నామినేషన్ల జాతర
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:50 AM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరిరోజు కాగా, గురువారం ఏకాదశి మంచి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు 75 శాతం మంది నామిషన్లు సమర్పించారు. తమ గ్రామాల నుంచి సొంత పార్టీల శ్రేణులు, మద్దతుదారులతో వివిధ రకాల వాహనాలతో ఊరేగింపుగా ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకున్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు రెండో రోజు భారీగా దాఖలు
గ్రామాల నుంచి మండల కేంద్రాలకు ఊరేగింపులు
అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో నామినేషన్ల స్వీకరణలో జాప్యం
పలుచోట్ల సమయం మించిన తరువాత కూడా స్వీకరణ
24 జడ్పీటీసీలకు 94 నామినేషన్లు
427 ఎంపీటీసీలకు 1,107 నామినేషన్లు
అనకాపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరిరోజు కాగా, గురువారం ఏకాదశి మంచి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు 75 శాతం మంది నామిషన్లు సమర్పించారు. తమ గ్రామాల నుంచి సొంత పార్టీల శ్రేణులు, మద్దతుదారులతో వివిధ రకాల వాహనాలతో ఊరేగింపుగా ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అభ్యర్థుల వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఆయా నామినేషన్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే ఆపేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా, పలు మండలాల్లో చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. దీంతో ఐదు గంటల లోపు ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లోకి వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించి తలుపులు వేసేశారు. తరువాత ఎవరినీ లోపలికి రానివ్వలేదు. పలుచోట్ల రాత్రి ఏడు, ఎనిమిది గంటల సమయంలో కూడా నామినేషన్లు స్వీకరించారు.
జడ్పీటీసీ స్థానాలకు రెండో రోజు 94, ఎంపీటీసీ స్థానాలకు 1,107 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద రెండు రోజుల్లో జడ్పీటీసీ స్థానాలకు టీడీపీ 47, వైసీపీ 29, జనసేన 17, బీజేపీ 9, ఇతరులు 4 నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ 495, జనసేన 182, బీజేపీ 33, వైసీపీ 622, సీపీఎం 7, కాంగ్రెస్ 4, ఇతరులు 51 నామినేషన్లు దాఖలయ్యాయని జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు.
ఎంపీటీసీలకు రెండో రోజు 1,107 నామినేషన్లు
జిల్లాలో 427 ఎంపీటీసీ స్థానాలు వుండగా రెండో రోజైన గురువారం 1,107 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా పరిశీలిస్తే.. అనకాపల్లి 33, కశింకోట 41, సబ్బవరం 48, పరవాడ 32, మాడుగుల 45, చీడికాడ 43, దేవరాపల్లి 51, కె.కోటపాడు 55, నర్సీపట్నం 23, నాతవరం 54, మాకవరపాలెం 49, గొలుగొండ 42, పాయకరావుపేట 53, నక్కపల్లి 65, ఎస్.రాయవరం 39, కోటవురట్ల 37, ఎలమంచిలి 17, అచ్యుతాపురం 68, మునగపాక 43, రాంబిల్లి 37, రావికమతం 44, బుచ్చెయ్యపేట 68, చోడవరం 67, రోలుగుంటలో 53 నామినేషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ గురువారం కోటవురట్ల మండలంలో ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటవురట్ల జంక్షన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు మూడు పార్టీల శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు.
పాయకరావుపేట మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానిక రావడంతో పెద్ద ఎత్తున అనుచరులతో రావడంతో మండల పరిషత్ కార్యాలయంలో సందడి నెలకొంది. గ్రామాల నుంచి వివిధ రకాల వాహనాల్లో ఆయా పార్టీల మద్దతుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చి రాజకీయ బలప్రదర్శనకు దిగారు.
చోడవరం మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎక్కువ మంది అభ్యర్థులు రావడంతో రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.. దీంతో మండల పరిషత్ కార్యాలయం అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. ఎంపీపీ రేసులో ఉన్న గూనూరు మల్లునాయుడు ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
అనకాపల్లి మండలంలోని ఎంపీటీసీలకు పోటీ చేసే అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు గ్రామాల నుంచి అనకాపల్లికి ఊరేగింపుగా వచ్చారు. దీంతో మండల పరిషత్ కార్యాలయం పరిసరాలు సందడిగా మారాయి.