అరకొర నిర్మాణాలు.. అలంకారప్రాయాలు..
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:22 PM
ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారుల సమన్వయం లోపం పాఠశాలలకు శాపంగా మారింది. పాఠశాలల్లో అవసరమైన పనులు చేపట్టాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా రెండో విడత నాడు-నేడు పనులన్నీ అరకొరగా చేపట్టి గాలికి వదిలేశారు. అంతేకాకుండా చాలీచాలని నిధులు విడుదల కావడం, ఎన్నికలు వస్తాయని పనులు చేయడానికి కమిటీలు వెనుకంజ వేయడం కూడా కారణంగా చెప్పవచ్చు.
పాఠశాలల్లో మౌలిక వసతులు
అంతంతమాత్రమే
విద్యా, ఇంజనీరింగ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం
నాడు-నేడు రెండో విడతలో
చేపట్టిన పనుల దుస్థితి
అరకులోయ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో పలు మండలపరిషత్ ప్రాఽథమిక పాఠశాలల్లో నాడు-నేడు రెండో విడత పనులకు నిధులు మంజూరయ్యాయి. దీంతో ఆయా పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో కొన్నిచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. బొండాం గ్రామంలో పాఠశాల భవనం శిథిలస్థితికి చేరుకుంది. ఇక్కడ భవన నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. అయితే భవనం గురించి అసలు పట్టించుకోలేదు. టాయ్‌లెట్స్ పనులు లింటల్ స్థాయిలో నిలిపి పైకప్పుగా రేకులు వేశారు. మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదు. అసలు పాఠశాలలకు నీటి సౌకర్యమే లేదు. బెంచీలు, టీవీ తప్ప మరి ఏ పనులు సక్రమంగా చేపట్టలేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆర్వోప్లాంట్ పరికరాలు ప్యాకింగ్ విప్పకుండా నేటికీ స్టోర్‌రూంలో నిరుపయోగంగా ఉంచారు. పాఠశాల భవనానికి సరైన తలుపు కూడా లేదు. విశేషమేమిటంటే.. శిథిల భవనానికి విద్యుత్ వైరింగ్ చేపట్టారు. వాస్తవానికి ఈ పాఠశాలకు నూతన భవనాలు నిర్మించకుంటే వర్షాకాలంలో విద్యార్థుల చదువులు ప్రశార్థకమే. మంజూరైన రూ.12లక్షల్లో కేవలం రూ.3.5 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ నిధులకు సరిపడా పనులు చేపట్టామని బొండాం పాఠశాల హెచ్‌ఎం కొమ్ములు తెలిపారు. అదేవిధంగా నిన్నిమామిడివలస ఎంపీపీ పాఠశాలలో శిథిలభవనం వంటకు వినియోగిస్తుండగా.. మరొక భవనం మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ పాఠశాలకు నాడు-నేడు రెండో విడతలో రూ.16 లక్షలు మంజూరయ్యాయి. కిచెన్‌షెడ్ అరకొరగా నిర్మించి వదిలేశారు. కొళాయి పాయింట్‌లు పూర్తి చేయలేదు. ఆర్వో ప్లాంట్ మెటీరియల్ స్టోర్‌లోనే భద్రంగా ఉంచారు. పాఠశాలకు గేటు, ప్రహరీ లేక చిన్న తడికను పాఠశాల చుట్టూ ఏర్పాటు చేశారు. అలాగే సిమిలిగుడ ఆర్‌ఎస్ ఎంపీపీ పాఠశాలను శిథిల భవనంలోనే నిర్వహిస్తున్నారు. వరండాలో మూడు తరగతులను నిర్వహిస్తున్నారు. మరో చిన్న షెడ్‌లో మరో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. మోటారుతో బోరు బావి ఉన్నప్పటికీ వాటర్‌ట్యాంకు ఏర్పాటు చేయలేదు. దీంతో టాయ్‌లెట్స్‌కు రన్నింగ్ వాటర్ ఇవ్వలేదు. ఆర్వోప్లాంట్, టాయ్‌లెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. ఈ పాఠశాలకు రెండో విడతలో నాడు-నేడు నిధులు మంజూరు చేశారు. అయితే ఎంత మేర నిధులు మంజూరు చేశారో తెలియడం లేదు. బెంచీలు, టీవీ, ఆర్వోప్లాంట్ సరఫరా చేశారు. టాయ్‌లెట్స్ మరమ్మతులు, చిన్న షెడ్ మరమ్మతులు చేసి, విద్యుత్ వైరింగ్ చేయించినట్టు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఎక్కడా మంజూరైన నిధులకు తగ్గట్టు పనులు కనిపించడం లేదు. ఈ మూడు పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు నేటికీ ఏర్పాటు చేయలేదు. ఈ మూడు పాఠశాలలకు నూతన భవనాలు మంజూరు చేయాల్సి ఆవశ్యకత ఉంది. వీటిలో ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉన్నారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందగా.. సక్రమంగా పనులు చేయించడంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండో విడత నాడు-నేడు నిధులతో చేపట్టిన పనులపై ప్రత్యేక విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ పాఠశాలల్లో అలంకారప్రాయంగా నిలిచిన కిచెన్‌షెడ్‌లు, ఆర్వో ప్లాంట్, టాయ్‌లెట్స్ అందుబాటులోకి వచ్చేలా జిల్లా విద్యాశాఖ అధికారి, ఐటీడీఏ పీవో ప్రత్యేక చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.