పల్లెల్లో హోరాహోరీ పోరు
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:36 AM
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు పంచాయతీల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తెరవెనుక రాజకీయాలకు పావులు కదుపుతుండడంతో పల్లె రాజకీయాలు వేడెక్కాయి.
ఏకగ్రీవాల వెనుక రాజకీయ వ్యూహాలు
- ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు పంచాయతీల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తెరవెనుక రాజకీయాలకు పావులు కదుపుతుండడంతో పల్లె రాజకీయాలు వేడెక్కాయి.
ఇటీవల జరిగిన జడ్పీ, ఎంపీపీ, మునిసిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించిన కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు అదే జోరును పంచాయతీల్లోనూ కొనసాగించాలని వ్యూహాలు రచిస్తుండగా, రాజకీయ ఉనికి చాటుకొనే ప్రయత్నంలో వైసీపీ ఉంది. మూడు దశల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తవడంతో గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం రాజీకీయ పక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్థానిక రాజకీయ సమీకరణాలు, పెద్దల మధ్య రాజీలు, పార్టీల అంతర్గత చర్చలు ఊపందుకున్నాయి. జిల్లాలో మూడు విడతల్లో 642 గ్రామ పంచాయతీలు, 6,258 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ అభ్యర్థులు అధికారికంగా పార్టీ గుర్తులపై పోటీ చేయకపోయినా, ప్రతి గ్రామంలో కూటమి, వైసీపీ మద్ధతుదారులుగా బరిలో నిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ గ్రామంలో ఎవరి బలం ఎంత ఉందో ఈ ఎన్నికలు మరోసారి పరీక్షించనున్నాయి. జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో జిల్లాలో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన సంగతి తెలిసిందే. 24 జడ్పీటీసీ స్థానాలతో పాటు జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలతో పాటు 24 ఎంపీపీ పదవుల్లో 23 పదవులను కూటమి కైవసం చేసుకుని పల్లెల్లో రాజీకీయంగా తన సత్తా చాటుకుంది. అదే ఊపును పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కూటమి నేతలు గ్రామాల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు స్థానిక అసంతృప్తి, వ్యక్తిగత ప్రభావం, గ్రామస్థాయి నాయకత్వాన్ని నమ్ముకొని వైసీపీ పలు చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. కొన్ని గ్రామాల్లో తిరుగుబాటు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల మద్దతు పొందిన అభ్యర్థులకు సవాల్‌గా మారారు.
సామాజిక సమీకరణాలు
అభ్యర్థుల విజయంలో సామాజిక సమీకరణాలు, కుటుంబ బలం, అభివృద్ధి హామీలు, స్థానిక సమస్యలు కీలకంగా మారనున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మహిళా సంఘాలు, యువత, గ్రామ పెద్దల మద్దతు కోసం మంతనాలు జరుపుతూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల్లేని ఎన్నికలైనా, ఫలితాలను మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలు తమ రాజకీయ బలానికి కొలమానంగా భావిస్తున్నాయి.