Share News

అన్నదాతను ముంచేసిన తుఫాన్‌

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:49 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో పంటలు నీట మునగడంతో చాలా మంది రైతులు నష్టపోయారు. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో వరి, చెరకు, అపరాలు, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులకు వరిపైరు నేలవాలడంతో.. దుబ్బులను తిరిగి నిలబెట్టుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. బోర్లు ఆధారంగా సకాలంలో వరినాట్లు వేసి పొలాల్లో ప్రస్తుతం గింజ గట్టిపడే దశలో వుంది.

అన్నదాతను ముంచేసిన తుఫాన్‌
మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారంలో నీట మునిగిన వరి పొలాలు

భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన పంటలు

ఈదురుగాలులకు పడిపోయిన తమలపాకు, అరటి తోటలు

3,139 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా

క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్‌

నిండిన జలాశయాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు

పలుచోట్ల గట్లకు గండ్లు.. పొలాలను ముంచెత్తిన వరద

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి/న్యూస్‌నెట్‌వర్క్‌)

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో పంటలు నీట మునగడంతో చాలా మంది రైతులు నష్టపోయారు. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో వరి, చెరకు, అపరాలు, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులకు వరిపైరు నేలవాలడంతో.. దుబ్బులను తిరిగి నిలబెట్టుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. బోర్లు ఆధారంగా సకాలంలో వరినాట్లు వేసి పొలాల్లో ప్రస్తుతం గింజ గట్టిపడే దశలో వుంది. ఈదురు గాలులకు పైరు నేలవాలి నీట మునగడంతో ధాన్యం రంగుమారడమే కాకుండా మొలకెత్తే ప్రమాదం వుందని ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తుఫాన్‌ నష్టం అంచనాలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ డ్రోన్లు, జియో ట్యాగింగ్‌ వంటి సాంకేతిక పద్ధతులతో పంటల పరిస్థితిని పరిశీలిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గురువారం వరకు ప్రాథమిక అంచనాల ప్రకారం 3,139 హెక్టార్లలో వరి, 24 హెక్టార్లలో చెరకు, 19 హెక్టార్లలో ఇతర పంట నీటమునిగాయి. ఈ పంటకు సంబంధించి 9,089 మంది రైతులు నష్టపోయినట్టు పేర్కొన్నారు. శుక్రవారం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేయన్నుట్టు అధికారులు వెల్లడించారు. కాగా పాయకరావుపేట మండలంలో తమలపాకు, అరటి తోటలు నేలవాలడంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

కాగా తుఫాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు ఆయా వివరాలను వెంటనే ఈ-క్రాప్‌లో లేదా కర్షక్‌ పోర్టల్‌ నమోదుచేయించుకోవాలని, లేదంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి తెలిపారు. పూర్తి వివరాలు నమోదైతేనే పరిహారం అందే అవకాశం వుందని ఆమె స్పష్టం చేశారు.

తుఫాన్‌ సహాయక చర్యలకు రూ.2.05 కోట్లు... కలెక్టర్‌ విజయకృష్ణన్‌

జిల్లాలో ఆర్నబ్‌ తుఫాన్‌ సహాయక చర్యల కోసం ప్రభుత్వం అత్యవసరంగా రూ.2.05 కోట్లు విడుదల చేసినట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలను ఆమె వెల్లడించారు. పోలీస్‌ శాఖకు రూ.5 లక్షలు, అగ్నిమాపక శాఖకు రూ.5 లక్షలు, వ్యవసాయ శాఖకు రూ.5 లక్షలు, ఉద్యాన శాఖకు రూ.1 లక్ష, పట్టు పరిశ్రమ శాఖకు రూ.50 వేలు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి ఎంపీడీవో రూ.లక్ష చొప్పున రూ.24 లక్షలు అందజేశామని తెలిపారు. తహసీల్దార్లకు రూ.86 లక్షలు కేటాయించినట్టు పేర్కొన్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, అడ్డురోడ్డు జంక్షన్‌ ఆర్డీఓ కార్యాలయాల పరిధిలో సహాయక చర్యలు చేపట్టేందుకు రూ.21 లక్షలు, నీటిపారుదల శాఖ చోడవరం ఈఈకి రూ.5 లక్షలు, నర్సీపట్నం ఈఈకి రూ.10 లక్షల చొప్పున కేటాయించినట్టు తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ ఈఈకి రూ.15 లక్షలు, అనకాపల్లిలోని జిల్లా ఆస్పత్రికి రూ.3 లక్షలు, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి రూ.2 లక్షలు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.50 వేల చొప్పున, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు రూ.3 లక్షలు, అనకాపల్లి కలెక్టరేట్‌కు రూ.3 లక్షలు కేటాయించినట్టు కలెక్టర్‌ తెలిపారు.

మండలాల్లో పరిస్థితి..

బుచ్చెయ్యపేట మండలంలో పెద్దేరు, తాచేరు, బొడ్డేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వడ్డాది వద్ద పెద్దేరు కాజ్‌వేపై గురువారం వరద ఉధృతి మరింత పెరిగింది. పాత వంతెన మీదుగా కూడా వరద ప్రవహిస్తుండడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలనే కాకుండా పాదచారులను కూడా అనుమతించడంలేదు. నర్సీపట్నం వైపు నుంచి మాడుగులు, పాడేరు వైపు వెళ్లే వాహనాలను కింతలివల్లాపురం మీదుగా మళ్లించారు. విజయరామరాజుపేట సమీపంలో బొడ్డేరు గెడ్డపై తాత్కాలికంగా నిర్మించిన కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో చోడవరం- వడ్డాది మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. అనకాపల్లి, చోడవరం వైపు నుంచి మాడుగుల, పాడేరు ప్రాంతాలకు వెళ్లే వారు చుట్టూ తిరిగి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తున్నది. కాగా పెద్దేరు కాజ్‌వేను, వంతెనను గురువారం రాత్రి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఆర్‌అండ్‌ ఈ ఈఈ కేవీ రంగయ్యతో కలసి పరిశీలించారు. కాగా మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారం, పోతనపూడి అగ్రహారం గ్రామాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాలను కలెక్టర్‌ పరిశీలించారు.

కశింకోట మండలం పేరంటాలపాలెం- జోగారావుపేట మధ్య శారదా నది గట్టు బలహీనంగా వుండడం, నదిలో వరద ఉధృతి అధికంగా వుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సుమారు 500 ఇసుక బస్తాలతో పటిష్టం చేశారు.

రాంబిల్లి మండలంలో మేజర్‌, మైనర్‌ శారదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎలమంచిలి- అచ్యుతాపురం మధ్య నారాయణపురం వద్ద వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వాహనాలు రాకపోకలను నిషేధించారు. కొత్తూరు సమీపంలోని ఏడుముళ్ల ఆనకట్ట వద్ద గత ఏడాది కోతకు గురైన శారదా నది కుడిగట్టుకు ప్రస్తుత వరదతో ప్రమాదం పొంచి ఉండడంతో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ఇసుక బస్తాలతో గట్టును పటిష్టం చేసే చర్యలు చేపట్టారు.

తుఫాన్‌ సమయంలో వీచిన ఈదురుగాలలకు పాయకరావుపేట మండలంలోని సత్యవరం, మాసాహెబ్‌పేట, కొత్తూరు, శ్రీరాంపురం, పెదరాంభద్రపురం, పెద్దిపాలెం, తదితర గ్రామాల్లో వంద ఎకరాల్లో తమలపాకు తోటలు, సుమారు 30 ఎకరాల్లో అరటి తోటలు నేలవాలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. కాగా ఆవ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. ఈ మేరకు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

మునగపాక మండలంలో పాటిపల్లి నుంచి తోటాడ మార్గంలో శివాలయం సమీపంలో భారీ మర్రిచెట్టు గురువారం ఉదయం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఇదే సమయంలో విద్యుత్‌ తీగలపై పడడంతో స్తంభాలు విరిగిపోయి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ చెట్టుకు సుమారు వందేళ్ల వయసు వుంటుందని స్థానికులు చెబుతున్నారు.

అరటి తోటలు నేలమట్టం

కృష్ణాదేవిపేట, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షంతోపాటు ఈదురు గాలులు వీచడంతో గొలుగొండ మండలం మండలంలోని పాకలపాడు, జోగంపేట, ఏటిగైరంపేట, తదితర గ్రామాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. వేలాది రూపాయల పెట్టుబడి నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 12:49 AM