుంటున్నారు. పారదర్శకత లోపించింది. సిఫారసులకే పనులు జరుగుతున్నాయి. అధికారుల బదిలీలన్నీ రాజకీయ సిఫారసులతోనే జరుగుతున్నాయి.

Updated Date - Jun 12 , 2026 | 01:47 AM