ఉద్యాన పంటలకు ఊతం
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:57 AM
కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఉద్యాన పంటలు, తోటల సాగులో రైతులను మరింత ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాలు 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు జిల్లా అధికారులు సమాయాత్తమవుతున్నారు.
జిల్లాకు రూ.13.35 కోట్లు కేటాయింపు
పండ్లు, పూలతోటలతోపాటు పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం
రాయితీపై మొక్కలు, ఎరువులు, యంత్రాలు, డ్రిప్ పరికరాలు
నాణ్యమైన అధిక పంట దిగుబడుల సాధనే లక్ష్యం
ఆర్‌ఎస్‌కేలు, వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఉద్యాన పంటలు, తోటల సాగులో రైతులను మరింత ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాలు 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు జిల్లా అధికారులు సమాయాత్తమవుతున్నారు. పంట దిగుబడులను పెంచడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తులను సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన పథకాలతో ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజశేఖరం ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లాలో రూ.13.35 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఉద్యాన పంటల సాగు చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకాన్ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఇటీవల పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా రైతులతో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల తోటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపక చేపట్టి, ఆయా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నది. ఇక రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) కింద జిల్లాలో కొత్తగా జీడిమామిడి, మామిడి, జామ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్స్, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా కోకో, పూలు వంటి పంటలు ఈ ఏడాది 625 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 11,600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీఎంఐడీసీ ద్వారా డ్రిప్ పరికరాలను రాయితీపై అందించనున్నారు. ఈ ఏడాది 30 తేనెటీగల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పుట్టగొడుగుల పెంపకం చేపట్టే రైతులను ఎంపిక చేసి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, యూనిట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రయోగాత్మకంగా పరవాడ మండలంలో పుట్టగొడుగుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
రైతులకు రాయితీ...
ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు గరిష్ఠంగా ఐదు ఎకరాల వరకు రాయితీలు అందిస్తారు. తీగజాతి కూరగాయ పంటలను సాగు చేసే రైతులకు సిమెంట్ కాంక్రీట్ స్తంభాలు, జీఐ వైర్లతో పందిళ్లు వేసుకొనేందుకు గరిష్ఠంగా 2.5 ఎకరాలకు అత్యధికంగా రూ.2.5 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. అన్ని రకాల ఉద్యాన పంటల మొక్కల ధర, సేంద్రియ/ రసాయన ఎరువులకు అయ్యే ఖర్చులో 40 శాతం వరకు ప్రభుత్వాలు భరిస్తాయి. ఉద్యాన యాంత్రీకరణలో భాగంగా చిన్న, సన్నకారు, మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీపై వివిధ రకాల యంత్ర పరికరాలను అందిస్తారు. 11 హెచ్‌పీ కన్నా ఎక్కువ వున్న పవర్ టిల్లర్‌కు రూ.లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు, మినీ ట్రాక్టర్ (20 హెచ్‌పీ) రూ.1.96 లక్షల నుంచి రూ.2.45 లక్షల వరకు ఫోర్‌స్ట్రోక్ తైవాన్ స్ర్పేయర్‌కు రూ.10 వేల వరకు రాయితీ వర్తిస్తుంది. షేడ్‌నెట్, పాలీహౌస్ నిర్మాణానికి 50 శాతం వరకు రాయితీ అందుతుంది. ఉద్యాన పంటలను సాగు చేయాలనుకొనే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎ.రాజశేఖరం తెలిపారు. ఐదు ఎకరాల్లోపు భూములు వున్న రైతులు మాత్రమే అర్హులని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు లేదన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జెరాక్స్ కాపీలు, ఒక పాస్‌పోర్టు ఫొటోతో సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా మండల ఉద్యాన, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులకు ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాయితీ మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించారు.