అనధికార కబేళాలకు బ్రేక్
ABN , Publish Date - Aug 06 , 2026 | 01:26 AM
గోవుల మాఫియా ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. చట్టరీత్యా నేరమైనప్పటికీ నగరంలో కొందరు గోవులను వధించి మాంసం విక్రయించడం, ఎగుమతి చేయడం చేస్తున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో పోలీస్, జీవీఎంసీ అధికారులు ఆరిలోవ ప్రాంతంలోని అనధికారిక కబేళాల (గోవధశాలలు)ను పది రోజుల కిందట మూసివేయించారు. వాటిని తిరిగి తెరిచేందుకు వ్యాపారులు రెండు ప్రభుత్వ శాఖల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకు తమకు ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ మామూళ్లను పెంచాలని రెండు శాఖల సిబ్బంది డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించడంతో
మూసివేయించిన పోలీస్, జీవీఎంసీ అధికారులు
తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలంటూ వ్యాపారుల బేరసారాలు
మామూళ్లు పెంచితే సహకరిస్తామంటున్న రెండు ప్రభుత్వ శాఖల సిబ్బంది
ఇకపై పశువుకు రూ.150 చొప్పున ఇవ్వాలని ఒక శాఖ డిమాండ్
నెలకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలంటున్న మరో శాఖ సిబ్బంది
ఒక అవగాహనకు వస్తే తిరిగి అనుమతించే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గోవుల మాఫియా ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. చట్టరీత్యా నేరమైనప్పటికీ నగరంలో కొందరు గోవులను వధించి మాంసం విక్రయించడం, ఎగుమతి చేయడం చేస్తున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో పోలీస్, జీవీఎంసీ అధికారులు ఆరిలోవ ప్రాంతంలోని అనధికారిక కబేళాల (గోవధశాలలు)ను పది రోజుల కిందట మూసివేయించారు. వాటిని తిరిగి తెరిచేందుకు వ్యాపారులు రెండు ప్రభుత్వ శాఖల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకు తమకు ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ మామూళ్లను పెంచాలని రెండు శాఖల సిబ్బంది డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
నగరంలోని ఆరిలోవ, వన్‌టౌన్, రైల్వేన్యూకాలనీ, గాజువాక వంటి ప్రాంతాల్లో కొందరు పశు మాంసం విక్రయించే దుకాణాల కోసం జీవీఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. వాటిని అడ్డం పెట్టుకుని జనావాసాల మధ్యనే అనధికార కబేళాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. అక్కడ పశువులను వధించేసి మాంసాన్ని దుకాణంలో విక్రయిస్తున్నారు. అయితే గోవులను వధించడం చట్టరీత్యానేరం. కేవలం ఎద్దులు, దున్నలను మాత్రమే పశు వైద్యుడి సమక్షంలో అన్నిరకాల పరీక్షలు, ప్రక్రియలను పూర్తిచేసి అనుమతి పొందిన కబేళాలో మాత్రమే వధించాల్సి ఉంటుంది. నగరంలో మారికవలస వద్ద మాత్రమే అధికారిక కబేళా ఉంది. అక్కడ వధించిన పశువుల మాంసాన్ని మాత్రమే నగరంలో ట్రేడ్ లైసెన్స్ కలిగిన దుకాణాలకు తీసుకువెళ్లి విక్రయించాల్సి ఉంటుంది. కానీ, నగరంలో ఎక్కడికక్కడ అనధికార కబేళాలను ఏర్పాటుచేసి కేవలం ఆవులను మాత్రమే రహస్యంగా వాహనాల్లో తీసుకువచ్చి వధించేస్తున్నారు. గోవులను అక్రమ రవాణా చేసే వ్యక్తులు, వారి వెనుకున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అయితే నగరంలోని కబేళాల నిర్వాహకులు, గోమాంసం విక్రయించే వ్యాపారులు కలిసి పోలీసులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బందికి ముడుపులు చెల్లించి వారి చేతులను కట్టేస్తున్నారు. ఎవరైనా అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే, వాహనాలపై కేసులు నమోదుచేసి పట్టుబడిన గోవులను తమకు అస్మదీయులైన గోశాల నిర్వాహకులకు ఇచ్చి, అక్కడి నుంచి తిరిగి కబేళాలకు తీసుకువెళ్లేలా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోవుల అక్రమ రవాణాపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఆరిలోవ పోలీసులు ఇటీవల తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబేళాలను సీజ్ చేశారు. అక్కడ గోవధ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార కబేళాలు లేకపోతే గోమాంసం ఉండదు కాబట్టి, పశుమాంసం విక్రయ కేంద్రాలు కూడా మూతపడ్డాయి.
ముడుపులపై రెండు శాఖలతో వ్యాపారులకు పీటముడి
అనధికార కబేళాలలను పోలీసులు పూర్తిగా మూసివేయించడంతో వ్యాపారులు తిరిగి వాటిని ఎలాగైనా తెరుచుకునేందుకు అనుమతివ్వాలంటూ సంబంధిత అధికారాలు కలిగివున్న రెండు ప్రభుత్వ శాఖల అధికారులను కలుస్తున్నారు. దీంతో ఆయా శాఖల సిబ్బంది కొందరు తమకు ఇస్తున్న మామూళ్లను పెంచాలని, అలాగైతే తమ ఉన్నతాధికారులతో మాట్లాడి అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా చేస్తామని ప్రతిపాదించినట్టు తెలిసింది. నిరంతర నిఘా పెట్టే ఒక ప్రభుత్వ శాఖకు ప్రస్తుతం ఒక్కో కబేళా నుంచి వారానికి రూ.వెయ్యి చొప్పున ఆరిలోవలోని 12 కబేళాల నుంచి ప్రతివారం రూ.12 వేలు అందుతున్నట్టు తెలిసింది. ఇకపై వారానికి ఒక్కో దుకాణం చొప్పున ఇంత అని కాకుండా ఒక్కో పశువుకు రూ.150 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై వ్యాపారులు అంత మొత్తం ఇచ్చుకోలేమని, ఒక్కో పశువుకు రూ.50 చొప్పున ఇస్తామని ముందుకొచ్చినట్టు ఆరిలోవ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని, కుదిరితే ఆ శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేస్తుందని అంటున్నారు. గోవధశాలలు, దుకాణాల నిర్వహణపై పర్యవేక్షణ అధికారం కలిగిన మరో ప్రభుత్వ శాఖలోని సంబంధిత విభాగం అధికారులకు ప్రస్తుతం ఒక్కో కబేళా నుంచి నెలకు రూ.ఐదు వేలు చొప్పున 12 కబేళాల నుంచి నెలకు రూ.60 వేలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నట్టు సమాచారం. చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కబేళాలు, గోవధకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా గోవులను సంరక్షించాల్సిన అధికారులు లంచాల కోసం గోవధశాలలను వనరుగా మార్చుకోవడం ఏమిటని నగరవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.