వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం.!
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:07 AM
తూర్పు తీర ప్రాంతంలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనానికి కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూ.180 కోట్లతో అట్మాస్పియరిక్ రీఎర్చ్ టెస్ట్ బెడ్ (ఏఆర్‌టీ) కేంద్రాన్ని మంజూరుచేసింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రియాలజీ విభాగం
రూ.180 కోట్లతో ఏఆర్‌టీ కేంద్రం
ఈ నెలాఖరున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
ఇప్పటికే చేరిన సుమారు రూ.60 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
తూర్పు తీర ప్రాంతంలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనానికి కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూ.180 కోట్లతో అట్మాస్పియరిక్ రీఎర్చ్ టెస్ట్ బెడ్ (ఏఆర్‌టీ) కేంద్రాన్ని మంజూరుచేసింది. కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ చేపట్టిన మిషన్ మౌసంలో భాగంగా మంజూరు చేసిన ఈ కేంద్రాన్ని పుణేకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రియాలజీ ఏయూలోని సముద్ర అధ్యయనం, వాతావరణ విభాగంలో ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే సుమారు రూ.60 కోట్ల విలువైన పరికరాలు ఈ విభాగానికి చేరాయి.
ఈ నెలాఖరు నాటికి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో విభాగంలో పనులు జోరుగా సాగుతున్నాయి. ఏఆర్‌టీ కేంద్రంలో వాతావరణంలో జరిగే మార్పులను అధ్యయనం చేయడానికి రూపొందించిన ఆధునిక పరిశోధన వ్యవస్థగా చెప్పవచ్చు. వాతావరణ పరిస్థితులు, తుఫాన్లు, వర్షపాతం, గాలి వేగం ముందుగా అంచనా వేసేందుకు అనుగుణమైన పరిశోధనలు ఇక్కడ జరగనున్నాయి. ఇందుకోసం అట్మాస్పియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ (ఏఆర్‌టీ)లో అధునాతన పరికరాలు, సెన్సార్లు, కంప్యూటర్ మోడల్స్‌తో కూడిన సమగ్రమైన వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా డేటాను సేకరించి, విశ్లేషించి నిపుణులు అంచనా వేస్తారు.
28 రకాల పరికరాలు..
ఏఆర్‌టీ సెంటర్‌లో రూ.112 కోట్లతో అత్యాధునిక పరికరాలను ఏర్పాటుచేయనున్నారు. తొలి దశలో రూ.60 కోట్ల విలువైన 28 రకాల పరికరాలు వచ్చాయి. వీటిలో సీసీఎన్ కౌంటర్, సియోలో మీటర్, నానో కండెన్సేషన్, స్కానింగ్ వైండ్‌లీడర్, ఇంపాక్ట్ డిస్డోరోమీటర్, ఫాస్డ్ ఆరీరాడార్, సోడార్, మైక్రో రెయిన్ రాడార్ వంటి అత్యాధునిక పరికరాలున్నాయి. ఒక్కో పరికరం విలువ రూ.లక్షల్లో, కొన్ని రూ.కోట్ల విలువజేసివి ఉన్నాయి. వీటి ద్వారా మేఘాలు ఏర్పడడానికి అవసరమైన చిన్న కణాల సంఖ్యను కొలవడం, వర్షం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడం, మేఘాల ఎత్తు, గాలిలోని కార్బన్ కణాలను కొలవడం, కాలుష్యం, వాతావరణంపై అధ్యయనం, కాలుష్యం మూలాలను గుర్తించడం, వర్ష తీవ్రత అంచనా వేయడం, మేఘాల ప్రారంభ దశలను అర్థం చేసుకోవడం, తుపాన్లను ట్రాకింగ్ చేయడం, వర్షపాతం విశ్లేషణ, మాన్‌సూన్ పరిశోధనలకు ఉపయోగపడనున్నాయి.
వారం రోజుల శిక్షణ
కేంద్రం ఏర్పాటుకు తొలి నుంచి సహకరిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మెటీరియాలజీ (పుణే)కు చెందిన నిపుణులు ఏయూలోని సముద్ర అధ్యయనం, వాతావరణ విభాగంలోని ఫ్యాకల్టీ, పరిశోధక విద్యార్థులకు వారంరోజుల శిక్షణ ఇచ్చారు. ఆయా పరికరాల వినియోగం, శుభ్రం చేయడం, పరిశోధనలో జాగ్రత్తలు, విశ్లేషణపై శిక్షణ అందించారు. దేశంలో ఈ తరహా రీసెర్చ్ ల్యాబ్‌లు మహాబలేశ్వరం, భోపాల్‌లో మాత్రమే ఉన్నాయి. మూడో కేంద్రాన్ని ఏయూలో ఏర్పాటు చేయడం గమనార్హం.
సూక్ష్మస్థాయి పరిశోధనలకు దోహదం
- ప్రొఫెసర్ పి.సునీత, బీవోఎస్ చైర్మన్ సముద్ర అధ్యయనం, వాతావరణ విభాగాధిపతి
ఈ కేంద్రం కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ సెక్రటరీ డాక్టర్ ఎం.రవిచంద్రన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ పుణే డైరెక్టర్ డాక్టర్ ఎ.సత్యనారాయణ, మిషన్ మౌసం, ఏఆర్‌టీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ బి.పద్మనాభకుమారి సహకారంతో సాకారమైంది. సీఎం చంద్రబాబు, అధికారులు, ఏయూ ఉన్నతాధికారులతో ఈ నెలాఖరుకు ప్రారంభించాలని భావిస్తున్నాం. వర్సిటీలోనే మరో 0.75 ఎకరాల్లో ఓపెన్ ఫీల్డ్ లేబొరేటరీ ఏర్పాటు కానుంది. దీనివల్ల వాతావరణంలో నిరంతర మార్పులను సూక్ష్మస్థాయిలో పరిశోధించేందుకు వీలుంటుంది. సాధారణ ప్రజలకు కూడా సమాచారం ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణానికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఐదేళ్లలో సుమారు రూ.40 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది.