గంజాయి రహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:27 PM
గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా యంత్రాంగం చర్యలు చేపడుతున్నదని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఏజెన్సీలో గంజాయి సాగును శాశ్వతంగా నిర్మూలించాం
కలెక్టర్ టి.నిషాంతి
పాడేరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా యంత్రాంగం చర్యలు చేపడుతున్నదని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గంజాయి ప్రభావం లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వాస్తవానికి గతంలో 357 గ్రామాల్లో గంజాయి సాగు ఉండేదని, డ్రోన్ల ద్వారా దానిని గుర్తించి సంపూర్ణంగా నిర్మూలించారన్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు ఊసేలేదని, అయినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా రవాణా జరుగుతున్న నేపథ్యంలో రవాణాపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. నిత్యం వాహన తనిఖీలు, అనుమానితులపై ప్రత్యేక నిఘాతో గంజాయి అక్రమ రవాణాను శాశ్వతంగా నిర్మూలించాలన్నారు. పాత నేరస్థుల్లో మార్పు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని, గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అందుకు అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. గిరిజనులను గంజాయి సాగు నుంచి విముక్తి చేసి, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటలను ప్రోత్సహించాలన్నారు. విద్యాలయాల్లోనూ గంజాయి వల్ల కలిగే నష్టాలపై ప్రణాళికా బద్ధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్ర మాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువతను భాగస్వామ్యం కల్పించాలన్నారు. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి వ్యసన విమోచన కేంద్రాల్లో చేర్పించి, అవసరమైన సేవలు అందించాలని చెప్పారు. గంజాయిని వీడిన గిరిజన రైతులకు స్వయం ఉపాధి కల్పన పథకాలు, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, వాళ్లు సమాజంలో గౌరవప్రదంగా జీవనం సాగించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కృష్ణమూర్తి నాయక్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే పరిమిళ, ఎల్‌డీఎం మాతునాయుడు, డీఎల్‌పీవో సీఎస్.కుమార్, ఈగల్, అటవీ, వెలుగు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల హక్కుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాజ్యాంగ బద్ధంగా గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ టి.నిషాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే గిరిజనుల ప్రయోజనాలకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతున్నదన్నారు. అలాగే జిల్లాలో 1/70 భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నదని, గిరిజనుల భూములు గిరిజనేతరులకు బదిలీ కాకుండా, గిరిజనులు హక్కులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీవో:3ని సుప్రీం కోర్డు రద్దు చేసిందని, అయినప్పటికీ గిరిజనుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇటీవల కాలంలో పలువురు జీవో:3 రద్దు, 1/70 చట్టం అమలుపై అసత్య ప్రచారాలు చేస్తూ గిరిజనుల్లో ఆందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజన ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణకు ప్రభుత్వం సంపూర్ణమైన నిబద్ధతతో ఉందని ఆమె భరోసా ఇచ్చారు.