Share News

జిల్లాకు ఉజ్వల భవిత

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:02 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సీఎం రమేశ్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు కొణతాల, బండారు, పంచకర్ల, సుందరపు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు ఉన్నారు

జిల్లాకు ఉజ్వల భవిత

అనకాపల్లి- రాజమహేంద్రవరం ఆరు లైన్ల రోడ్డుకు త్వరలో టెండర్లు

- లంకెలపాలెం వద్ద ఫ్లైఓవర్‌కు ప్రతిపాదనలు

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో శరవేగంగా అభివృద్ధి

- ఎంపీ సీఎం రమేశ్‌

అనకాపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు. అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ పూర్తయిందని, ప్రస్తుతం కేబినెట్‌ ఆమోద ముద్ర దశలో ఉందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు ఆయన చెప్పారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, అభివృద్ధి పనులతో జిల్లా ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం వరకు వేయనున్న ఆరు లైన్ల రోడ్డుకు సంబంధించి ఆరు రైల్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ఆరు రైల్వే అండర్‌ బ్రిడ్జీల పురోగతిని సమీక్షించామని తెలిపారు. త్వరలోనే విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ వరకు మెట్రో సౌకర్యం వస్తుందన్నారు. అక్కడ నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు లైన్ల రహదారిపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగినందున, దానిని ఆరు లైన్‌లుగా మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. లంకెలపాలెం వంటి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 70 నుంచి 80 కొత్త టెలికమ్‌ టవర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

కరువు ప్రాంతంగా ప్రకటించాలి

జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందని ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు ప్రభుత్వాన్ని కోరామని, జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటిస్తే కేంద్రం, రాష్ట్రం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధుల ద్వారా అదనపు సాయం అందుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 01:02 AM