రహదారులపై గుంతలు పూడ్చివేతకు ‘డాక్టర్’
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:10 AM
నగరంలోని రహదారులపై గుంతలు (పాట్ హోల్స్) పూడ్చివేతకు జీవీఎంసీ ప్రత్యేక యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.
రహదారులపై గుంతలు పూడ్చివేతకు ‘డాక్టర్’
రూ.1.3 కోట్లతో అత్యాధునిక యంత్రం కొనుగోలు చేసిన జీవీఎంసీ
రోజుకి 300 చదరపు మీటర్లు ప్యాచ్‌వర్క్ చేసే సామర్థ్యం
విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని రహదారులపై గుంతలు (పాట్ హోల్స్) పూడ్చివేతకు జీవీఎంసీ ప్రత్యేక యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘బీటీ పాట్‌హోల్ డాక్టర్’గా పిలవబడే ఈ అత్యాధునిక యంత్రం ఖరీదు రూ.1.3 కోట్లు. ఆ యంత్రంతో సోమవారం రామ్‌నగర్‌లో కేర్ ఆస్పత్రి సమీపాన రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా యంత్రం పనితీరును జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పరిశీలించారు. రోడ్లపై పడిన గుంతలను శుభ్రం చేయడం, అవసరమైన బిటుమెన్ (బీటీ) మిశ్రమాన్ని గుంతలో నింపడం, ప్యాచ్ వర్క్‌ను రోలింగ్ చేయడం...అన్నీ అదే యంత్రం చేయడం చూసి వారిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ యంత్రంతో రోజుకు 300 చదరపు మీటర్లు గుంతలను కప్పవచ్చునని మెకానికల్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాయల్‌బాబు వివరించారు. యంత్రం సరఫరా చేసిన సంస్థే మూడేళ్లపాటు నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలను చూస్తుందని, రోడ్డుపై పడిన గుంత పరిమాణం బట్ట మరమ్మతుకు పది నుంచి 15 నిమిషాలు తీసుకుంటుందన్నారు. ఈ యంత్రంతో గుంతలను పూర్తి రహదారులను చక్కగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తంచేశారు.