Share News

స్పెషల్‌ ఎగ్జామ్స్‌కు దరఖాస్తుల వెల్లువ

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:56 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించ తలపెట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలకు అభ్యర్థుల నుంచి భారీస్పందన లభిస్తోంది.

స్పెషల్‌ ఎగ్జామ్స్‌కు దరఖాస్తుల వెల్లువ

  • ఇప్పటికే 15 వేలకుపైగా వచ్చినట్టు ఏయూ అధికారుల వెల్లడి

  • డిగ్రీ కోర్సులకు 12,000, పీజీ కోర్సులకు 3,000...

  • 2010-2025 మధ్యకాలంలో డిగ్రీ, పీజీల్లో చేరి కోర్సు పూర్తి చేయలేని వారికి అవకాశం

  • ఆన్‌లైన్‌ విధానంలో ఫీజు చెల్లింపునకు అవకాశం

  • ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించ తలపెట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలకు అభ్యర్థుల నుంచి భారీస్పందన లభిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన అధికారులు విడుదల చేశారు. 2010-2025 మధ్యకాలంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరి బ్యాక్‌లాగ్స్‌ ఉండిపోయిన వారికి ఈ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ఒక్కో సబ్జెక్టుకు (థియరీ) రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలకు ఈ నెల 15వ తేదీ వరకూ 15 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో డిగ్రీ కోర్సులకు సంబంధించి 12 వేల వరకూ వచ్చాయి. అలాగే, పీజీ కోర్సులకు మరో మూడ వేలు దరఖాస్తులు వచ్చాయి. ఎంపీఈడీ, బీపీఈడీ, లా వంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు మరో 560 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో విద్యార్థి రెండు నుంచి ఆరు సబ్జెక్టులకు ఫీజు చెల్లించినట్టు తెలుస్తోంది. దాదాపు 60 శాతం మందికిపైగా మూడుకుపైగా సబ్జెక్టులు ఉన్నవాళ్లే ఉన్నట్టు తెలుస్తోంది.

ఏళ్ల నుంచి నిరీక్షణ

డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరే కొంతమంది వేర్వేరు కారణాలతో కోర్సులను పూర్తిచేయరు. అటువంటి వారంతా స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించాలంటూ వర్సిటీ అధికారులను ఎప్పటినుంచో కోరుతూ వస్తున్నారు. గతంలో వర్సిటీ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఒక్కో సబ్జెక్టుకు రూ.15 వేలు చొప్పున వసూలు చేయాలని భావించారు. అంతేసి ఫీజులు చెల్లించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తంకావడంతో స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షల నిర్వహణ ఆలోచన అప్పట్లో ఆగిపోయింది. అయితే, ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు పూర్తిచేయలేని వారికి మరో అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే స్పెషల్‌ డ్రైవ్‌ను అధికారులు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

గడువు పొడిగింపు..

ఈ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్‌ను అధికారులు గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన విడుదల చేశారు. డిసెంబరు నాలుగో తేదీ నుంచి 26 వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే, ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడం, విద్యార్థుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తుండడంతో అధికారులు గడువును పెంచుకుంటూ వస్తున్నారు. తొలుత నోటిఫికేషన్‌లో ఇచ్చిన షెడ్యూల్‌ను మళ్లీ పొడిగించారు. జనవరి పదో తేదీ వరకు రిజిస్ర్టేషన్‌ చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. పండగ సెలవులు, ఇతర కారణాల వల్ల గడువును తాజాగా ఈ నెల 27 వరకు పెంచారు. ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న విద్యార్థుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కోర్సులు, సబ్జెక్టుల వారీగా విడగొట్టే ప్రక్రియను చేపట్టారు. తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలను ఏయూలోనే నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే, భారీగా దరఖాస్తులు వస్తుండడంతో ప్రత్నామ్నాయ పరీక్షా కేంద్రాల ఎంపికపై అధికారులు దృష్టిసారించారు.

ఏయూ పరీక్షలు వాయిదా

విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ప్రొఫెషనల్‌, పీజీ డిప్లొమో కోర్సులకు ఈ నెల 20 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్టు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ టి.చిట్టిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను ఈ నెల 27 నుంచి నిర్వహించనున్నట్టు స్పష్టంచేశారు. మరిన్ని వివరాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.

Updated Date - Jan 20 , 2026 | 12:56 AM