Share News

గాడితప్పిన సచివాలయ వ్యవస్థ

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:12 AM

గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ సంపూర్ణంగా గాడినపడలేదు. సచివాలయాలపై పర్యవేక్షణను మరింత పెంచాల్సిన అవసరం ఉందని, అప్పుడే సిబ్బంది సక్రమగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని స్పష్టమవుతున్నది. సచివాలయ సిబ్బందిలో డిజిటల్‌, ఇంజనీరింగ్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లకు పనిభారం అధికంగా వుండగా, ఏఎన్‌ఎం, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శికి మోస్తరుగా, మహిళా పోలీస్‌, వ్యవసాయ/ఉద్యానవన, వెటర్నరీ అసిస్టెంట్‌లకు తక్కువగా పనులు ఉంటున్నాయని అంటున్నారు.

గాడితప్పిన సచివాలయ వ్యవస్థ
పాడేరులో గ్రామ సచివాలయం (ఫైల్‌ ఫొటో)

ప్రక్షాళన చేసినా.. మెరుగుపడని వైనం

కొంతమంది ఉద్యోగులపై అధిక పనిభారం

మరికొందరికి అరకొర పనులు

డిప్యూటేషన్‌పై సర్వేయర్లు, వీఆర్‌వోలు

ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోల ఆదేశాలు బేఖాతరు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ సంపూర్ణంగా గాడినపడలేదు. సచివాలయాలపై పర్యవేక్షణను మరింత పెంచాల్సిన అవసరం ఉందని, అప్పుడే సిబ్బంది సక్రమగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని స్పష్టమవుతున్నది. సచివాలయ సిబ్బందిలో డిజిటల్‌, ఇంజనీరింగ్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లకు పనిభారం అధికంగా వుండగా, ఏఎన్‌ఎం, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శికి మోస్తరుగా, మహిళా పోలీస్‌, వ్యవసాయ/ఉద్యానవన, వెటర్నరీ అసిస్టెంట్‌లకు తక్కువగా పనులు ఉంటున్నాయని అంటున్నారు. మరోవైపు సర్వేయర్లు, వీఆర్‌వోలను మండల, డివిజన్‌ కార్యాలయాలకు డిప్యూటేషన్లపై వేసి అక్కడ పనులు చేయించుకుంటున్నారు. జిల్లా కేంద్రం పాడేరులోని మూడు సచివాలయాలకు చెందిన సర్వేయర్లు, వీఆర్‌వోలను ఇతర కార్యాలయాలకు పంపడం ఇందుకు ఒక ఉదాహరణ. అలాగే మహిళా పోలీసులు సచివాలయాల్లో ఉంటుండగా, వ్యవసాయ/ఉద్యానవన అసిస్టెంట్‌లు ఫీల్డ్‌ వర్క్‌ పేరిట బయటే ఉంటున్నారు. ఎప్పుడు సచివాలయానికి వెళ్లినా డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసులు మినహా మిగిలిన సిబ్బంది కనిపించడంలేదు.

జిల్లాలో 244 గ్రామ పంచాయతీల పరిధిలో 212 గ్రామ సచివాలయాలు వున్నాయి. వివిధ కారణాల వల్ల వీటి పర్యవేక్షణ అధికారులకు ఒక సవాల్‌గా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాలు నవరత్నాల అమలుకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అనేక పనులను అప్పగిస్తున్నారు. దీంతో ఆయా పనులు సకాలంలో సక్రమంగా జరగని పరిస్థితి నెలకొందని మండల, డివిజన్‌, జిలాస్థాయి అధికారులు అంటున్నారు. సచివాలయ స్థాయిలో జరగాల్సిన ఏకీకృత కుటుంబ సర్వే, సిటిజన్‌ ఈ-కేవైసీ, వాట్సాప్‌ గవర్నెన్స్‌, తదితర అంశాల్లో జిల్లా వెనుకబడుతున్నది. సచివాలయ స్థాయి పనులు వేగవంతం కాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని కలెక్టర్‌ స్థాయి అధికారులు సైతం పేర్కొంటున్నారు. అలాగే మండల స్థాయిలో ఉండే ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోల మాటను సచివాలయ సిబ్బంది వినడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీడీవోలు పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన అధికారులు కావడం, సచివాలయాలు స్వర్ణ గ్రామ శాఖకు చెందినవి కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సచివాలయ వ్యవస్థను పర్యవేక్షించేందుకు గత ఏడాది డిసెంబరులో ప్రత్యేకంగా నియమించిన డిప్యూటీ ఎంపీడీవోల పరిస్థితి కూడా అలాగే ఉంది. వీరికి ఎంపీడీవో కార్యాలయాల్లో కనీసం కోర్చోడానికి కుర్చీలేని దుస్థితి. పర్యవేక్షణ, డేటా ఆన్‌లైన్‌, ఇతర పనులు చేపట్టేందుకు సదుపాయాలు లేని పరిస్థితి నెలకొంది. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు వేర్వేరు శాఖలకు చెందిన అధికారులు కావడంతోనే ఈ సమస్య నెలకొందని అంటున్నారు. ఈ కారణంగానే సచివాలయాల సిబ్బంది, వీరిని లెక్కచేయడం లేదని అంటున్నారు.

కలెక్టర్‌ హెచ్చరికలు

జిల్లాలో సచివాలయాల సిబ్బంది పనితీరు, అధికారుల పర్యవేక్షణపై కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇటీవల సచివాలయ వ్యవస్థపై అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విధులకు గౌర్హాజరవుతున్న సచివాలయ సిబ్బందిపై చర్యల్లోభాగంగా వారి హాజరు ఆధారంగా జీతాలను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయాలను పక్కాగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సచివాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - Feb 27 , 2026 | 01:12 AM