Share News

డిగ్రీ కళాశాల కలేనా!

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:47 AM

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరవాడ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. ఇక్కడ ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సులు చదవాలంటే గాజువాక, విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లాల్సి వస్తున్నది. అమ్మాయిలను అంత దూరంలో చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో ఇంటర్‌తోనే చదువు మానేయాల్సి వస్తున్నది.

డిగ్రీ కళాశాల కలేనా!
పరవాడలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ఉన్నత విద్యకు దూరమవుతున్న ‘పరవాడ’ విద్యార్థులు

ఏటా 500 మందికిపైగా ఇంటర్‌ పూర్తి

డిగ్రీ చదవాలంటే విశాఖ, అనకాపల్లి వెళ్లాల్సిందే

అమ్మాయిలను అంతదూరం పంపడానికి తల్లిదండ్రుల విముఖత

ఇంటర్‌తోనే చదువు మానేయాల్సిన పరిస్థితి

ఆర్థికస్థోమతతో పేద విద్యార్థులకు సైతం ఇదే సమస్య

పరవాడ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరవాడ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. ఇక్కడ ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సులు చదవాలంటే గాజువాక, విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లాల్సి వస్తున్నది. అమ్మాయిలను అంత దూరంలో చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో ఇంటర్‌తోనే చదువు మానేయాల్సి వస్తున్నది.

మండలంలో సింహాద్రి ఎన్టీపీసీ, జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీ, ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్‌ పార్కు, ఇంకా పలు ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వున్నాయి. స్థానికులతోపాటు ఆయా కంపెనీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో అత్యధికులు ఇక్కడే కుటుంబాలతో నివాసం వుండడంతో మండలం జనాభా గణనీయంగా పెరిగింది. పదో తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పూర్తిసాయిలో సీట్లు అందుబాటులో వున్నాయి. సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం నాడు టీడీపీ హయాంలో పరవాడలో ప్రభుత్వం జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అవసరమైన నిధులను సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులను సమకూర్చింది. పరవాడతోపాటు అచ్యుతాపురం, మునగపాక మండలాల్లోని పలు గ్రామాల విద్యార్థులు ఇక్కడ ఇంటర్మీడియట్‌లో చేరుతున్నారు. దీంతో సీట్లకు విపరీతమై పోటీ ఏర్పడి, కొంతమంది అడ్మిషన్లు లభించేవి కావు. అనంతర కాలంలో ఇక్కడ ప్రైవేటు జూనియర్‌ కళాశాల కూడా ఏర్పాటు కావడంతో ఈ రెండు కళాశాలల్లో కలిసి 500 మంది వరకు ఇంటర్‌ విద్యను అభ్యసించే వెసులుబాటు కలిగింది. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ.. ఇంటర్‌ తరువాత ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఫార్మా, ఇతర వృత్తి ఆధారిత కోర్సుల్లో సీట్లు లభించని వారు, ఇంటర్‌లో కామర్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులు చదివిన వారు బీఎస్సీ, బీఏ, బీకాం వంటి డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే గాజువాక, విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లాల్సిందే. రోజూ అంతదూరం వెళ్లిరావడానికి వ్యయప్రయాసాలు పడాల్సి వస్తున్నది. ఆర్థికంగా మెరుగైన కుటుంబాలకు చెందిన అబ్బాయిల వరకు అంతగా ఇబ్బంది లేనప్పటికీ అమ్మాయిలను మాత్రం డిగ్రీ చదివించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ఉదయం ఏడు గంటలకే ఇళ్ల నుంచి బయలుదేరాల్సి రావడం, సాయంత్రం తరగతులు ముగిసి, ఇంటికి చేరేసరికి రాత్రి ఏడు, ఎనిమిది గంటలు అవుతుండడమే ప్రధాన కారణం. దీంతో చాలా మంది అమ్మాయిలు ఇంటర్‌తోనే చదువు అపేయాల్సి వస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో పరవాడలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని నాటి వైసీపీ పాలకులు ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం అయినా పరవాడలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

డిగ్రీ కళాశాల అవసరం

మద్దిల వినోద్‌బాబు, ప్రిన్సిపాల్‌, పరవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (2పీవీడీ-2)

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరవాడ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చాలా అవసరం. ఇక్కడ ఇంటర్‌ చదివే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. డిగ్రీ కళాశాల లేకపోవడంతో చాలా మంది ఇంటర్‌తోనే చదువు ముగించ్సా వస్తున్నది. ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. పరవాడలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలపై వుంది.

Updated Date - Apr 06 , 2026 | 12:47 AM