Share News

వరికి ఊపిరి

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:31 AM

తీవ్రమైన కరువు ఛాయలతో వ్యవసాయం కష్టంగా మారిన పరిస్థితుల్లో తీవ్ర వాయుగుండం కొంత మేర రైతాంగానికి ఊరటనిచ్చింది. రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు లేక ఎండిపోయిన పరిస్థితుల్లో కురిసిన భారీ వర్షాలకు ఇటు రిజర్వాయర్లు, అటు కాలువలు, చెరువుల్లోకి కూడా నీరు చేరడంతో వ్యవసాయానికి కాస్త ఊపొచ్చింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు లేకపోవడంతో చాలామంది రైతులు నారు ఎదిగినా, దమ్ములకు నీరు లేక వరినాట్లు వేయలేకపోయారు.

వరికి ఊపిరి
రావికమతం మండలంలో వరి నాట్లు వేస్తున్న దృశ్యం

- భారీ వర్షాలతో అన్నదాతకు ఊరట

- వ్యవసాయ పనుల్లో బిజీ

- అంతటా దమ్ములు, వరినాట్ల సందడి

చోడవరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన కరువు ఛాయలతో వ్యవసాయం కష్టంగా మారిన పరిస్థితుల్లో తీవ్ర వాయుగుండం కొంత మేర రైతాంగానికి ఊరటనిచ్చింది. రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు లేక ఎండిపోయిన పరిస్థితుల్లో కురిసిన భారీ వర్షాలకు ఇటు రిజర్వాయర్లు, అటు కాలువలు, చెరువుల్లోకి కూడా నీరు చేరడంతో వ్యవసాయానికి కాస్త ఊపొచ్చింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు లేకపోవడంతో చాలామంది రైతులు నారు ఎదిగినా, దమ్ములకు నీరు లేక వరినాట్లు వేయలేకపోయారు. ఇదే సమయంలో ఎండలు మరింతగా మండిపోవడంతో నారు కూడా ఎండిపోయింది. అక్కడక్కడ బోర్లు, బావుల కింద వరినారు దాచుకున్న రైతులు మాత్రం ప్రస్తుతం కురిసిన వర్షాలకు దమ్ములు పడుతూ, వరినాట్లు వేసే పనిలో పడ్డారు. పొలాల్లో నీరు బాగానే చేరడంతో అందుబాటులో వరి నారు ఉన్న రైతులంతా నాట్లు, దమ్ములలో మునిగిపోగా, మిగిలిన రైతులు వరినారు కోసం పరుగులు తీస్తున్నారు. కస్పా నీటిపై ఆధారపడిన మండలంలోని గౌరీపట్నం ప్రాంతంలోని రైతులు భూముల్లోకి ఈ ఏడాది సాగునీరు అందలేదు. కస్పా కాలువలో నీరు లేకపోవడంతో ఎగువ ప్రాంతంలో కొందరు మాత్రమే నాట్లు వేయగా, దిగువ ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందలేదు. దీనితో భూములు ఖాళీగా ఉంచేశారు. ప్రస్తుతం పెద్దేరులో నీరు పెరిగి కస్పా కాలువ నుంచి నీరు బాగానే రావడంతో దిగువన ఉన్న గౌరీపట్నం గ్రామం పరిధిలోని పంటపొలాలు నీటితో నిండిపోయాయి. ఇక మండలంలోని జన్నవరం, చాకిపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడా నాట్లు వేస్తున్నారు. మిగిలిన రైతులకు నారు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలవైపు అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది వరిసాగు అంతంత మాత్రమే అన్న పరిస్థితుల్లో, వాయుగుండం ఆదుకోవడంతో వరి పంటపై ఆశలు పెరిగాయని చెప్పాలి.

Updated Date - Sep 26 , 2026 | 12:31 AM