మాదక ద్రవ్య రహిత సమాజమే ధ్యేయం
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:47 AM
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడంతోపాటు మాదక ద్రవ్యరహిత సమాజమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నట్టు విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు.
రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
33 డ్రోన్‌లతో నిఘా
130 హాట్‌స్పాట్‌లను గుర్తింపు
వందలాది మంది అరెస్టు
17,400 కిలోల గంజాయి, 15.06 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడంతోపాటు మాదక ద్రవ్యరహిత సమాజమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నట్టు విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. 2029 నాటికి మాదకద్రవ్య రహిత దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం విజయవాడలోని ఈగల్ కార్యాలయంలో నార్కోటిక్స్ కంట్రోల్‌బ్యూరో సదరన్ రీజియన్ డైరెక్టర్ ఆర్.సుధాకర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐజీ గోపీనాథ్ పాల్గొని రేంజ్ పరిధిలో సాధించిన పురోగతిని వివరించారు. గంజాయి సాగు, రవాణాపై 33 డ్రోన్‌లతో నిఘా పెట్టి 130 హాట్‌స్పాట్‌లను గుర్తించామని, 31 కేసులు నమోదుచేసి 111 మందిని అరెస్టు చేశామని చెప్పారు. అలాగే 26 సీసీ టీవీ స్టాటిక్ చెక్‌పోస్ట్‌ల ద్వారా 284 కేసులు నమోదుచేసి 786 మందిని అరెస్టు చేశామన్నారు. 17,400 కిలోల గంజాయి, 15.06 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అంతర్రాష్ట నెట్‌వర్క్‌లపై దృష్టి పెట్టి 65 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి 598 మందిని అరెస్టు చేశామన్నారు. పరారీలో ఉన్న మరో 497 మందిని కూడా పట్టుకున్నామన్నారు. 19 కేసుల్లో 18 మంది నిందితులకు చెందిన రూ.11,02,18,281 విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేయగా, మరో 200 ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఆర్థిక దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గంజాయి నేరాలకు పదేపదే పాల్పడుతున్న 2,104 మందిపై హిస్టరీ షీట్లు తెరిచి నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామన్నారు.
నేటి నుంచి టౌన్‌ప్లానింగ్ ఓపెన్ ఫోరం
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి మూడు రోజులుపాటు ప్రత్యేక ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని చీఫ్ సిటీప్లానర్ ఛాంబర్‌లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. బిల్డింగ్ అప్లికేషన్లు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారం, టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కమిషనర్ కోరారు.
వీఎంఆర్‌డీఏ ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు భారీ స్పందన
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
అనధికార లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు మంగళవారం వీఎంఆర్‌డీఏ నిర్వహించిన మేళాకు మంచి స్పందన వచిచంది. తొలిరోజే 92 మంది వారి దగ్గరున్న హక్కు పత్రాలు, ఇప్పటివరకూ చెల్లించిన ఫీజుల వివరాలు, వాటి రశీదులు పట్టుకొని వచ్చి అధికారులను కలిశారు. కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశాలతో ఏర్పాటుచేసిన ఈ మేళాలో ప్లానింగ్ విభాగం అధికారులు కూర్చొని వచ్చిన ప్రతి ఫిర్యాదును స్వీకరించి, వారి ఫైల్ తెప్పించి వివరాలన్నీ చూసి, ఇంకా ఏమేమి సమర్పించాలో వారికి వివరించారు. ఇంకా ఎంత బకాయిలు కట్టాలో సూచించారు. తాము చెప్పినవన్నీ పూర్తిచేస్తే వెంటనే క్రమబద్ధీకరణ చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీయూపీ పద్మజ, పీఓలు మహాపాత్రో, అరుణవల్లి, రోహిణి, ఏపీఓలు సూర్యనారాయణ, రాజేశ్, అనిత, నిర్మల పాల్గొన్నారు.
కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ శేషశైలజ బదిలీ
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
కలెక్టరేట్‌లో ఉన్న కేఆర్‌ఆర్‌సీ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.శేషశైలజను అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.