వస్త్ర వ్యాపారులకు పండుగ
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:16 AM
సంక్రాంతి సందర్భంగా నగరంలో వస్త్ర వ్యాపారం భారీగా జరిగింది.
కిటకిటలాడుతున్న దుకాణాలు
కలిసివచ్చిన జీఎస్టీ తగ్గింపు
బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉండడంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి నగరానికి మహిళలు రాక
సంక్రాంతి సీజన్‌లో రూ.700 కోట్లకుపైగా టర్నోవ ర్ జరిగిందని అంచనా
గత ఏడాది కంటే రూ.150 కోట్లు అధికం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి సందర్భంగా నగరంలో వస్త్ర వ్యాపారం భారీగా జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉండడంతో అనకాపల్లి, చోడవరం, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల నుంచి కూడా ఈ ఏడాది మహిళలు దుస్తుల కొనుగోళ్ల కోసం నగరానికి తరలివచ్చారు. దీంతో గత పదిహేను రోజులుగా నగరంలో చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అన్ని వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సీజన్‌లో సుమారు రూ.700 కోట్ల మేర టర్నోవర్ జరిగి ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
నగరంలో పెద్ద దుకాణాలు 50 వరకూ ఉన్నాయి. చిన్న, మధ్యస్థాయి వస్త్ర దుకాణాలు మరో 800 ఉన్నాయి. పెళ్లిళ్లు, పండగల వంటి సందర్భాల్లో కాకుండా సాధారణ రోజుల్లో అన్ని దుకాణాల్లో కలిపి సగటున రోజుకు రూ.పది కోట్ల విలువైన వస్త్రాలు అమ్ముడవుతుంటాయి. అదే ఉగాది, దసరా, దీపావళి వంటి పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో విక్రయాలు పెరుగుతాయి. కానీ సంక్రాంతి పండుగకు ఇంటిల్లపాదీ దుస్తులు కొనుగోలు చేస్తారు. పండుగకు నెల రోజులు ముందు నుంచే వస్త్రాలు కొనడం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే వస్త్ర వ్యాపారులు కూడా భారీ స్టాక్ సిద్ధం చేసుకుని, ఆఫర్ల ఫేరుతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పోటీపడుతుంటారు. దీనివల్ల సంక్రాంతి సీజన్‌లో నగరంలోని వస్త్ర దుకాణాలు రద్దీగానే కనిపిస్తాయి. వస్త్ర దుకాణాలు ఎక్కువగా ఉన్న జగదాంబ జంక్షన్, డాబాగార్డెన్స్, ఆశీల్ మెట్ట, వీఐపీ రోడ్డు, ద్వారకా నగర్, పూర్ణామార్కెట్ వంటి ప్రాంతాలు గత 15 రోజులుగా కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. కొన్ని మాల్స్ వద్ద అయితే కొనుగోలుదారులు లోనికి వెళ్లేందుకు వీలులేక బయట క్యూలో నిలబడి ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది.
గత ఏడాది సంక్రాంతి సీజన్‌లో నగరంలో రూ.550 కోట్లు విలువైన వస్త్రవ్యాపారం జరిగితే.. ఈ ఏడాది దాదాపు రూ.700 కోట్లు వ్యాపారం జరిగిందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. వస్త్రాలపై జీఎస్టీ గతంలో 18 శాతం ఉండగా, దానిని కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబరులో 12 శాతానికి తగ్గించింది. దీనివల్ల ధరలు కొంత తగ్గాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తోంది. దాంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు చెందిన వారంతా దుస్తుల కొనుగోలుకు ఈ ఏడాది నగరానికి తరలివచ్చారు. వీటన్నింటి కారణంగా నగరంలో వస్త్ర వ్యాపారం బాగా జరిగిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
గత ఏడాది కంటే అధికంగా వ్యాపారం
రత్తయ్య, గ్రూప్ ఆఫ్ లక్కీషాపింగ్ మాల్స్ యజమాని
సంక్రాంతి సీజన్ వ్యాపారం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగానే జరిగింది. వస్ర్తాలపై జీఎస్టీని కేంద్రం 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించడంతో ధరలు తగ్గాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ ఏడాది వ్యాపారం పెరగడానికి కారణమని చెప్పుకోవాలి. సంక్రాంతి సీజన్‌కు గత నెల రోజులుగా వ్యాపారం మొదలైంది. బుధవారం కూడా విక్రయాలు ఇదే రీతిన జరుగుతాయని అంచనా వేస్తున్నాం.
రద్దీగా రైళ్లు
కొనసాగుతున్న ప్రయాణికుల తాకిడి
విశాఖ మీదుగా నడిచే రైళ్లకు అధికం
ఒరిజినేటింగ్ రైళ్లకు సాధారణం
విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):
రైళ్లకు సంక్రాంతి ప్రయాణికుల తాకిడి కొనసాగుతోంది. విశాఖ మీదుగా హౌరా, చైన్నె, బెంగళూరు, గువాహటి, ముంబై ప్రాంతాలకు నడిచే రైళ్లన్నీ మంగళవారం కిక్కిరిసి ఉన్నాయి. రిజర్వేషన్ కోచ్‌లు కూడా జనరల్ కోచ్‌లను తలపించాయి. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా మెయిల్, చెన్నై మెయిల్, కోరమండల్, ఎల్‌టీటీ, ఫలక్‌నుమా, కోణార్క్, బొకారో ఎక్స్‌ప్రెస్, టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (రానుపోను)తో పాటు గోదావరి, గరీబ్‌రథ్, విశాఖ, దురంతో, మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అత్యధిక ప్రయాణికులు నగరానికి చేరుకోవడంతో రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
విశాఖ నుంచి నడిచే ఒరిజినేటింగ్ రైళ్లకు మాత్రం మంగళవారం సాధారణ రద్దీ నెలకొంది. అయితే విజయవాడ నుంచి విశాఖ చేరిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు దిగకముందే...ఇక్కడ నుంచి వెళ్లే ప్రయాణికులు ఎక్కేందుకు యత్నించడంతో ప్రవేశ ద్వారాల వద్ద రద్దీ ఏర్పడింది.
రైళ్లకు సాధారణ రద్దీ
విశాఖ నుంచి బయలుదేరిన గోదావరి (12727), గరీబ్‌రథ్ (12739), దురంతో (22203), మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12861), నాందేడు ఎక్స్‌ప్రెస్ (20811)లతోపాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా మంగళవారం చివరి నిమిషం వరకూ బెర్తులు లభించాయి. అయితే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో జనరల్ కోచ్‌లు మాత్రం నిండిపోయాయి.