Share News

మన్యంలో భిన్న వాతావరణం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:20 AM

మన్యంలో బుధవారం భిన్న వాతావరణం నెలకొంది. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఆ తరువాత కాస్త ఎండకాసింది. పలు మండలాల్లో మధ్యాహ్నం వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది.

మన్యంలో భిన్న వాతావరణం
హుకుంపేటలో బుధవారం మధ్యాహ్నం వర్షం

ఉదయం పొగమంచు, మధ్యాహ్నం భారీ వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

పెదబయలు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం భిన్న వాతావరణం నెలకొంది. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఆ తరువాత కాస్త ఎండకాసింది. పలు మండలాల్లో మధ్యాహ్నం వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది.

పెదబయలు మండల కేంద్రంలో బుధవారం వేకువజాము నుంచి ఉదయం వరకు పొగమంచు దట్టంగా కురవడంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. ఆ తరువాత ఒక మాదిరిగా ఎండకాయగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మట్టిరోడ్లు బురదమయంగా మారడంతో ద్విచక్రవాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు చిత్తడిగా మారాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల పరిధిలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తరువాత నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం వలన సాయంత్రం విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రం నుంచి కుమడ వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. కాగా లక్ష్మీపురం, సుజనకోట, దారెల, బంగారుమెట్ట, బూసిపుట్టు, రంగబయలు, బుంగాపుట్టు, బరడ, పెదగూడ, తదితర ప్రాంతాల్లో వాగులు, గెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో వరదనీరు ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Updated Date - Oct 08 , 2026 | 12:20 AM