గోతుల కష్టాలకు తెర
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:35 AM
భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో చోడవరం శివారు నుంచి వెంకన్నపాలెం జంక్షన్ వరకు రహదారి అభివృద్ధి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా గోతులమయంగా మారిన ఈ రహదారి బాగుపడడంతో వాహనదారులు ఉపశమనం చెందారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద కొద్దిపాటి పనులు మినహా మిగిలిన చోట్ల బీటీ లేయరు పనులు పూర్తయ్యాయి. ఏడేళ్ల నుంచి అత్యంత దారుణంగా ఉన్న ఈ రహదారి, ఎట్టకేలకు బాగుపడడంతో స్థానికులు, ఈ మార్గంలో తరచూ ప్రయాణించే వారు ఇక గోతుల బాధలు తప్పినట్టేనని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీఎన్ రోడ్డులో చోడవరం- వెంకన్నపాలె ం మధ్య అభివృద్ధి పనులు పూర్తి
సాఫీ ప్రయాణంతో వాహనదారులు, ప్రజలు సంతోషం
చోడవ రం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో చోడవరం శివారు నుంచి వెంకన్నపాలెం జంక్షన్ వరకు రహదారి అభివృద్ధి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా గోతులమయంగా మారిన ఈ రహదారి బాగుపడడంతో వాహనదారులు ఉపశమనం చెందారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద కొద్దిపాటి పనులు మినహా మిగిలిన చోట్ల బీటీ లేయరు పనులు పూర్తయ్యాయి. ఏడేళ్ల నుంచి అత్యంత దారుణంగా ఉన్న ఈ రహదారి, ఎట్టకేలకు బాగుపడడంతో స్థానికులు, ఈ మార్గంలో తరచూ ప్రయాణించే వారు ఇక గోతుల బాధలు తప్పినట్టేనని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చోడవరం- వెంకన్నపాలెం మధ్య రహదారి నిర్వహణ కొరవడడంతో పూర్తిగా ఛిద్రమైంది. ప్రత్యేకించి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద, అంభేరుపురం, వెంకన్నపాలెం జంక్షన్ సమీపంలో చెరువులను తలపించే విధంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వైసీపీ హయాంలో రోడ్డు అభివృద్ధి మాట దేవుడెరుగు.. కనీసం గోతులు అయినా కప్పాలని ప్రజలు, వాహనదారులు వేడుకున్నా ఫలితం లేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నెలల తరబడి రోడ్డు బాగు పడలేదు. అధ్వాన రహదారిలో ప్రయాణిస్తూ అనేక మంది ప్రమాదాలబారిన పడ్డారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డును బాగు చేయాలని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చివరకు రోడ్డు అభివృద్ధి చేయకపోయినా ఫర్వాలేదు కనీసం గోతులైనా కప్పాలని ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. మరోవైపు రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ న్యాయవాది కాండ్రేగుల డేవిడ్, తదితరులు కోర్టులో కేసు వేయగా.. ఆర్‌అండ్‌బీ ఈఈ రంగయ్య గత నెలలో కోర్టుకు హాజరై చోడవరం- వెంకన్నపాలెం రోడ్డు పనులను పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం పనుల్లో కదలిక వచ్చింది. తొలుత వెంకన్నపాలెం జంక్షన్ సమీపంలో, అంభేరుపురం వద్ద భారీ గోతులను మెటల్, క్రషర్ బుగ్గితో కప్పి రోలింగ్ చేశారు. మిగిలినచోట్ల గోతులను పూడ్చి తారు లేయరు వేశారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో బాగా పాడైన రోడ్డును బాగు చేయవలసి ఉంది. పట్టణ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కొంతమేర రోడ్డు పని పెండింగ్‌లో ఉంది. ఇవి కూడా పూర్తయితే చోడవరం- వెంకన్నపాలెం మధ్య ప్రయాణం సాఫీగా సాగుతంది. వడ్డాది నుంచి రోలుగుంట వరకు రహదారి బాగుపడితే బీఎన్ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తయినట్టే!