కాలుష్య తనిఖీలకు బ్రేక్!?
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:37 AM
నగరంలో గాలి నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణమైన సంస్థలపై గత నెల దాడులు చేసి భారీగా జరిమానా విధించిన కాలుష్య నియంత్రణ మండలి, రెండో దశ తనిఖీలకు వెనుకాడుతోంది.
నగరంలో గాలి నాణ్యతా సూచీ ఆందోళనకర స్థాయిలో నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్
జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
పరిశ్రమల్లో సోదాలు
కాలుష్యానికి కారణమవుతున్న సంస్థలకు జరిమానా విధింపు, నోటీసులు
రెండో దశ తనిఖీలకు మోకాలడ్డు
పీసీబీపై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గాలి నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణమైన సంస్థలపై గత నెల దాడులు చేసి భారీగా జరిమానా విధించిన కాలుష్య నియంత్రణ మండలి, రెండో దశ తనిఖీలకు వెనుకాడుతోంది. జరిమానా, ఇతరత్రా నోటీసులు అందుకున్న పలు పరిశ్రమలు, సంస్థలు ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి తీసుకురావడమే అందుకు కారణమనే ప్రచారం సాగుతోంది.
విశాఖపట్నంలో గత నెలలో గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) ఆందోళనకరంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో కంటే ఎక్కువ ఏక్యూఐ నమోదు కావడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు, సంస్థలు, వాహనాల తనిఖీ కోసం జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశారు. ప్రతివారం కాలుష్య తీవ్రతపై సమీక్షించాలని కలెక్టర్ నిర్ణయించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి పరిశ్రమలు, పలు సంస్థలను తనిఖీ చేశారు. రవాణా, తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, రవాణా శాఖలు, జీవీఎంసీ అధికారులు వేర్వేరుగా దాడులు చేశారు. గాలి నాణ్యత పడిపోవడానికి కారణమైన విశాఖ పోర్టు, అక్కడ ఉండే పలు షిప్పింగ్ ఏజెన్సీలు, పరిసరాల్లోని పలు సంస్థలు, హెచ్‌పీసీఎల్, కోరమాండల్ ఇంటర్నేషనల్, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందూజా పవర్ కార్పొరేషన్‌కు రూ.పది కోట్ల వరకూ జరిమానా విధించారు. కాలుష్యం తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఆయా పరిశ్రమలు/సంస్థలకు సమయం ఇచ్చారు. సమస్యను సరిదిద్దుకోకుంటే చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. దీనికి ఆయా కంపెనీలు వివరణ ఇచ్చాయి. అయితే తొలిదశ తనిఖీల తరువాత ఆయా పరిశ్రమలు, షిప్పింగ్ కంపెనీల ప్రాంగణాల్లో పరిస్థితులు అంతగా మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో రెండో దశ తనిఖీలు జరిగితే భారీ జరిమానా విధించడంతోపాటు షోకాజ్ నోటీస్‌లు ఇస్తారని భావించిన సంస్థలు/పరిశ్రమలు ఉన్నత స్థాయి నుంచి పీసీబీ బోర్డులో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చాయని తెలిసింది. ఆ కారణంతోనే జనవరి నెలలో చేపట్టాల్సిన తనిఖీల విషయంలో పీసీబీ అధికారులు వెనుకంజ వేశారనే వాదన వినిపిస్తోంది.
డిసెంబరు నెలతో పోల్చితే ప్రస్తుతం నగరంలో గాలి నాణ్యతా సూచీలు కొంతమేర మెరుగుపడినా పీఎం-10, పీఎం-2.5...ఇంకా ఆందోళనకర స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు నగరంలోని తొమ్మిది ఆఫ్‌లైన్ యాంబియంట్ ఎయిర్‌క్వాలిటీ, ఒక ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ యంత్రాల వద్ద సగటున ఏక్యూఐ 125గా నమోదైంది. పోలీస్ బ్యారెక్స్ వద్ద 237, జీవీఎంసీ కార్యాలయంపై ఆన్‌లైన్ మిషన్‌లో 197, జ్ఞానాపురంలో 183గా నమోదు అయింది. పోర్టు, పరిసరాల్లో కాలుష్యం తీవ్రత ఎక్కువగానే ఉందని నిర్ధారణ అయ్యింది. దీనిని పరిగణనలోకి తీసుకుని మరోసారి పోర్టు, పరిసరాల్లోని సంస్థలు, పరిశ్రమలు, షిప్పింగ్ కంపెనీలు, హిందూజా పవర్ కార్పొరేషన్‌లో తనిఖీలు చేయాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా తొలిదశలో నిర్వహించిన తనిఖీల మేరకు విధించిన జరిమానాల వివరాలు, ఆయా కంపెనీలు ఇచ్చిన వివరణలతో కూడిన నివేదికను కాలుష్య నియంత్రణ మండలికి విశాఖలోని అధికారులు నివేదించారు. దీనిపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటే సుమారు రూ.10 కోట్ల వరకూ జరిమానా వసూలు, కాలుష్య తీవ్రత తగ్గింపునకు తీసుకునే చర్యల అమలు జరిగే అవకాశం ఉంది.
పోర్టుకు పీసీబీ చైర్మన్
కాలుష్య నియంత్రణకు ప్రస్తుతం చేపడుతున్న చర్యలు సరిపోవని అసంతృప్తి
మరింత మెరుగైన విధానాలు అవలంబించాలని సూచన
‘క్లీన్ పోరు’్టగా మారుస్తామని అధికారుల హామీ
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య శనివారం అధికారులతో కలిసి విశాఖపట్నం పోర్టులో తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జిల్లాలో పరిశ్రమల కాలుష్యం తగ్గేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో కృష్ణయ్య, జిల్లా అధికారులతో కలిసి విశాఖపట్నం పోర్టుకు వెళ్లారు. అక్కడ లాంచీ ఎక్కి పోర్టు ఆపరేషన్ ఏరియా మొత్తం పరిశీలించారు. కాలుష్య నియంత్రణకు ప్రస్తుతం చేపడుతున్న చర్యలు సరిపోవని, ఇంకా మెరుగైన విధానాలు అవలంబించాలని చెప్పారు. నౌకల నుంచి బొగ్గు వంటి సరకుల అన్‌లోడింగ్ ఎత్తైన క్రేన్ల ద్వారా చేస్తున్నారని, వాటి ఎత్తు కొంత తగ్గిస్తే గాలివాటానికి ఎగిరే ధూళి ప్రభావం కొంత తగ్గుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రపంచంలో ఇంకా మంచి విధానాలు ఏమి ఉన్నాయో అధ్యయనం చేసి వాటిని ఇక్కడ అఽమలు చేయాలని కృష్ణయ్య సూచించారు. పరిశ్రమల్లో ‘గ్రీన్‌వాల్’ పెద్దఎత్తున నిర్మించాలని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో పోర్టులో ఇంకా గ్రీనరీ పెంచాలన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలపై బోర్డు రూమ్‌లో అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత ఏడాది కంటే ఈ ఏడాది బొగ్గు దిగుమతులు 15 శాతం తగ్గించామని వివరించారు. అయినప్పటికీ పోర్టు వల్ల కాలుష్యం ఎక్కువగా ఉందని ప్రజలు భావిస్తున్న తరుణంలో ‘క్లీన్ పోర్టు’గా మార్చేందుకు తగిన చర్యలు చేపడతామని పోర్టు అధికారులు హామీ ఇచ్చారు. ఈ తనిఖీల్లో పీసీబీ ఈఈ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.