వైద్యానికి ఊతం
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:20 AM
జిల్లాలోని అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులను భర్తీ చేశారు. తాజాగా మూడు ఆస్పత్రుల్లో మందులు, ల్యాబ్, సర్జికల్ సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.1.31 కోట్ల త్రైమాసిక నిధులను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విడుదల చేసింది.
- అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆస్పత్రులకు భారీగా నిధులు
- మందులు, ల్యాబ్, సర్జికల్ సామగ్రికి రూ.1.31 కోట్లు విడుదల
చింతపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులను భర్తీ చేశారు. తాజాగా మూడు ఆస్పత్రుల్లో మందులు, ల్యాబ్, సర్జికల్ సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.1.31 కోట్ల త్రైమాసిక నిధులను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో 243 ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల పరిధిలో 14,180 పడకల ద్వారా రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. సర్కారు ఆస్పత్రులపై రోగులకు నమ్మకం పెంచుతూ మెరుగైన వైద్య సేవలందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. వైద్యుల ఖాళీలు భర్తీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు అవసరమైన సామగ్రి, పూర్తి స్థాయి మందులు కల్పించేందుకు 2026-27 వార్షిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికానికి భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 243 ఆస్పత్రులకు రూ.92.14 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన మందులు, ల్యాబ్ పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఉపయోగించే సామగ్రిని కొనుగోలు చేయనున్నారు.
జిల్లాకు రూ.1.31 కోట్లు విడుదల
నిధుల కేటాయింపులో జిల్లాకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో 90 శాతం మంది రోగులు ప్రభుత్వ ఆస్పత్రులను మాత్రమే ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు అరకులోయ 150 పడకలు, చింతపల్లి వంద పడకలు, ముంచంగిపుట్టు 30 పడకల ఆస్పత్రులకు రూ.1.31 కోట్ల నిధులను మంజూరు చేశారు. అరకులోయ 150 పడకల ఆస్పత్రికి మందుల కోసం రూ.43,44,700, ల్యాబ్ సామగ్రికి రూ.5,12,900, శస్త్ర చికిత్సల పరికరాలకు రూ.14,00,800, అలాగే చింతపల్లి వంద పడకల ఆస్పత్రిలో మందులకు రూ.28,11,000, ల్యాబ్ సామగ్రికి రూ.3,31,800, శస్త్రచికిత్స పరికరాలకు రూ.9,06,300, ముంచంగిపుట్టు 30 పడకల ఆస్పత్రికి సంబంధించి మందులకు రూ.19,05,700, ల్యాబ్ సామగ్రికి రూ.2,58,300, శస్త్ర చికిత్సల పరికరాలకు రూ.7,05,600 నిధులు మంజూరు చేశారు.
రోగులకు మెరుగైన వైద్యం
గిరిజన ప్రాంతంలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. 2024లో అధికారంలోకి రాగానే గిరిజన ప్రాంతంలోని ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక వైద్యనిపుణులు, సిబ్బంది ఖాళీల వివరాలను సేకరించింది. రెండేళ్లలో అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆస్పత్రుల్లో వైద్యనిపుణుల ఖాళీలను 70 శాతం భర్తీ చేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం వల్ల చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ శస్త్రచికిత్సలు, సిజేరియన్లు అరకులోయ, చింతపల్లి ఏరియా ఆస్పత్రులతో పాటు పాడేరు జిల్లా ఆస్పత్రిలోనూ జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే గిరిజన ప్రాంతం నుంచి కేజీహెచ్‌కి తరలించే రోగుల సంఖ్య కొంత మేర తగ్గింది.
అందుబాటులో మందులు, పరీక్షలు
గిరిజన ప్రాంత ఆస్పత్రుల్లో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మందులు, ల్యాబ్ పరీక్షలు మెరుగ్గా వున్నాయి. ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గతంలో మందులు కొరత, రక్త పరీక్షల నిర్వహణకు సామగ్రి సమస్య ఉండేది. కూటమి ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో ఉన్న ఆస్పత్రులకు అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆస్పత్రులకు నాలుగు త్రైమాసికాల్లో పంపిణీ చేసే మందులతో పాటు అవసరం మేరకు కొనుగోలు చేసేందుకు ఆస్పత్రులకు అదనపు నిధులు మంజూరు చేస్తున్నది. ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో దాదాపు 18-25 రకాల పరీక్షలు జరుగుతున్నాయి. గర్భిణులకు అలా్ట్రసౌండ్ స్కానింగ్‌లు చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి అవార్డులు సొంతం
ముంచంగిపుట్టు, చింతపల్లి ఏరియా ఆస్పత్రుల వైద్యులు గత నెలలో అత్యుత్తమ సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముంచంగిపుట్టు 30 పడకల ఆస్పత్రి తొలి త్రైమాసికంలో రాష్ట్రంలోనే అత్యధిక సహజ ప్రసవాలు చేశారు. అలాగే చింతపల్లి ఏరియా ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ ద్వారా తొలి త్రైమాసికంలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలందించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ వైద్యులు, సూపరింటెండెంట్లను అభినందిస్తూ అవార్డులను అందజేశారు.