ప్రాణం తీసిన విద్యుత్ తీగ
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:11 AM
విద్యుత్ తీగ ఓ బాలుడి ప్రాణం తీసింది. క్రికెట్ ఆడుతుండగా బంతి దూరంగా వెళ్లిపోవడంతో తీసుకువచ్చేందుకు వెళ్లిన బాలుడు అక్కడి అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనుల వద్ద ఎర్త్‌వైర్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
ఆరేళ్ల బాలుడి దుర్మరణం
క్రికెట్ ఆడుతూ బంతికోసం వెళ్లడంతో విద్యుదాఘాతం
కొమ్మాది, జూన్ 21 (ఆంధ్రజ్యోతి):
విద్యుత్ తీగ ఓ బాలుడి ప్రాణం తీసింది. క్రికెట్ ఆడుతుండగా బంతి దూరంగా వెళ్లిపోవడంతో తీసుకువచ్చేందుకు వెళ్లిన బాలుడు అక్కడి అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనుల వద్ద ఎర్త్‌వైర్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కొమ్మాది సాయిరాం కాలనీలో ఆదివారం జరిగింది. పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం ఉప్పరనాయడువలస గ్రామానికి చెందిన కురిటి నారాయణరావు, చిన్నమ్మడు దంపతులు పదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. ప్రస్తుతం సాయిరాంకాలనీలోని అపార్టుమెంట్ వాచ్‌మన్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. నివాసం ఉంటున్నారు. వారి కుమారు అఖిల్ (6) ఆదివారం ఉదయం అపార్టుమెంట్ ఎదుట రోడ్డుపై క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో బంతి రోడ్డు పక్కన భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు జరుగుతున్న ప్రదేశంలో పడింది. దానిని తీసుకునేందుకు వెళ్లిన అఖిల్ ప్రమాదవశాత్తు విద్యుత్ పనుల కోసం తవ్విన ప్రదేశంలో ఎర్త్‌వైర్ తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే బాలుడు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి సీఐ కేసునమోదు చేశారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాలుడి ప్రాణం పోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రదేశా న్ని ఈపీడీసీఎల్ జోన్-3 ఈఈ సింహాచలంనాయడు, ఏడీఈ కిరణ్‌కుమార్, ఏఈ నరేష్‌లు పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నేత రాజ్‌కుమార్, టీడీపీ నాయ కుడు మన్యాల సోంబాబు, సాయిరాంకాలనీ అధ్యక్షుడు కురుమోజు గోవిందరావు, తదితరులు డిమాండ్ చేశారు. బాలుడి తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు.
25 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
కంచరపాలెం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 25 నుంచి కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాలకు అభ్యర్థులు రోజూ ఉదయం 9, మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ డా. కేవీ రమణ తెలిపారు. 25న కెమికల్ కళాశాలలో మొదటి ర్యాంకు నుంచి పదివేలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో 10,001 నుంచి 20వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. 26న కెమికల్ కళాశాలలో 20,001 నుంచి 31 వేలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 31,001 నుంచి 42 వేల వరకు, 27న కెమికల్ కళాశాలలో 42,001 నుంచి 53,500, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 53,501 నుంచి 65 వేలవరకు, 28న కెమికల్ కళాశాలలో 65,001 నుంచి 76,500 వరకు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 76,501 నుంచి 88 వేల వరకు, 29న కెమికల్ కళాశాలలో 88,001 నుంచి 99 వేల వరకు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 99,001 నుంచి 1,10,000 వరకు, 30న కెమికల్ కళాశాలలో 1,10,001 నుంచి 1,20,000 వరకు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 1,20,001 నుంచి 1,30,000 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై 1న కెమికల్ కళాశాలలో 1,30,001 నుంచి 1,40,000, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 1,40,001 నుంచి ఆఖరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
గుర్రంపాలెంలో సంయుక్త సర్వే
కొండ అక్రమ తవ్వకాలపై చర్యలు
రంగం సిద్ధం చేసిన గనుల శాఖ అధికారులు
విశాఖపట్నం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం గుర్రంపాలెంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న కొండలు ఏ శాఖ పరిధిలో ఉన్నాయో తేల్చందుకు గనులు, రెవెన్యూ, ఏపీఐఐఈ సంయుక్తంగా సర్వే నిర్వహించనున్నాయి. ఇక్కడి పారిశ్రామిక లేఅవుట్‌లోని కొండతోపాటు లేఅవుట్‌కు ఆనుకుని రెవెన్యూశాఖకు చెందిన సుమారు 80 ఎకరాల కొండ నుంచి అక్రమ క్వారీయింగ్ జరుగుతోంది. ఓ వ్యక్తి ముఠాను తయారుచేసి తవ్వకాలు జరపడంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. దానిపై గనులశాఖ, విజయనగరం గనులశాఖ ప్రాంతీయ విజిలెన్స్ విభాగం పలుమార్లు తనిఖీలుచేసి ఏపీఐఐసీ నుంచి వివరణ కోరింది. రెవెన్యూశాఖకు కూడా సమాచారం ఇచ్చింది. గనుల శాఖ అధికారులు తనిఖీ చేసిన ప్రతిసారీ కొండ ఏపీఐఐసీదేనని చెబుతున్నారు. కాగా ఆ కొండ రెవెన్యూదేనని గ్రామస్థులు వాదిస్తున్నారు. దీంతో సంయుక్త సర్వేచేపట్టాలని గనులశాఖ అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా సుమారు 80 ఎకరాల కొండను పారిశ్రామికసంస్థలకు కేటాయించే ప్రతిపాదనను విరమించుకోవాలని గుర్రంపాలెం వాసులు కోరుతున్నారు. ఏపీఐఐసీకి ఇప్పటికే చాలా భూములు ఇచ్చారంటున్నారు. పంచాయతీ పాలవర్గం దీనిని వ్యతిరేకించగా, ప్రత్యేకాధికారి పాలనలో తీర్మానం చేశారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు.