Share News

గ్రేటర్‌కు స్వచ్ఛ సవాల్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:14 AM

కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే త్వరలో ప్రారంభం కాబోతోంది.

గ్రేటర్‌కు స్వచ్ఛ సవాల్‌

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే ప్రారంభం

వచ్చే నెల రెండో వారంలో నగరానికి ఢిల్లీ నుంచి బృందం

ఈ ఏడాది కంటికి కనిపించే పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం

నగరంలో చూస్తే క్షేత్రస్థాయి పర్యటనలు విస్మరించిన ఉన్నతాధికారులు

సిబ్బందిలో పెరిగిన అలసత్వం

వీధుల్లో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనం

ఇప్పటికైనా మేల్కొనకుంటే గత ఏడాదికంటే ర్యాంకు దిగజారిపోయే ప్రమాదం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇంతవరకూ జరిగిన పోటీలకు భిన్నంగా ఈసారి క్షేత్రస్థాయిలో కంటికి కనిపించే పరిశుభ్రత (విజిబుల్‌ శానిటేషన్‌)కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం జీవీఎంసీ అధికారుల్లో కలవరం రేపుతోంది.

దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో ఏటా పోటీ నిర్వహిస్తోంది. గత ఏడాది 20 వేల జనాభాకు పైబడిన 4,589 పట్టణాలు, నగరాలు పోటీపడ్డాయి. జనాభా సంఖ్య ఆధారంగా 20 వేలు, లక్ష, ఐదు లక్షలు, పది లక్షలు, అంతకుపైబడిన నగరాలను వివిధ కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటిస్తుంది. పది లక్షలకు పైబడిన జనాభా నగరాల కేటగిరీలో జీవీఎంసీకి 2024లో మూడో ర్యాంకు సాధిస్తే, గత ఏడాది తొమ్మిదో ర్యాంకుకు పడిపోయింది. గత ఏడాది జనవరి నుంచి జూలై వరకూ పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో ఆ ప్రభావం పారిశుధ్య నిర్వహణపై పడింది. జిల్లా కలెక్టర్‌ ఇన్‌చార్జిగా ఉండేవారు. ఆయనకు జీవీఎంసీ వ్యవహారాలపై దృష్టిపెట్టేంత సమయం ఉండేది కాదు. జూలైలో కొత్త కమిషనర్‌గా కేతన్‌గార్గ్‌ను నియమించినప్పటికీ, అప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్‌, పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు, యోగాంధ్ర వంటి కార్యక్రమాల నిర్వహణలో తలమునకలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ కోసం రెండు నెలలుగా సమీక్షలు, సమావేశాలతో బిజీ అయిపోయారు. వీటన్నింటి కారణంగా కమిషనర్‌ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కమిషనర్‌, అదనపు కమిషనర్లు పర్యటనలకు వెళ్లపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం పేరుకుపోయింది. కొన్నాళ్ల కిందట మేయర్‌ పీలా శ్రీనివాసరావు బీచ్‌రోడ్డులో రాత్రి పారిశుధ్యం తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆకస్మికంగా తనిఖీ చేయగా, అక్కడ పనిచేస్తున్నట్టు హాజరు నమోదుచేసుకున్న 12 మందిలో ఐదుగురు లేనట్టు గుర్తించారు. నగరవ్యాప్తంగా పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల అదనపు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.నల్లనయ్య వార్డుల్లో రోజువారీ తనిఖీలు ప్రారంభించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంక్‌పై ఆందోళన

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26లో భాగంగా నగరాల్లో పారిశుధ్య నిర్వహణను సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందం వచ్చే నెల రెండో వారంలో నగరానికి రాబోతోంది. విజిబుల్‌ శానిటేషన్‌కు ఈసారి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రకటించడంతో రోడ్లు, డ్రైనేజీలతోపాటు సముద్ర తీరంలో పరిశుభ్రత ఎలా ఉంది?, ఇంటివద్దనే తడి-పొడి చెత్తవిభజన ఎలా జరుగుతోంది?, గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లలో పరిస్థితి ఎలా ఉంది?, చెత్త పునర్వియోగం ఏ స్థాయిలో చేస్తున్నారనే అంశాలను బృందం లోతుగా పరిశీలిస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ మొత్తం 12,500 మార్కులకు నిర్వహిస్తుంటే అందులో విజిబుల్‌ శానిటేషన్‌కే 10,500 మార్కులు కేటాయించారు. ఓడీఎఫ్‌+సర్టిఫికెట్‌కు వెయ్యి, గార్బేజ్‌ ఫ్రీసిటీ సర్టిఫికెట్‌కు వెయ్యి మార్కులు చొప్పున కేటాయించారు.

నగరంలో ఇంటింటికీ చెత్తసేకరణ వాహనాలు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో జనం తమ ఇంట్లో చెత్తను రోడ్లపై పడేస్తున్నారు. గాజువాక, చీమలాపల్లి వంటి చెత్త తరలింపు కేంద్రాల్లో కొండలు మాదిరిగా చెత్త పేరుకుపోతోంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా చెత్తను ఓపెన్‌ టిప్పర్లతో రాత్రిపూట డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర నగరాలతో జీవీఎంసీ పోటీపడడం కష్టం. ఇప్పటికైనా నగరంలో పారిశుధ్య నిర్వహణపై కమిషనర్‌ సీరియస్‌గా దృష్టి పెట్టకపోతే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ఎక్కడి చెత్త అక్కడే..

అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మెతో కొరవడిన పారిశుధ్య నిర్వహణ

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు బ్రేక్

శాశ్వత కార్మికుల ద్వారా డంపర్‌బిన్‌లు సమీపంలోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలింపు

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ కార్మికులు సమ్మెకు దిగడంతో గురువారం నగరంలో పారిశుధ్య నిర్వహణ నిలిచిపోయింది. దీంతో ఎక్కడికక్కడ చెత్తకుప్పలుగా పేరుకుపోయింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా గురువారం సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు కూడా గురువారం విధులను బహిష్కరించి సమ్మెకు మద్దతు తెలిపారు. అవుట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు, క్లాప్‌ వాహనాల డ్రైవర్లు, లోడర్లు విధులకు హాజరుకాకపోవడంతో ఇళ్ల నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది. అధికారులు ముందుజాగ్రత్తగా ప్రధాన కూడళ్లు, చెత్త ఎక్కువగా పోగయ్యే ప్రాంతాల్లో డంపర్‌బిన్‌లను ఏర్పాటుచేశారు. ప్రజలు తమ ఇళ్లలో చెత్తను డంపర్‌బిన్లలో వేయగా, గురువారం ఉదయం, సాయంత్రం వేళ శాశ్వత పారిశుధ్య కార్మికులు ఆ డంపర్‌బిన్‌లను సమీపంలోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించారు. కొన్నిచోట్ల మాత్రం చెత్తకుప్పలు అలాగే ఉన్నాయి. శుక్రవారం నుంచి పారిశుధ్య కార్మికులు యథావిధిగా తమ విధులకు హాజరవుతారు కాబట్టి పారిశుధ్య నిర్వహణ గాడిలో పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 01:14 AM