పేదలకు వరం.. అన్న క్యాంటీన్
ABN , Publish Date - May 19 , 2026 | 12:01 AM
పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థానిక అన్న క్యాంటీన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. రోజూ 1,200 మంది ఆకలి తీరుస్తోంది. రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఈ క్యాంటీన్ వరంలా పరిణమిస్తోంది.
చోడవరంలో విశేష స్పందన
రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు
రోజూ 1,200 మంది ఆకలి తీరుస్తున్న వైనం
చోడవరం, మే 18 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థానిక అన్న క్యాంటీన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. రోజూ 1,200 మంది ఆకలి తీరుస్తోంది. రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఈ క్యాంటీన్ వరంలా పరిణమిస్తోంది.
అనకాపల్లి, నర్సీపట్నం వంటి అర్బన్ ప్రాంతాలను మినహాయిస్తే గ్రామీణ ప్రాంతంలో మాడుగుల, పాయకరావుపేట, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల కంటే చోడవరంలోని అన్న క్యాంటీన్‌కు ఆదరణ బాగుందని నిర్వాహకులు చెబుతున్నారు. స్థానికంగా గత నెల 15న ప్రారంభించిన అన్న క్యాంటీన్ రోజుకు 1,200 మంది కడుపు నింపుతున్నది. ఉదయం 500 మంది టిఫిన్లు చేస్తుండగా, మధ్యాహ్నం 700 మంది భోజనాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పేదలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఈ అన్న క్యాంటీన్ ఆకలి తీర్చే అన్నదాతగా మారింది. ఈ క్యాంటీన్ ఉదయం, మధ్యాహ్నం వేళలో నిత్యం రద్దీగా ఉంటోంది. ఉదయం అల్పాహారంగా ఇడ్లీతో పాటు సాంబారు, చట్నీ, పూరీ లేదా ఉప్మా పెడుతున్నారు. పూరీ లేకపోతే ఇడ్లీతో పాటు ఉప్మా, మరో రోజు పొంగల్ పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో కూర, సాంబారు, అన్నం, పచ్చడి, పెరుగుతో భోజనం పెడుతున్నారు. భోజనం నాణ్యతతో పాటు రుచిగా ఉండడంతో జనం ఆనందంగా ఆరగిస్తున్నారు.