Share News

వాణిజ్య అధికారులకు పండగే!

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:46 AM

దసరా, దీపావళి సీజన్‌ వచ్చిందంటే వాణిజ్య పన్నుల శాఖే ఎక్కువ సంబరపడుతుంది,

వాణిజ్య అధికారులకు పండగే!

దీపావళికి ఏటా రూ.కోట్లలో బాణసంచా వ్యాపారం

బిల్లులు తూతూమంత్రం

ప్రభుత్వానికి వచ్చే రాబడి అంతంతమాత్రం

కొంతమంది అధికారులు ముడుపులు అందుకుని సహకారం అందజేస్తున్నారనే ఆరోపణలు

(విశాఖట్నం-ఆంధ్రజ్యోతి)

దసరా, దీపావళి సీజన్‌ వచ్చిందంటే వాణిజ్య పన్నుల శాఖే ఎక్కువ సంబరపడుతుంది, దండిగా జేబులు నింపుకుంటుంది. ఈ రెండు పండుగలకు వస్త్ర, ఎలకా్ట్రనిక్స్‌ వ్యాపారాలు వందల కోట్ల రూపాయల్లో జరుగుతాయి. ఇవికాకుండా దీపావళికి బాణసంచా వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇదంతా కేవలం వారం రోజులు...ఇంకా చెప్పాలంటే పండుగ ముందు రోజు, ఆరోజు భారీగా అమ్మకాలు ఉంటాయి. వీటి కోసం రెగ్యులర్‌ వ్యాపారులతో పాటు కొందరు బృందాలుగా ఏర్పడి శివకాశి, విజయనగరం నుంచి సరుకు లారీల్లో తెచ్చుకుంటారు. ఇదంతా పెద్ద మోళీ వ్యాపారం. భారీ డిస్కౌంట్లపై నడుస్తుంది. ఎంఆర్‌పీపై 60 నుంచి 70 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటిస్తారు. స్టీల్‌ ప్లాంటులో ఒక కో-ఆపరేటివ్‌ సొసైటీ ఒక్కటే సుమారు రూ.5 కోట్ల వ్యాపారం చేస్తుంది. అదేవిధంగా నాతయ్యపాలెంలో మరో వ్యాపార సంస్థ కూడా అదే స్థాయిలో బాణాసంచా విక్రయిస్తోంది. వీరు కాకుండా ఏయూ మైదానం (ఈ ఏడాది ఫుట్‌బాల్‌ మైదానంలో ఏర్పాటుచేశారు)లో 200 మంది వరకు దుకాణాలు పెట్టి విక్రయిస్తారు. నగర శివారు ప్రాంతాలు గాజువాక, పెందుర్తి, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాల్లో కూడా అమ్మకాలు జరుగుతాయి. బాణసంచాపై కేంద్రానికి 9 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 9 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. అంటే రూ.100 వస్తువుపై రూ.18 పన్ను కట్టాల్సి ఉంటుంది. దీపావళికి అధమంగా జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే ఆ స్థాయిలో వాణిజ్య పన్నుల శాఖకు పన్నులు వసూలు కావడం లేదు. వ్యాపారం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్‌ లేనివారు సైతం బాణసంచా తెచ్చి అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ నిల్వలను వాణిజ్య పన్నుల శాఖ స్వాధీనం చేసుకుని సీజ్‌ చేయవచ్చు. కానీ బాణసంచా వ్యాపారులు ముందుగానే సర్కిళ్ల వారీగా మాట్లాడుకొని, నజరానాలు సమర్పించుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాణిజ్య పన్నుల శాఖాధికారులు సహకరిస్తున్నారు. ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం తేవడానికి ప్రయత్నం చేయకుండా తమ జేబుల్లోకి ఎంత వచ్చిందనే దానిపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో బాణసంచా వ్యాపారం ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా మూడు మతాబులు..ఆరు చిచ్చుబుడ్లు అన్నట్టుగా సాగిపోతోంది. ఈ విషయంలో ద్వారకానగర్‌, డాబాగార్డెన్స్‌, చిన్నవాల్తేరు, స్టీల్‌ప్లాంటు, గాజువాక, మధురవాడ, అనకాపల్లి సర్కిల్‌ వాణిజ్య పన్నుల శాఖాధికారులకు ఈసారి బాగానే ముట్టినట్టు వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం విజిలెన్స్‌ విభాగం ద్వారా బాణాసంచా వ్యాపారుల లైసెన్స్‌లు, వారు చెల్లించిన పన్నుల గురించి ఆరా తీస్తే వాణిజ్య పన్నుల శాఖ బండారం బయటపడుతుంది.

రైటప్‌ : ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన దుకాణాలు

----------------

బాణసంచా దుకాణాలకు

ఫుట్‌బాల్‌ మైదానం

ఏయూ అధికారుల తీరుపై విమర్శలు

విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులకు విద్యార్థుల కంటే ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...విశ్వవిద్యాలయానికి అనేక మైదానాలు ఉన్నాయి. అందులో ఇంజనీరింగ్‌ కళాశాల మైదానాన్ని ఎక్కువగా వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇస్తుంటారు. దానివల్ల వర్సిటీకి కొంత ఆదాయం వస్తుండడంతో పెద్దగా ఎవరూ అభ్యంతరం వ్యక్తంచేయరు. విద్యార్థుల క్రీడా అవసరాలు, పోటీల నిర్వహణకు ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ ఉపయోగపడుతోంది. ఆ మైదానాన్ని కూడా ఇప్పుడు కమర్షియల్‌ అవసరాల కోసం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.

దీపావళి సామగ్రి విక్రయాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానాన్ని కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ ఏడాది అక్కడ సీఐఐ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండడంతో వర్సిటీ అధికారులు ఫుట్‌బాల్‌ మైదానాన్ని కేటాయించారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌బాల్‌ మైదానంలో కొద్దిరోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజీయేట్‌ కాంపిటేషన్స్‌ అండ్‌ యూనివర్సిటీ టీమ్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నారు. అవి ఈ నెల 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఈ నెల 6న ఆర్చరీ, 10, 11 తేదీల్లో ఫుట్‌బాల్‌ పోటీలను నిర్వహించేందుకు క్రీడా విభాగం అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, దీపావళి సామగ్రి విక్రయాలకు మైదానాన్ని కేటాయించడంతో ఆ పోటీలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయాల్సిన క్రీడా విభాగ అధికారులు మౌనం దాల్చడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

కీలకమైన మైదానం..

ఏయూలో క్రీడా పోటీల నిర్వహణకు అనువుగా ఉన్నది ఒక్క ఫుట్‌బాల్‌ మైదానమే. ఇప్పుడు అక్కడ బాణసంచా దుకాణాల ఏర్పాటుకోసం గోతులు తవ్వేశారు. భారీ వాహనాలు రావడం వల్ల మైదానం దెబ్బతింది. దీనివల్ల భవిష్యత్తులో ఆ మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Nov 07 , 2026 | 12:46 AM